Search
Friday 20 April 2018
  • :
  • :

కాప్రా చెరువు

Complete Information about Kapra Lake

సుదీర్ఘమైన చారిత్రక వారసత్వం ఉన్న తెలంగాణలో అనేక రాజవంశాలు పాలించి, సంస్కరణలకు అధికప్రాధాన్యం ఇచ్చాయి. శాతవాహనుల నుంచి నిజాంరాజుల వరకు వ్యవసాయరంగాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. అనేక చెరువులను తవ్వించి సాగునీరు అందించినట్లు చారిత్రక ఆధారాలు లభ్యమవుతున్నాయి. తరతరాల నుంచి చెరువులపైనే తెలంగాణ సాగు ఆధారపడి ఉన్నట్లు తెలుస్తుంది. అయితే సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో చెరువుల చరిత్ర ఛిద్రంకాగా పట్టణీకరణ పేరుతో చెరువులు కాలుష్యసాగరాలుగా మారాయి. విష్ణుకుండిన రాజుల రాజధానిగా విరాజిల్లిన కీసరలో క్రీస్తుశకం 435 నుంచి 470 వరకు పాలించిన రెండవ మాధవవర్మ కాలంలో యజ్ఞాలకు,యాగాలకు ప్రాధాన్యత లభించడంతో పాటు అడవులను నరికించి చెరువులను తవ్వించినట్లు తెలుస్తుంది. అలాగే నల్గొండ జిల్లాలోని తుమ్మలపల్లి విష్ణుకుండినుల తొలిరాజధాని ఇంద్రపాల నగరంగా ఇటీవల ఆధారాలు లభించాయి. అయితే కీసర కేంద్రంగా చేసుకుని పాలించిన విష్ణుకుండిన రాజులు అనేక చెరువులు,దేవాలయాలు నిర్మించారు. వ్యవసాయ అభివృద్ధి కోసం చెరువులను తవ్వించారు.

ఈ నేపథ్యంలో కీసర మండలంలోని కాప్రా చెరువుకు అధిక ప్రాధాన్యత ఉంది. సహజసిద్ధంగా ఏర్పడి తరతరాల నుంచి అభివృద్ధి సాధించిన కాప్రా చెరువు గతంలో మురికి కూపంగా మారడంతో పాటు కబ్జా కోరల్లో చిక్కుకుంది. ఆహ్లాదకరమైన ప్రకృతిలో గొలుసుకట్టు చెరువుల అనుసంధానంతో పరవళ్ళుతొక్కిన కీసర మండలంలోని కాప్రా చెరువు ఒకప్పటి విష్ణుకుండిన రాజుల ఏలుబడిలో ఉన్న తటాకం. ఆ తర్వాత గొలుసుకట్టు చెరువులకు కాకతీయులు ప్రాధాన్యత ఇవ్వగా కుతుబ్ షాహీలు, నిజాం రాజులు ఆ బాటలోనే ముందుకు సాగారు. అనంతరం పారిశ్రామిక ప్రగతి పేరుతో కాలుష్య సాగరంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ కు ఈశాన్య భాగంలో సైనిక్‌పురికి సమీపంలో ఉన్న ఈ చెరువు గట్టు పొడవు 1254 మీటర్లు ఉండగా, 113 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. 78.33 డిగ్రీల రేఖాంశం, 17.30 డిగ్రీల అక్షాంశంలో విస్తరించి ఉన్న ఈ తటాకానికి రెండు తూములు వ్యవసాయ భూములకు నీరు అందించేందుకు శతాబ్దాల క్రితం నిర్మించగా ప్రస్తుతం వాటి మనుగడ కోల్పోయాయి.

అలుగులతో అలరాలిన కాప్రాచెరువు రామకృష్ణాపురం, నాగారం, అన్ననారాయణ, బండచెరువు కాలువలతో గొలుసుకట్టుచెరువుగా నిర్మాణం జరిగింది. వేలాది ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు పారిశ్రామికీకరణకు ముందు తాగునీటిని అందించిన ఈ చెరువు పునరుద్ధరణకు తెలంగాణ సర్కార్ ప్రణాళికలను రూపొందించింది. ఒకప్పుడు వలసపక్షుల విహార ప్రాంతంగా, తెలుగు సినిమాల చిత్రీకరణకు వేదికగా ఉన్న ఈ చెరువును ఇప్పటికైనా ప్రభుత్వంతో పాటు ప్రజలు సంరక్షించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే చెరువు తీరప్రాంతాల్లో పురావస్తుశాఖ తవ్వకాలు చేపడితే విష్ణుకుండినుల కాలం నాటి చరిత్రకు మరికొన్ని ఆధారాలు లభించే అవకాశాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు. ఒకప్పడు దానవీరశూరకర్ణ చిత్రం షూటింగ్ ఇక్కడే జరిగింది. ఈ చిత్రంలోని కురుక్షేత్ర సన్నివేశాలు ఈ చెరువు వద్దే రూపొందించారు. అయితే గత వైభవానికి ప్రతీకగా నిలిచిన కాప్రా చెరువు కాకతీయ మిషన్ లో చోటు దక్కించుకొని పూర్వవైభవ పునరుద్ధరణ కోసం ఎదురుచూస్తోంది.

– వి. భూమేశ్వర్

Comments

comments