Search
Wednesday 20 June 2018
  • :
  • :

చూస్తూ ఊరుకోవాలా?

kcr

అరాచక శక్తుల అంతు చూస్తాం
మాది తప్పయితే ప్రజలే తీర్పు ఇస్తారు : సిఎం

మన తెలంగాణ/ హైదరాబాద్: శాసనసభ లోపల గానీ, బయట గానీ అరాచక శక్తుల పీచమణచడంలో ప్రభుత్వం ఏ మాత్రం వెనుకడుగు వేయదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా చోటు చేసుకున్న ఘటన కాంగ్రెస్ సభ్యులు సభ లోపలగానీ, బయటగానీ కొనసాగిస్తున్న అరాచకానికి పరాకాష్ఠ అని, అరాచకం చేస్తామంటే భరించే ప్రశ్నే ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు.తాము తీసుకున్న నిర్ణయాలు తప్పే అయితే ప్రజలే అంతిమ న్యాయనిర్ణేతలని సిఎం కెసిఆర్ అన్నారు. ప్రజలే తమ తీర్పు వెల్లడిస్తారన్నారు. కాంగ్రెస్ సభ్యులపై చర్య తీసుకున్న అనంతరం ఆయన శాసనసభలో ప్రసంగించారు. ఇలాంటి పరిస్థితులు మన శాసనసభలో వస్తాయని ఊహించలేదని, ఇది బాధాకరం, దురదృష్ట కరమని వ్యాఖ్యానించారు. నిర్ణయం కఠినమైనదైనా తప్పదని చెప్పారు. తాము కొడతామనుకున్నది గవర్నర్‌ను అని, అది తప్పి మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు తగిలిందని టివిలో కాంగ్రెస్ సభ్యులు అనడాన్ని ప్రపంచమంతా చూసిందని, ఇంత దారుణమైన , అసహన వైఖరి ఎందుకని ప్రశ్నించారు. నాలుగేళ్ళ నుండి శాంతి భద్రతలు రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఉన్నాయని, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగడం లేదని, దీనిని చూసి ఓర్వలేక మేము అరాచకలు సృష్టిస్తామంటే ఊరుకోబోమన్నారు. రాజకీయ నాయకుల ముసుగులో ఇష్టమొచ్చిన అరాచకం చేస్తామంటే సహించబోమని, మైకులు విసిరికొట్టి, మార్షల్స్ అడ్డం ఉంటే బల్ల ఎక్కి కొట్టి నగ్నంగా బైట పడి నాటకమాడుతున్నారని, పైగా చైర్మన్‌ను పట్టుకొని నాటకమాడుతున్నారనడం అవమానకరమన్నారు. కాంగ్రెస్ నేతలు ప్రవర్తించిన తీరు సిగ్గుచేటన్నారు. గొడవ చేయాలనే ఉద్దేశం, రభస చేయాలని కాంగ్రెస్ ముందే నిర్ణయం తీసుకున్నట్లు తమకు ముందే సమాచారం ఉన్నదని తెలిపారు. 2014 తర్వాత ఏ ఎన్నికలు జరిగినా ఏ ఒక్క ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలువలేదని, కనీసం డిపాజిట్లు కూడా రాలేవన్నారు. అచ్చంపేట మున్సిపాలిటీలో అందరూ కలిసినా ఒక్కసీటు కూడా దక్కలేదన్నారు. అందుకు తమపై కక్ష, ఇర్షను పెంచుకున్నారన్నారు. నాలుగు సంవత్సరాలుగా ప్రజలు బ్రహ్మండగా ఉన్నారని, ఎంతో సంతోషంగా ఉన్నారని, దీనిని ఓర్వలేకనే కాంగ్రెస్ ఇలా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. ఇలాంటి అరాచక శక్తుల పీచమణచివేస్తామని, ఎవరినీ ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. గత సమావేశాల్లో విపక్షాలు ఎన్ని రోజులు కోరితే అన్ని రోజులు సభ నిర్వహించామని ఈ సారి కూడా అదే విధంగా నిర్వహిస్తామని చెప్పినా తొలిరోజే వారు ఆందోళన చేపట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. బిఎసి సమావేశంలో అన్నింటికీ అంగీకరించి, సభలోకి రాగానే ఆందోళన చేయడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. సభలో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోవాలా ..? అని అన్నారు. సభ హుందాతనంగా నడిపించడంలో తాము కఠినంగానే ఉంటామని, సభలోపల, బయట ఇలాంటి చర్యలను సహించబోమన్నారు.
తనకు ఏదో విష జబ్బు ఉన్నదని, త్వరలోనే అమెరికా పోతాడని, నాలుగేళ్లుగా విషపూరిత ప్రచారం చేశారని సిఎం కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు ఇలాంటి చీఫ్ పాలిటిక్స్ చేశారన్నారు. కాంగ్రెస్ అరాచకాలు పరాకాష్ఠకు చేరాయన్నారు. అధికారంలోనికి వచ్చి ఐదు రోజలకు తాను ఢిల్లీ వెళ్లానని, అప్పటి నుంచే కాంగ్రెస్ నేతలు ఇష్టమొచ్చినట్లు వ్యవహారించారని, తమ పార్టీ జెండా దిమ్మెలను కూల్చివేశారని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత కెసిఆర్ ఇంటి ముందు కుక్క కూడా రాదన్నారని, ప్రభుత్వం కూలిపోతుందని ఇలా అనేకరకాలుగా ప్రచారం చేశారన్నారు.

Comments

comments