Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

దక్షిణాఫ్రికా జయభేరి

soth
రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఓటమి

సిరీస్ సమం

పోర్ట్ ఎలిజబెత్: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో సిరీస్‌ను 11తో సమం చేసింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 239 పరుగులకు ఆలౌటైంది. తర్వాత 101 పరుగుల లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య సౌతాఫ్రికా నాలుగు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఒకవైపు ఆస్ట్రేలియా బౌలర్లు వరుస క్రమంలో వికెట్లు తీసినా లక్షం మరి చిన్నదిగా ఉండడంతో ఫలితం లేకుండా పోయింది. ఓపెనర్ ఐడెన్ మార్‌క్రమ్ మూడు ఫోర్లతో 21 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ డీన్ ఎల్గర్ (5) నిరాశ పరిచాడు. కాగా, స్టార్ ఆటగాళ్లు హాషిం ఆమ్లా, డివిలియర్స్‌లు జాగ్రత్తగా ఆడుతూ జట్టును లక్షం దిశగా నడిపించారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో జట్టును ఆదుకున్న డివిలియర్స్ ఈసారి కూడా కీలకమైన పరుగులు సాధించాడు. ధాటిగా ఆడిన ఎబి డివిలియర్స్ 4ఫోర్లు, ఒక సిక్స్‌తో 28 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరోవైపు ఆమ్లా మూడు ఫోర్లతో 27 పరుగులు చేసి జట్టు విజయంలో తనవతు సహకారం అందించాడు. కాగా, కెప్టెన్ డుప్లెసిస్ 2(నాటౌట్)తో కలిసి బ్రూన్ 15 (నాటౌట్) మిగతా లాంఛనాన్ని పూర్తి చేశాడు. అంతకుముందు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 239 పరుగులకు ఆలౌటైంది. సఫారీ బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తూ ఆసీస్ ఇన్నింగ్స్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. మిఛెల్ మార్ష్ 45 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వికెట్ కీపర్ టీమ్ పైన్ 28 పరుగులు చేశాడు. చివర్లో హాజిల్‌వుడ్ రెండు ఫోర్లు, ఒక సిక్స్‌తో 17 పరుగులు చేసి వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన రబడా రెండో ఇన్నింగ్స్‌లోనూ చెలరేగి పోయాడు. ఈసారి ఆరు వికెట్లు పడగొట్టాడు. కేశవ్ మహారాజ్, ఎన్‌గిడిలకు రెండేసి వికెట్లు లభించాయి. రబడాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

Comments

comments