Search
Wednesday 20 June 2018
  • :
  • :

హార్ట్‌ఎటాక్ అవునో కాదో ..!

lf

మారిన జీవనశైలితో గుండె జబ్బుల ముప్పు పెరుగుతోంది. ఏటా ఇలాంటివి చాలా కేసులు నమోదవుతున్నాయి. చిన్న వయసులోనే గుండెబబ్బు బారిన పడుతున్న కేసుల సంఖ్య కూడా అధికమవుతోంది. ప్రాణాలు కోల్పోతున్న వారు కూడా ఎందరో. ఇది గుండెపోటు సంకేతమే అని గుర్తించి నిమిషాల వ్యవధిలో ఆస్పత్రికి వెళ్లగలిగితే నిండు ప్రాణాన్ని నిక్షేపంగా కాపాడుకునేందుకు ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది. అందుకే గుండెపోటు లక్షణాలన్నవి తెలుసుకుని, ఆ విధమైన అవగాహనతో ఉండడం ఎంతో అవసరం. హార్ట్‌ఎటాక్ అన్నది వైద్యపరంగా అత్యవసరపరిస్థితి. రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండెకు రక్తసరఫరా నిలిచిపోయి హార్ట్ ఎటాక్ వస్తుంది. లేదా రక్తనాళాలు కుచించుకుపోయి గుండెకు రక్త సరఫరా తగినంత అందకపోయినా గానీ గుండెనొప్పి వస్తుంది. రక్త సరఫరా నిలిచిపోవడంతో శరీరంలోని కణాలకు ఆక్సిజన్ అందదు. దీంతో ప్రాణాంతకం అవుతుంది. ప్రతి 33 సెకన్లకు ఒకరు హార్ట్ ఎటాక్ కారణంగా మన దేశంలో ప్రాణాలు కోల్పోతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఏటా 20 లక్షల మంది బలైపోతున్నారు. హార్ట్ ఎటాక్ బారిన పడుతున్న వారిలో 4 నుంచి 10 శాతం మంది 45 ఏళ్లలోపు వయసు వారుంటున్నారు.
ఛాతీ పట్టేసినట్టు: ఛాతీ భాగంలో గట్టిగా పట్టేసినట్టు ఉంటుంది. ఎక్కువ మందిలో కనిపించే ప్రథమ లక్షణం ఇది. గుండెకు సంబంధించి ఆర్టరీ పూడుకుపోయినా, హార్ట్ ఎటాక్ లోనూ ఛాతిలో నొప్పి, పట్టేసినట్టు, ఒత్తిడి అనిపిస్తుంది. ఒక్కొక్కరికీ ఒక్కోరకమైన అనుభవం కనిపించొచ్చు. కొందరికి గుండెపై ఏనుగు కూర్చున్నట్టు ఉంటుంది. కొందరిలో నొక్కినట్టు, కాలుతున్నట్టు భావన కలుగుతుంది. కొందరిలో చాతిలో అసౌకర్యంగానూ ఉండొచ్చు. ఇదేదో ఒకటి రెండు నిమిషాలు ఉండిపోయేది కాదు… అలా చాలా సేపు ఉంటుంది. ఏదైనా పనిచేస్తున్న సమయంలో, నిద్రలోనూ ఈ పరిస్థితి ఏర్పడవచ్చు. చాలా చిన్న నొప్పి అయి, అలా ఉన్న చోట చేతితో అదిమినప్పుడు నొప్పి పెరిగితే అది గుండెకు సంబంధించినది కాకపోవచ్చు. వైద్య పరంగా చాతీ నొప్పిని యాంజినాగా పేర్కొంటారు. చేయి, భుజం నొప్పి: హార్ట్ ఎటాక్ సమయంలో ముందుగా కనిపించే లక్షణాల్లో ఇదీ ఒకటి. నొప్పి ప్రథమంగా ఛాతీలో మొదలై అక్కడి నుంచి ఎడమవైపు చేతిలోకి, భుజంలోకి విస్తరిస్తుంది. కొందరిలో రెండు చేతుల్లోనూ నొప్పి రావచ్చు. అలాగే వెన్ను, మెడ, కడుపులోనూ నొప్పి కనిపించొచ్చు.
