Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

ప్రజాస్వామ్యంపై దాడి

harish

కాంగ్రెస్ సభ్యుల తీరు హేయం
స్వామిగౌడ్‌పై వీధి గూండాల్లా ప్రవర్తించారు : హరీశ్‌రావు

మన తెలంగాణ/ హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్‌ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు దాడి చేసిన తీరు హేయమైనదని శాసనసభా వ్యవహారాల మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌పై జరిగిన దాడి ప్రజల మీద, ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి అని అన్నారు. కాంగ్రెస్ నేతలు వీధి గూండాల్లా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఆర్‌ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో శాసననమండలి చీఫ్‌విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, విప్‌లు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎంఎల్‌సి కర్నె ప్రభాకర్, ఎంఎల్‌ఎ మర్రి జనార్దర్‌రెడ్డిలతో కలిసి సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గవర్నర్‌ను ఏకవచనంతో సంభోదిస్తూ అనరాని మాటలు అన్నారని, జరిగిన ఘటనలు బాధ కలిగించాయని పేర్కొన్నారు. మైక్‌లు,హెడ్‌పోన్‌లు విరగ్గొట్టి గవర్నర్‌పైకి విసిరారని, పెన్నులు, కండ్ల జోడులను, చింపిన పుస్తకాల ముక్కలను యథేచ్ఛగా గవర్నర్‌పైకి విసిరారని చెప్పారు. గవర్నర్ లక్షం గా చేసుకుని శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తాను గవర్నర్‌ను టార్గెట్ చేసి విసిరిన హెడ్‌ఫోన్ పొరపాటున స్వామిగౌడ్‌కు తగిలిందని, ఆయనపై దాడి చేసే ఉద్దేశం తనకు లేదని కాంగ్రెస్ ఎంఎల్‌ఏ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నట్లు టివిలో వచ్చిందన్నారు. కాగా కాంగ్రెస్ దాడిలో గాయమైంది స్వామిగౌడ్‌కు కాదని ప్రజాస్వామిక వ్యవస్థకని అన్నారు. సిఎం కెసిఆర్ బాగా కష్టపడి అభివృద్ధి చేస్తున్న తెలంగాణకు మంచి పేరు రావడం జీర్ణించుకోలేక కాంగ్రెస్ నేతలు దాడికి దిగారని ఆరోపించారు. తెలంగాణ పరువు తీయాలని కాంగ్రెస్ నేతలు దాడికి దిగారని అన్నారు. సిఎల్‌పి నేత జానారెడ్డి లాంటి వారు ఈ దా డిని ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. ఈ దాడి వెనుక ఏదో కుట్ర ఉన్నదని జానారెడ్డి, భట్టి విక్రమార్కలు అనడం విచారకరమన్నారు. గవర్నర్‌పై దాడి చేసిన వారిది కుట్ర అంటారా? సభలో సంయమనం పాటించి గౌరవాన్ని కాపాడిన మాది కుట్ర అంటారా? అని ప్రశ్నించారు. అన్నీ అంశాలను చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటే కాంగ్రెస్ పారిపోతోందన్నారు.
మాది భగత్‌సింగ్ పోరాటం, వారిది ఉగ్రవాదం : ఉద్యమ సమయంలో తాము గొడవ చేసింది నిజమేనని, పరాయి పాలనలో జరిగిన ఆ సభలో తమ గొంతు నొక్కారని, అందుకే ఆనాడు ఆలా వ్యవహరించామని హరీశ్‌రావు అన్నారు. నాడు సభలో మా నిరసనకు, నేడు సభలో కాంగ్రెస్ చర్యలకు దేశభక్తికి, దేశద్రోహానికి ఉన్నంత తేడా ఉన్నదన్నారు. పార్లమెంట్‌పై భగత్ సింగ్ దాడి చేశారని, కొన్నేళ్ళ క్రితం ఉగ్రవాదులు దాడి చేశారని, తమది భగత్‌సింగ్ తరహాలో దేశభక్తితో కూడుకున్నదని, కాంగ్రెస్ చేసిన దాడి పార్లమెంట్ మీద ఉగ్రవాదులు చేసిన దాడి లాంటిదని వ్యాఖ్యానించారు. సభలో జరిగిన ఘటనలపై సిసి టీవీ ఫుటేజ్ ఆధారంగా రికార్డుల పరీశీలించి బాధ్యులపై చర్యలు తీసుకునే అధికారాన్ని స్పీకర్‌కు బిఎసి అప్పజెప్పిందని వెల్లడించారు. సభలో పోలీసులను మొహరించారన్న కాంగ్రెస్ ఆరోపణను ప్రశ్నించగా, గవర్నర్‌పై దాడి జరిగాకే మార్షల్స్ వచ్చారని సమాధానమిచ్చారు.

Comments

comments