Search
Wednesday 20 June 2018
  • :
  • :

సమస్యల సుడి గుండంలో మైలార్‌దేవరం పల్లి

tankమన తెలంగాణ/ వికారాబాద్ రూరల్ :  దేశాభివృద్ధికి గ్రామాల అభివృద్ధే ప్రధాన లక్షం కావాలని మహాత్మా గాంధీ చెప్పిన మాటను పెడచెవిన పెట్టారు రాజకీయ నాయకులు.  వికారాబాద్ మండల కేంద్రంలోని మైలార్‌దేవరం పల్లి గ్రామం సమస్యల సుడి గుండంలో కొట్టుమిట్టాడుతున్నది. మంచి నీటి కొరకు గ్రామ అవసరం తీర్చడానికి రెండు నీటి భాండాగారాలను నిర్మించారు. ఈ ట్యాంకులను నీళ్ళతో నింపుటకు సమీపంలోని బోరులో నీరు పుష్కళంగా ఉన్నాయి. ట్యాంకులకు చిన్న చిన్న రిపేరింగులు చేస్తే రెండు నీటి భాండాగారాలు వాడుకలోకి వచ్చి, 75 శాతం గ్రామ ప్రజల దాహార్తిని తీర్చవచ్చని గ్రామ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజూ రద్దీగా ఉండే హనుమాన్ మందిర్ దగ్గర ఉన్న బోర్‌ను రిపేర్ చేస్తే గుడికి, ఈ ఊరికి వచ్చి పోయే ప్రయాణీకుల దాహం తీర్చడానికి సిద్ధంగా ఉన్నా పట్టించుకున్న పాపాన పోలేదని గ్రామ ప్రజలు ఆక్రోషం వెళ్ళగక్కుతున్నారు. బిసీ కాలనీకి వెళ్ళడానికి సిసి రోడ్డు లేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం వస్తే కాలనీ వాసులు తమ ఇళ్ళకు చేరాలంటే బురదలో నుంచి వెళ్ళవలసి వస్తుందని కాలనీ వాసులు తమ ఆవేదనను వ్యక్త పరుస్తున్నారు. ఇళ్ళలో నుంచి మురుగు రోడ్డుపై విచ్చలవిడిగా పారుతున్నందున కాలనీ వాసులు తీవ్ర జబ్బులతో సహవాసం చేస్తున్నామని తమ ఆవేదన వ్యక్త చేశారు. రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయకపోవడం కారణంగా ఇళ్ళ ముందు మురుగు ఏరులై పారుతుందని కాలనీ వాసులు తెలుపుతున్నారు. మురుగు కారణంగా నిత్యం దోమలతో సహవాసం చేయాల్సి వస్తుందని కాలనీ వాసులు అన్నారు. దోమల వలన తరచూ చలి, జ్వరం వంటి రోగాలతో సతమతమవుతున్నామని గ్రామ ప్రజలు అంటున్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పైప్‌లైన్‌ల పనుల కొరకు తవ్విన గుంతల కారణంగా రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ పొలాలకు వెళ్ళడానికి, ఊరి నుంచి ఒకే ఒక దారి ఉండడం వలన బండ్లు, పశువులు, రైతులు దాటాలంటే అష్టకష్టాలు పడవలసి వస్తుందని గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూగ జీవాల దాహార్తిని తీర్చడానికి నీటి తొట్టిలను నిర్మించినా వాటిని ఉపయోగంలోకి తీసుకరాలేదని రైతులు అన్నారు. వచ్చే కాలం ఎండా కాలం నీటి ఎద్దడి తీవ్రంగా ఉంటుందని ప్రజలు తెలుపుతున్నారు. నీటి తొట్టిలోకి నీరు నింపడానికి అతి సమీపంలో పుష్కళంగా నీరు ఉన్న బోరు ఉన్నా వినియోగంలోకి తేవడం లేదని రైతులు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా ఊరి సమస్యలను తీర్చడానికి ఎవరు వస్తారోనని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు మైలార్‌దేవరంపల్లి గ్రామ ప్రజలు.

Comments

comments