Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

బ్రహ్మానందానికి హాస్య నటబ్రహ్మ బిరుదు ప్రదానం

cini

హాస్యనటుడు బ్రహ్మానందం సార్థక నామధేయుడని… ఆయన పేరులోనే ఆనందం ఉందని తెలంగాణ శాసనసభాపతి మధుసూధనాచారి పేర్కొన్నారు. ఆయన యావత్ జాతికి హాస్యాన్ని పంచుతున్న మహానటుడని కొనియాడారు. టిఎస్‌ఆర్ కాకతీయ లలితా కళాపరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి మహబూబ్‌నగర్‌లో జరిగిన కాకతీయ కళా వైభవ మహోత్సవానికి మధుసూధనాచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా 1100 చిత్రాలు పూర్తిచేసిన బ్రహ్మానందంకు ‘హాస్య నటబ్రహ్మ’ బిరుదును ప్రదానం చేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం చేతికి మధుసూధనాచారి బంగారు కంకణం తొడిగి వీణ, జ్ఞాపికలను బహూకరించారు. అనంతరం మధుసూధనాచారి మాట్లాడుతూ కాకతీయ కళా వైభవం కార్యక్రమాల ద్వారా కాకతీయుల కీర్తిని విశ్వవ్యాప్తం చేయడానికి టి.సుబ్బరామిరెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమ నిర్వాహకులు టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ “తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కాకతీయ కళా వైభవోత్సవాలను నిర్వహిస్తాం. తెలుగువారి సత్తా, శక్తిని అందరికీ తెలియజేస్తాం. బ్రహ్మానందం ఓ జీనియస్ నటుడు. 1100 చిత్రాల్లో నటించి ఆయన రికార్డు సృష్టించారు. ఇక కాకతీయ కళావైభవోత్సవానికి రాజకీయాలతో సంబంధం లేదని… కళలను ప్రోత్సహించేందుకే ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నాం”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో జయప్రద, జీవిత, రాజశేఖర్, శ్రద్ధాదాస్, అలీ, శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబు, మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, ఎంపీలు జితేందర్ రెడ్డి, నంది ఎల్లయ్య, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు బాబుమోహన్, శ్రీనివాస్ గౌడ్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments