Search
Thursday 24 May 2018
  • :
  • :

చారిత్రక విజయమిది..

dwn

సఫారీ  గడ్డపై సిరీస్ తో కోహ్లీ సేన సంచలనం

మన తెలంగాణ / క్రీడా విభాగం:దక్షిణాఫ్రికా గడ్డపై సిరీస్ గెలిచిన తొలి భారత జట్టుగా విరాట్ కోహ్లి సేన చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు ఎన్నో సార్లు సౌతాఫ్రికాలో పర్యటించిన టీమిండియా ఏనాడు కూడా సిరీస్ గెలుచు కోలేదు. అయితే ఈసారి మాత్రం కోహ్లి సేన ఆ లోటు తీర్చింది. టెస్టుల్లో కూడా గెలిచే అవకాశాలు లభించినా ప్రతికూల పరిస్థితుల్లో దాన్ని సాధించ లేక పోయింది. కానీ, వన్డేల్లో మాత్రం సిరీస్ గెలిచి కొత్త ఆధ్యాయానికి తెర లేపింది. అసాధారణ ఆటతో భారత జట్టు దక్షిణాఫ్రికాను చిత్తు చేసి 41తో సిరీస్‌ను కైవసం చేసుకోవడం మరచి పోలేని విషయం. టెస్టుల్లో ఓటమితో భారత్ వన్డేల్లో గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. అయితే భారత్ మాత్రం అద్భుత పోరాట పటిమతో అందరి అంచనాలను తారు మారు చేస్తూ లక్షం దిశగా సాగింది. ఒక్కో మ్యాచ్‌ను గెలుచుకుంటూ సిరీస్‌ను సొంతం చేసుకుంది. మధ్యలో నాలుగో వన్డేలో ఓటమి ఎదురు కావడంతో సిరీస్ గెలుపుపై మళ్లీ అనుమానాలు నెలకొన్నాయి. కానీ, కీలకమైన ఐదో వన్డేలో గెలిచిన టీమిండియా సిరీస్‌ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. సొంత గడ్డపై ఎదురు లేని శక్తిగా పేరున్న దక్షిణాఫ్రికాను ఓడించడం ఏ జట్టుకైన దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఒక్క ఆస్ట్రేలియా తప్ప సఫారీ గడ్డపై ఆధిపత్యం చెలాయించిన ఘనత ఏ జట్టుకు లేదు. తాజాగా భారత్ కూడా తాను సఫారీలను ఓడించగలనని చాటి చెప్పింది. భారత క్రికెట్ ఈ విజయం కీలక మలుపుగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. విదేశాల్లో రాణించలేదని పేరును రానున్న రోజుల్లో టీమిండియా చెరి పేసుకోవడం ఖాయమని వారు స్పష్టం చేస్తున్నారు. టెస్టుల్లో కూడా దాదాపు సౌతాఫ్రికాను ఓడించినంత పని చేసిన భారత్ వన్డేల్లో పూర్తి ఆధిపత్యం చెలాయించడం దీనికి నిదర్శనంగా వారు పేర్కొంటున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ చాలా బలంగా మారడమే దీనికి కారణమని వారంటున్నారు. టెస్టుల్లో దక్షిణాఫ్రికాను మూడు మ్యాచుల్లోనూ రెండేసి ఆలౌట్ చేసిన ఘనత బౌలర్లకు దక్కింది. దక్షిణాఫ్రికా గడ్డపై గతంలో ఏ జట్టు కూడా ఈ ఫీట్‌ను సాధించలేదు. అంతేగాక ఓడిన రెండు టెస్టుల్లో కూడా చాలా వరకు భారత్ ఆధిపత్యం చెలాయించింది. కీలక సమయంలో ఒత్తిడికి గురి కావడంతో తొలి రెండు టెస్టుల్లో ఓటమి పాలైంది. అయితే మూడో టెస్టులో గెలిచి భారత్ సత్తా చాటింది. సొంత గడ్డపైనే కాకుండా విదేశాల్లోనూ గెలిచే సత్తా తనకుందని ఈ మ్యాచ్ ద్వారా భారత్ చాటింది. తాజాగా వన్డే సిరీస్‌ను గెలిచి తాను సౌతాఫ్రికాకు ఏమాత్రం తీసి పోనని, భవిష్యత్తులో ప్రపంచ క్రికెట్‌ను శాసించే సత్తా తనకుందని భారత్ స్పష్టం చేసింది. ఇదే జోరును రానున్న ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లలో కూడా భారత్ కనబరచడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే గతంలో విండీస్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాల మాదిరిగానే భారత్ కూడా ప్రపంచ క్రికెట్‌ను ఏలడం ఖాయం.
లోపాలు సరిదిద్దుకోవాలి…
భారత్ వన్డే సిరీస్‌ను గెలుచుకున్నా ఇప్పటికీ కొన్ని లోపాలు జట్టును వెంటాడుతూనే ఉన్నాయి. బ్యాటింగ్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్, కెప్టెన్ విరాట్ కోహ్లిలు మాత్రమే రాణించారు. బౌలింగ్‌లో కూడా యువ స్పిన్నర్లు యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌లు మాత్రమే సత్తా చాటారు. టెస్టుల్లో రాణించిన భువనేశ్వర్, బుమ్రాలు వన్డేల్లో అంతగా ప్రభావం చూపలేక పోయారు. బ్యాటింగ్‌లో కూడా టాప్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ముఖ్యంగా సీనియర్ ఆటగాడు, ఓపెనర్ రోహిత్ శర్మ వైఫల్యం జట్టును వెంటాడింది. తొలి నాలుగు వన్డేల్లో రోహిత్ ఘోరంగా విఫలమయ్యాడు. నాలుగు ఇన్నింగ్స్‌లలో అతను నిరాశే మిగిల్చాడు. కేవలం ఐదో వన్డేలో మాత్రమే సెంచరీతో కదం తొక్కాడు. అజింక్య రహానె కూడా ఒక మ్యాచ్‌లో మాత్రమే రాణించాడు. మిగిలిన వన్డేల్లో అతను పెద్దగా పరుగులు చేయలేక పోయాడు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో రహానె విఫలమయ్యాడనే చెప్పాలి. అతను ఇప్పటికైన బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక, యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కూడా ఆశించి స్థాయిలో రాణించడం లేదు. నిలకడలేమి బ్యాటింగ్‌తో నిరాశ పరిచాడు. యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య కూడా పేలవమైన ఫాంతో సతమతమవుతున్నాడు. బ్యాట్‌తో, బంతితో జట్టుకు అండగా నిలువలేక పోతున్నాడు. సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనిది కూడా ఇటువంటి పరిస్థితే. ఒక్క మ్యాచ్‌లోనే ధోని కాస్త మెరుగ్గా ఆడాడు. మిగతా మ్యాచుల్లో అతను సత్తా చాటడంలో విఫలమ్యాడు. కాగా, రానున్న రోజుల్లో టీమిండియా కోచ్, కెప్టెన్ ఈ వైఫల్యాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. లేకుంటే జట్టుకు ఇబ్బందికర పరిస్థితులు తప్పక పోవచ్చు.

Comments

comments