Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

తళుక్కుమన్న తొలి తార

lfe

సృష్టి ఎప్పుడు ప్రారంభమైంది…అనే విషయంపై చాలా సంవత్సరాలుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో విశ్వంలో తొలి నక్షత్రాన్ని కనుగొని ప్రపంచ శాస్త్రవేత్తలందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది .ఐదుగురు శాస్త్రవేత్తల బృందం. వారిలో భారతదేశానికి చెందిన నివేదితా మహేష్ ఉండటం విశేషం. బృందంలో ఒకరిగా నిలిచి అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంది.

తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన నివేదితకు చిన్నప్పటి నుంచీ పరిశోధనలంటే ఇష్టం. దీంతో కోవైలోని పీఎస్‌జీ కాలేజీ ఆఫ్ టెక్నాలజీలో ఇన్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ పూర్తిచేసింది. అనంతరం బెంగళూరులోని రామన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో ఖగోళశాస్త్ర విభాగంలోని ఆచార్యులు సుబ్రమణ్యన్‌తో కలిసి పనిచేసింది. అప్పుడే ఆమెకు ఖగోళ సృష్టి రహస్యాలను ఛేదించాలనే ఆసక్తి కలిగింది. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో పీజీ, అరిజోనా స్టేట్ యూనివర్సిటీలో రీసెర్చి అసిస్టెంట్‌గా, తర్వాత సీనియర్ అసిస్టెంట్‌గా అంచెలంచెలుగా ఎదిగింది. అరిజోనా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తల బృందంలో ఒకరిగా ఉండి తొలి నక్షత్రకాంతిని కనుక్కుని ప్రపంచ దృష్టిని ఆకట్టుకుంది.
గత నాలుగేళ్లుగా నివేదిత సహా ఐదుగురు శాస్త్రవేత్తల బృందం విశ్వం ప్రారంభమైనప్పుడు తొలి నక్షత్రాల నుంచి వెలువడిన కాంతికిరణాలను గుర్తించడంపై పరిశోధనలు చేస్తున్నారు. అనంత విశ్వంలో 13.8 బిలియన్ల సంవత్సరాల క్రితం అతి పెద్ద విస్ఫోటనం ఏర్పడింది. ఈ క్రమంలో విశ్వం ఒక్కసారిగా చీకటి పదార్థంగా అంటే డార్క్ మేటర్‌గా మారినట్లు పరిశోధనలు చెబుతున్నాయి. ఆ సమయంలో సూర్యుడూ, నక్షత్రాలు, కాంతిలేని శూన్యం, చీకటి మాత్రమే ఉండేది. అయితే అది చల్లబడి పరమాణువులుగా విడిపోవడమే కాకుండా, కాంతినిరోధకాలుగా మారాయి. దాదాపు 3,70,000 సంవత్సరాల వరకు అంతా చీకటే అని గత పరిశోధనలు వెల్లడించాయి. ఆ చీకటి నుంచి దాదాపు 180 మిలియన్ల సంవత్సరాల తర్వాత వచ్చిన తొలి కిరణం వెలుతురును గుర్తించారు నివేదిత బృందం. ఈ అంశంపై నాలుగేళ్లుగా వారు పరిశోధన చేస్తున్నారు. ఈ రీసెర్చ్‌లో మొదట నక్షత్రాలు ఆవిర్భవించి , కాస్మిక్ డాన్‌గా పిలిచే విశ్వం ప్రారంభమై ఉండొచ్చని భావిస్తున్నారు. తొలి నక్షత్ర వెలుగుతో ఎన్నో అంశాలను పరిశోధించే అవకాశం కలిగినట్లు చెబుతోంది నివేదిత.
నక్షత్రాలు ఆవిర్భవించడానికి కారణాలు, అవి ఏ పరిస్థితుల్లో ఏర్పడ్డాయనే అంశాలపై పరిశోధన చేశాం. ప్రత్యేక టెలిస్కోప్ ద్వారా కనిపెట్టిన కాంతి కిరణాలకు సంబంధించి మరింత పరిశోధన చేయబోతున్నాం. నా మొదటి సెమిస్టర్‌లోనే ఇంత పెద్ద పరిశోధనలో నేకూ భాగసామ్యం కలగడం అదృష్టం అంటోంది నివేదిత. ఈ పరిశోధనా ఫలితం కేవలం విశ్వం ప్రారంభం కావడానికి పట్టిన సమయం గురించి మాత్రమే కాకుండా, ఏళ్ల తరబడి విశ్వమంతా చీకటిలో ఉండటానికి గల నిగూఢమైన కారణాలను వెదకడానికి అవకాశంగా మారిందంటోంది.

Comments

comments