Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

యూకి బాంబ్రీ సంచలనం

gam

 12వ సీడ్ లుకాస్‌కు షాక్, పరిబాస్ ఓపెన్
కాలిఫోర్నియా: ఇక్కడ జరుగుతున్న బిఎన్‌పి పరిబాస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత స్టార్ యూకి బాంబ్రీ పెను సంచలనం సృష్టించాడు. రెండో రౌండ్‌లో బాంబ్రీ 64, 64 తేడాతో ఫ్రాన్స్‌కు చెందిన ప్రపంచ 12వ ర్యాంక్ ఆటగాడు లుకాస్ పాయిలేపై సంచలన విజయం సాధించాడు. యూకి కెరీర్‌లో ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమ విజయం కావడం విశేషం. గతంలో అతను ప్రపంచ 14వ ర్యాంక్ క్రీడాకారుడిని ఓడించాడు. ఈసారి లుకాస్‌ను ఓడించడం ద్వారా రికార్డును తిరగ రాశాడు. లుకాస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత స్టార్ యూకి పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. చూడచక్కని షాట్లతో అలరించిన యూకి ఏదశలోనూ ప్రత్యర్థిని కోలుకోనివ్వలేదు. కళ్లు చెదిరే ఏస్‌లు సంధిస్తూ ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఈ క్రమంలో వరుసగా రెండు సెట్లను గెలిచి మూడో రౌండ్‌కు దూసుకెళ్లాడు. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన యూకి ఏదశలోనూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా గంట పది నిమిషాల్లోనే మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. మూడో రౌండ్‌లో యూకి అమెరికా ఆటగాడు శామ్ క్వెరిను ఎదుర్కొంటాడు.

జొకోవిచ్ ఔట్…

gm
మరోవైపు మాజీ నంబర్‌వన్, సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. రెండో రౌండ్‌లో జొకోవిచ్ జపాన్‌కు చెందిన క్వాలిఫయర్ టారో డానియల్ చేతిలో కంగుతిన్నాడు. మూడు సెట్ల సమరంలో డానియరల్ 76, 46, 61 తేడాతో జొకోవిచ్‌ను ఓడించాడు. తొలి సెట్‌లో పోరాటం నువ్వానేనా అన్నట్టు సాగింది. ఇద్దరు సర్వం ఒడ్డడంతో రసవత్తర సమరం తప్పలేదు. ఇద్దరు ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా శ్రమించారు. దీంతో సెట్ టైబ్రేకర్ వరకు వెళ్లింది. ఇందులో డానియల్ పైచేయి సాధించి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. కాగా, రెండో సెట్‌లో మాత్రం సెర్బియా యోధుడు నొవాక్ పుంజుకున్నాడు. తనకు మాత్రమే సాధ్యమయ్యే షాట్లతో జపాన్ ఆటగాడిని హడలెత్తించాడు. ఇదే క్రమంలో సెట్‌ను కూడా దక్కించుకున్నాడు. కానీ, ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో మాత్రం సీన్ మళ్లీ రివర్స్ అయ్యింది. ఈసారి డానియల్ ఆధిపత్యం చెలాయించాడు. దూకుడుగా ఆడుతూ ముందుకు సాగాడు. ఇదే సమయంలో నొవాక్ ఒత్తిడికి గురయ్యాడు. దీంతో వరుస తప్పిదాలకు పాల్పడ్డాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న డానియల్ 61తో సెట్‌ను గెలిచి మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. మరో పోటీలో స్విట్జర్లాండ్ దిగ్గజం, టాప్ సీడ్ రోజర్ ఫెదరర్ విజయం సాధించాడు. అర్జెంటీనా ఆటగాడు ఫెడరికొ డెల్బొనిస్‌తో జరిగిన పోరులో ఫెదరర్ 63, 75తో జయకేతనం ఎగురు వేశాడు. తొలి సెట్‌ను సునాయాసంగా గెలుచుకున్న ఫెదరర్‌కు రెండో సెట్‌లో ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ తప్పలేదు. అయితే చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన ఫెదరర్ రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. వర్షం వల్ల మ్యాచ్‌కు చాలా సార్లు అంతరాయం కలిగింది.

Comments

comments