Search
Wednesday 20 June 2018
  • :
  • :

డ్రగ్స్ కేసులో 3 చార్జిషీట్లు

drugs

కోర్టు అనుమతితో త్వరలో మరికొన్ని
సిట్‌కు అందిన నలుగురు సినీ ప్రముఖుల ఫోరెన్సిక్ రిపోర్టులు

మన తెలంగాణ/ హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల సినీ పరిశ్రమను ఒక కుదుపు కుదిపేసిన ‘కెల్విన్ డ్రగ్స్ రాకెట్’ కేసులో సిట్ అధికారులు కోర్టుకు మూడు చార్జిషీట్లను దాఖలు చేశారు. మరికొన్ని దాఖలుకు సిద్ధంగా ఉన్నా సాంకేతిక అంశాల నేపథ్యంలో కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంది. డ్రగ్స్ కేసులో విచారణను ఎదుర్కొన్న సినీ ప్రముఖులను ఈ కేసులో సాక్షలుగా చేర్చారా లేక నిందితులుగా చేర్చారా అనే అంశం చార్జిషీట్ వెలుగులోకి వస్తే తేలిపోతుంది. చార్జిషీట్ కాపీలు ఇంకా బయటికి రాకపోవడంతో సినీ పరిశ్రమలో పలువురు గుబులు చెందుతున్నారు. ఛార్జిషీట్‌లను దాఖలు చేసిన విషయం కూడా బైటకు పొక్కకుండా జాగ్రత్త తీసుకున్నప్పటికీ ఏసిబికి చెందిన ఒక పోలీసు ఉన్నతాధికారి మూడు ఛార్జిషీట్లను దాఖలు చేసినట్లు ధృవీకరించారు. డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులు రవితేజ, పూరీ జగన్నాథ్, సుబ్బరాజు, ముమైత్‌ఖాన్, నందు, తరుణ్, నవదీప్, చార్మీ, అఖిల్ చౌదరి, శ్యాం కే నాయుడు, తనీష్‌తో పాటు పలువురు విచారణను ఎదుర్కొన్నారు. వీరి పేర్లు చార్జీషీట్లో నిందితులుగా చేర్చారా లేదా అనే విషయం తెలియరాలేదు. పేర్లను వెల్లడించడానికి ఆ అధికారి నిరాకరించారు. డ్రగ్స్ సరఫరాదారులు, వాడకందారులు అనే విషయాన్ని సిట్ అధికారులు చార్జిషీట్లో స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిసింది. ఇప్పటికే 11 కేసుల్లో 22 మందిని ‘సిట్’ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొన్న సినీ ప్రముఖుల ఫోన్ నుంచి ప్రధాన నిందితుడు కెల్విన్‌కు 40 ఎస్‌ఎమ్‌ఎస్‌లు వెళ్లాయని, అందులో ఒక్క ఎస్‌ఎమ్‌ఎస్‌లో మాత్రమే ఎల్‌ఎస్‌డి అనే పదం ఉందని, మిగతా వాటిలో బ్లాటింగ్, మెటేరియల్ అనే పదాలను వాడినట్లు సిట్ అధికారులు తేల్చారు. చార్జిషీట్లు దాఖలు కావడంతో సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో సిట్ విచారణ దాదాపుగా ముగిసినట్లే భావించవచ్చు.
సిట్‌కు అందిన ఫోరెన్సిక్ నివేదిక…
సినీ ప్రముఖుల విచారణ సందర్భంగా వారు డ్రగ్స్ ఉపయోగించారా లేదా అనేది రూఢీ చేసుకునేందుకు అధికారులు వారి వెంట్రుకలు, రక్తం, వేలి గోర్లను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పరీక్షల నిమిత్తం పంపించారు. ఇందులో నలుగురికి చెందిన ఫోరెన్సిక్ నివేదికలు సిట్ అధికారులకు అందాయి. సినీ ప్రముఖులు డ్రగ్స్ వాడినట్లు ఇందులో ఒకవేళ తేలినట్లు ఉన్నా వారు ఎక్కడ డ్రగ్స్ తీసుకున్నారో చెప్పడం కష్టమని, ఫలానా చోట, ఫలానా దేశంలో డ్రగ్స్ తీసుకున్నాడని నిరూపించటం సాధ్యం కాదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కొన్ని దేశాల్లో సందర్భం, అవసరాన్ని బట్టి డ్రగ్స్ వాడకానికి చట్టబద్దత ఉందని, ఆ దేశాల్లో డ్రగ్స్ తీసుకుని ఉంటే పరిస్థితి ఏమిటన్న అంశాన్ని కోర్టు పరిగణలోకి తీసుకునే అవకాశముందని పేర్కొంటున్నారు.

Comments

comments