Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

బుల్ జంప్

bsns

 నిఫ్టీ 195, సెన్సెక్స్ 611 పాయింట్లు ర్యాలీ
 నాలుగు శాతం లాభపడిన ఐటిసి
 ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో సూచీల జోరు

ముంబై: కొద్ది రోజులుగా చతికిలబడిన మార్కెట్లు ఒక్కసారిగా జంప్ చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల అంశాలతో సోమవారం సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా లాభపడింది. ఆఖరికి 33,917 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 194 పాయింట్లు పెరిగి 10,421 వద్ద స్థిరపడింది. ఆసియా, యూరోపియన్ మార్కెట్ల లాభాలతో సూచీలు ఆద్యంతం భారీగా ర్యాలీ చేశాయి. 2017 జూలై తరువాత ఈ స్థాయిలో సూచీలు ర్యాలీ చేయడం ఇదే మొదటిసారి. అయితే ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లు మాత్రం బలహీనంగానే కదలాడాయి. ట్రేడింగ్‌లో పిఎస్‌యూ బ్యాంకింగ్ షేర్లు తప్ప మిగతా అన్ని రంగాలకు చెందిన షేర్లు లాభపడ్డాయి. ఐటిసి 4శాతం ర్యాలీ చేయడంతో ఎఫ్‌ఎంసిజి రంగ సూచీ అత్యధికంగా 3శాతం లాభపడింది.ఇక కీలకమైన నిఫ్టీ బ్యాంక్ సూచి 367.75 పాయింట్లు 1.51 శాతం లాభపడి 24,664 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 33,468 నుంచి 33,962 పాయింట్ల మధ్య శ్రేణిలో కదలాడింది. ఇక నిఫ్టీ సూచీ 10,295 నుంచి 10,433.65 శ్రేణిలో ట్రేడ్ అయ్యింది. మిడ్ సెషన్‌లో ప్రారభమైన ర్యాలీ ట్రేడింగ్ ముగిసే వరకు కొనసాగడంతో బిఎస్‌ఇ సెన్సెక్స్ 33917.94 వద్ద, నిఫ్టీ 10,421.40 పాయింట్ల వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో ఎన్‌టిపిసి, వేదాంత లిమిటెడ్, ఐటిసి, భారతీ ఎయిర్ షేర్లు 4 నుంచి 5 శాతం లాభపడ్డాయి. టెక్ మహింద్ర, అరబిందో ఫార్మా, కోల్ ఇండియా షేర్లు నష్టపోయాయి. కొద్ది రోజులుగా మార్కెట్లు భేరిష్ ఉండడంతో.. షేర్ల విలువలు తగ్గాయి. దీంతో తగ్గుముఖం పట్టిన షేర్లను చౌక ధరలకు కొనుగోలు చేసేందుకు మదుపరులు ఆసక్తి చూపడం కూడా మార్కెట్లు లాభాలకు కారణమైంది.
పుంజుకున్న మిడ్, స్మాల్ క్యాప్‌లు
కొద్ది రోజులుగా నేలచూపులు చూస్తున్న బిఎస్‌ఇ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు.. సోమవారం 0.7 శాతం పుంజుకున్నాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1366 లాభపడగా, 1363 నష్టాలను నమోదు చేశాయి.
ఎఫ్‌పిఐల పెట్టుబడులు
అమ్మకాలకే ప్రాధాన్యమిస్తున్న ఎఫ్‌పిఐ(విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు) శుక్రవారం భారత్ స్టాక్‌మార్కెట్లో రూ.550 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. గత కొంతకాలంగా పెట్టుబడుల బాటలో సాగుతున్న దేశీ ఫండ్స్(డిఐఐలు) స్వల్పంగా రూ. 65 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి. గత బుధ, గురువారాల్లో ఎఫ్‌పిఐలు రూ. 1,080 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా, డిఐఐలు రూ. 1,075 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి.

Comments

comments