తల తిరగడం, తల నొప్పి: బలహీనత, పోషకాహారం తీసుకోకపోవడం, ఆహారం మానేసిన సందర్భాల్లో తల తిగరడం, తలనొప్పి రావచ్చు. ఒకవేళ ఆహార పరంగా ఈ విధమైన లోపాలు లేకుండా, ఉన్నట్టుండి కళ్లు తిరుగుతూ, తలనొప్పి, ఛాతీ నొప్పి, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటే ఆలస్యం చేయకూడదు. బీపీ పడిపోవడం, గుండె రక్తాన్ని పంప్ చేయలేని స్థితిలో ఇలా ఉంటుందని అంటున్నారు వైద్యులు.
గొంతు లేదా దవడ నొప్పి: గొంతు లేదా దవడ నొప్పి అన్నవి జలుబు, సైనస్ సమస్యల్లో కనిపించే లక్షణాలు. కొన్ని సందర్భాల్లో గుండె నొప్పి సమయంలో ఛాతీ భాగంలోని అధిక ఒత్తిడి గొంతు, దవడ వైపునకు ఎగదన్నుతుందని అంటున్నారు.అలసట, ఆయాసం, బరువు పెరగడం: గుండె ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని శరీరానికి అవసరమైనంత పంప్ చేయలేని స్థితి వల్ల అలసట, ఆయాసం కనిపిస్తాయి. గుండె పనితీరు తగ్గుతోందన్న దానికి సంకేతంగా శరీర బరువు పెరగడాన్ని అనుమానించొచ్చు. పంపింగ్ బలహీనపడి రక్తం శరీరంలోని కింది భాగాలకు సరిగా సరఫరా కాదు. దీంతో కాలి మడమలు, కాళ్లు, తొడలు, పొత్తి కడపు భాగాల్లో ద్రవాలు నిండడం వల్ల బరువు పెరుగుతారు. అదే సమయంలో ఊపిరితిత్తుల్లోనూ నీరు చేరడం వల్ల రక్తంలోని కార్బన్ డై ఆక్సైడ్ స్థానంలో ఆక్సిజన్‌ను నింపి పంపే ప్రక్రియకు విఘాతం కలుగుతుంది. దీంతో త్వరత్వరగా అలసిపోతుంటారు. నడుస్తున్నా, మెట్లు ఎక్కుతున్నా ఎంతో అలసటగా ఉంటుంది.
కాళ్లలో వాపు: గుండె శరీరమంతటికీ రక్తాన్ని సరిగా పంప్ చేయలేని స్థితిలో వివిధ భాగాల్లో వాపు కనిపిస్తుంది. గుండె రక్తాన్ని వేగంగా పంప్ చేయ లేకపోతే రక్తం నరాల్లోకి వెనక్కి వచ్చేస్తుంది. దీంతో వాపు కనిపిస్తుంది. వాపు కనిపించినంత మాత్రాన అది గుండెజబ్బుగానే అనుకోవడానికి లేదు, మూత్రపిండాల వైఫ్యలంలోనూ ఇదే విధంగా ఉంటుంది.
చెమట: పైన చెప్పుకున్న లక్షణాల్లో చాతీ పట్టేసినట్టు ఉండి చెమటలు పడుతుంటే మాత్రం అది హార్ట్ ఎటాక్ కు సంకేతమేనంటున్నారు వైద్య నిపుణులు.
అదే పనిగా దగ్గు: అదే పనిగా దగ్గు వస్తుంటే గుండె జబ్బే అనడానికి లేదు కానీ, గుండె జబ్బులున్నవారు, గుండెజబ్బుల రిస్క్ ఉన్న వారిలో ఈ విధంగా నిరంతరంగా దగ్గు వస్తూ, కళ్లె పడుతుంటే వైద్యులను సంప్రదించాలి.
