Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

పిఎస్‌బి పాలన మెరుగుపర్చాలి

bs

ముంబై: డైమండ్ వ్యాపారీ నీరవ్ మోడీ వేల కోట్ల రుణాల కుంభకోణం నేపథ్యంలో ప్రభుత్వరంగ బ్యాంకులకు(పిఎస్‌బి) రీక్యాపిటలైజేషన్ అందించి, త్వరితగతిన కోలుకునేలా చర్యలు చేపట్టాలని ఐఎంఎఫ్(అంతర్జాతీయ ద్రవ్య నిధి) పేర్కొంది. ఎన్‌పిఎ(నిరర్థక ఆస్తుల) సమస్యను పరిష్కరించేందుకు ఇటీవల భారత్ చేపట్టిన సంస్కరణలు దోహదం చేస్తాయి. బ్యాంకింగ్, కార్పొరేట్ రంగాల్లో బలహీన పరిస్థితులను ఈ సంస్కరణలు పరిష్కరిస్తాయని ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ టావో జాంగ్ అన్నారు. భారత్‌లో పర్యటన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2015 డిసెంబర్‌లో ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) ‘అస్సెట్ క్వాలిటీ రివ్యూ’ను ప్రారంభించిందని.. దీని ప్రకారం, 2017 మార్చి ముగింపు నాటికి బ్యాంకుల అన్ని నిరర్థక ఆస్తులను గుర్తించి, తగిన చర్యలు చేపట్టనుందని అన్నారు. 2016 మే నెలలో కొత్తగా దివాలా చట్టంతో పాటు ఇతర ముఖ్యమైన చర్యలు చేపట్టిందని, ఇటీవల పిఎస్‌బిలకు ప్రభుత్వం రీక్యాపిటలైజేషన్‌ను ప్రకటించిందని టావో జాంగ్ అన్నారు.
అసోచామ్‌క్రిసిల్ అధ్యయనం ప్రకారం, భారత్ బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి ఆఖరునాటికి రూ.9.5 లక్షల కోట్లకు చేరతాయి. 201617 బ్యాంకుల్లో ఎన్‌పిఎలు రూ.8 లక్షల కోట్లు ఉండగా.. ఈసారి లక్షన్నర కోట్లు పెరిగింది. అయితే ఎన్‌పిఎ(నిరర్థక ఆస్తుల) తీర్మానాన్ని వేగంవంతం చేసేందుకు విస్తృత ఆర్థిక సంస్కరణల ప్యాకేజీలో భాగంగా పిఎస్‌బిలకు మూలధన నిధులను అందించాలని ఐఎంఎఫ్ సూచించింది. అలాగే పిఎస్‌బిల పాలన మెరుగుపర్చి, ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వరంగం పాత్రను తగ్గించాలని, అలాగే బ్యాంకుల రుణ సామర్థాన్ని పెంచాల్సి ఉందని టావో జాంగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. డైమండ్ వ్యాపారీ నీరవ్ మోడీ, ఆయన మాన మెహుల్ చోక్సీలు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో రూ.13 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు. ఈ కేసుకు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నలకు జాంగ్ స్పందించలేదు.

Comments

comments