Search
Friday 20 April 2018
  • :
  • :

‘ఎఫ్ 2’నే ముందుగా ప్రారంభం

venky

యంగ్ హీరోలతో మల్టీస్టారర్స్ చేయడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తున్న వెంకటేశ్ రంగంలోకి దిగేశాడు. ‘గురు’ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఈ సీనియర్ స్టార్ ఆమధ్య తేజ దర్శకత్వంలో రూపొందే ‘ఆటా నాదే వేటా నాదే’ సినిమాతో బిజీ అయినట్టు వార్తలతో పాటు కొన్ని స్టిల్స్ కూడా బయటకు వచ్చాయి. కానీ ఆతర్వాత దాని అప్‌డేట్స్ మాత్రం అకస్మాత్తుగా ఆగిపోయాయి. ఇక ఫిదా, తొలి ప్రేమ సినిమాలతో వరుసగా హిట్స్ అందుకున్న వరుణ్‌తేజ్‌తో కలిసి వెంకటేశ్ చేయబోతున్న ‘ఎఫ్ 2’ స్క్రిప్ట్ ప్రస్తుతం ఫైనల్ అవుతోంది. ఈ మేరకు నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోలు వెంకటేశ్, వరుణ్‌తేజ్‌లు కలిసి చర్చించి ఈ స్క్రిప్ట్‌ను ఓకే చేస్తున్నారు. అయితే నాగచైతన్యతో కలిసి మరో సినిమా చేయబోతున్న వెంకటేశ్ దానికంటే ముందే ‘ఎఫ్ 2’ సినిమాను ప్రారంభించే సూచనలు కనిపిస్తున్నాయి. దర్శకుడు అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డు ఈ సినిమాకు బాగా ప్లస్ అవుతోంది. ఆయన తీసిన మూడు సినిమాలు పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్  ఒకదాన్ని మించి ఒకటి కమర్షియల్ హిట్స్‌గా నిలిచాయి. ఇప్పుడు చేయబోతున్న మల్టీస్టారర్ అంతకు రెట్టింపు వినోదంతో ఉండబోతోందని టాక్. హీరోయిన్‌లు, టెక్నికల్ టీమ్‌కు సంబంధించి  వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వినోదంతో పాటు మంచి యాక్షన్ కూడా ఈ సినిమాలో ఉంటుందని సమాచారం. ‘ఎఫ్ 2’ షూటింగ్‌ను త్వరగా పూర్తిచేసి దసరా లేదా దీపావళికి సినిమాను విడుదల చేసేలా ప్లానింగ్ చేస్తున్నట్టు తెలిసింది.

Comments

comments