గురక: గురక వస్తుంటే గుండెకు సంబంధించిన సమస్య ఉందేమో అని అనుమానించడం మంచిదే. చిన్నగా ఎప్పుడో కొద్ది సమయం పాటే రావడం వేరు. అలా కాకుండా అదే పనిగా పెద్ద శబ్దంతో వస్తుంటే మాత్రం అది స్లీప్ ఆప్నియా సమస్యకు సంకేతం కావచ్చు.
క్రమం తప్పిన గుండె లయలు: గుండె ఓ లయబద్ధంగా కొట్టుకోవాలి. అలా కాకుండా వేగంగా కొట్టుకుంటున్నా, చాలా నిదానంగా కొట్టుకుంటున్నా అది గుండెకు సంబంధించిన సమస్యకు సంకేతమే.
స్త్రీలు, పురుషుల్లో భిన్నంగా: మగవారిలో గుండెపోటు సమయంలో ఎక్కువగా చాతీలో పట్టేసినట్టు, నొప్పి, ఎడమచేయి, భుజం, వెన్ను నొప్పి తరహా లక్షణాలు కనిపిస్తే… అదే మహిళల్లో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడడం, తలతిరగడం, వాంతులు, దవడ నొప్పి, వెన్ను నొప్పి లక్షణాలు కనిపిస్తాయి. మగవారిలో ఇంకా వీపు భాగంలో ఉండే పెద్ద ఎముకల (షోల్డర్ బ్లేడ్స్) దగ్గర నొప్పి రావచ్చు. కడుపులో పైభాగంలోనూ నొప్పి వస్తుంది.
వీరికి రిస్క్ ఎక్కువ: కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉంటే అటువంటి వారికి రిస్క్ ఎక్కువే. అధిక కొలెస్ట్రాల్, అధిక ట్రై గ్లిజరైడ్స్, అధిక రక్తపోటు (హైపర్ టెన్షన్), మధుమేహం, క్రమం తప్పకుండా మద్యసేవనం, పొగతాగడం, పొగాకు ఉత్పత్తుల అలవాట్లు, అధిక బరువు, శారీరక శ్రమ లేని వారు, అధిక ఒత్తిడితో కూడిన పనుల్లో ఉన్నవారు, తగినంత నిద్ర, విశ్రాంతి లేని వారికి గుండె జబ్బుల ముప్పు చాలా ఎక్కువ. మహిళలతో పోలిస్తే మగవారిలో గుండె జబ్బుల రిస్క్ ఎక్కువ. చిన్న వయసులో గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్ బారిన పడుతున్న వారిలో పురుషులే అధికంగా ఉంటున్నారు. మహిళల్లోనూ మెనోపాజ్ తర్వాత రిస్క్ పెరుగుతోంది.
నిర్లక్ష్యం తగదు: పై తరహా లక్షణాల్లో ఏమున్నా గానీ, ఏం కాదులే అన్న నిర్లక్ష్యం తగదు. ముందుగా గుర్తిస్తే గుండెపోటుతో ప్రాణాపాయం తలెత్త కుండా నివారించేందుకు అవకాశం ఉంటుంది. గుండె పోటు బాధితుల్లో ఎక్కువ శాతం మందిలో ముందుగానే హెచ్చరికగా లక్షణాలు, సంకేతాలు కనిపిస్తుంటాయి. కానీ వారు వాటిని తేలికగా తీసుకోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. చాలా తక్కువ శాతం కేసుల్లోనే హార్ట్ ఎటాక్ అప్పటికప్పుడు రావడం వల్ల ప్రాణాంతకమవుతున్న వారుంటున్నారు. గుండె జబ్బులు, గుండె వైఫల్యం అన్నది అప్పటికప్పుడు ఒక గంటలోనో, ఒక రోజులోనే అవ్వడం అసాధ్యం. చాలా ముందు నుంచే (కొన్ని నెలలు) పనితీరులో మార్పు వస్తుంది. అందుకే 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఏడాదికోసారి, 45 ఏళ్లు దాటిన వారు ప్రతీ ఆరు నెలలకు ఓసారి, 60 ఏళ్లు దాటిన వారు ప్రతీ మూడు నెలలకోసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Comments

comments