Search
Friday 20 April 2018
  • :
  • :

అక్షయ తృతీయ మరింత ప్రియం

gd

గతంలో కంటే ఈసారి పెరిగిన పసిడి ధరలు 

ఇప్పటికే రూ.32 వేలు దాటిన పది గ్రాముల ధర

ఆహ్మదాబాద్ : ఈవారం అక్షయ తృతీయపై నగల వ్యాపారులు ఎంతో సానుకూలంగా ఉన్నారు. అయితే ప్రజలకు మాత్రం పసిడి ధరలు మాత్రం అందనంత ఎత్తుకు వెళ్లిపోయాయి. ఎంతో కొంత బంగారం కొనుగోలు చేయాలనే వారికి ఈనెల 18న అక్షయ తృతియ మరింత ప్రియమనే చెప్పాలి. గతంలో ఇదే పర్వదినాన బంగారం ధరలతో పోలిస్తే ఈసారి రేట్లు పెరగడమే ఇందుకు కారణం. అదే సమయంలో సిరియా, అమెరికా మధ్య ఆందోళనకర వాతావరణం నేపథ్యంలో సురక్షిత పెట్టుబడిగా బంగారం కొనుగోళ్లు చేపట్టడంతో.. వీటి ధరలు దిగివచ్చే ప్రసక్తే కనిపించడం లేదు. ఆహ్మదాబాద్‌లో శనివారం 10 గ్రాముల బంగారం ధర రూ.32,300గా ఉంది. చరిత్రను చూస్తే ప్రత్యేకించి ఈ అక్షయ తృతీయ పర్వదినంలో ఎప్పుడూ పది గ్రాముల పసిడి ధర రూ.30 వేలు దాటలేదు. గత ఏడాది 2016 మే 9న అక్షయ తృతీయ రోజు పసిడి ధర (10 గ్రాములు) రూ.29,860 గా ఉంది. బంగారం ధర వచ్చే మూడు నాలుగు రోజుల్లో ఇలాగే పెరిగితే అక్షయ తృతీయ నాడు పసిడి ధర అత్యధిక స్థాయికి చేరుకుంటుంది. అమెరికా చైనా ట్రేడ్ వార్(వాణిజ్య యుద్ధం) కారణంగా అంతర్జాతీయంగా బంగారం ధరలు ఇప్పటికే గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. దీనికి తోడు సిరియాఅమెరికా టెన్షన్ పెరగడంతో పుత్తడి ధరలు సోమవారం మార్కెట్లో మరింతగా పెరగవచ్చని బులియన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి హరేష్ ఆచార్య అన్నారు. రానున్న రోజుల్లో పసిడి ధరలు మరింత పెరగవచ్చని భావిస్తున్న తరుణంలో అక్షయ తృతీయ రోజు సేల్స్ మెరుగ్గా ఉంటాయని నగల వ్యాపారులు ఆశిస్తున్నారు. గత ఏడాదిలో బంగారం ధరలు రూ.28,861 వద్ద ఉన్నాయి.
2018 ప్రారంభంలో వీటి ధరలు రూ.28,500గా ఉన్న ధరలు ఇప్పుడు పెరిగాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు బంగారంపై ఆసక్తి చూపిస్తుండడం, ఇవి మంచి రాబడిని ఇస్తాయని వారు భావిస్తున్నారు.

అమ్మకాలు 20 శాతం పెరుగుతాయ్

నగల వ్యాపారుల అంచనా

gold

అక్షయ తృతీయ నాడు బంగారం విక్రయాలు 15 నుంచి 20 శాతం పెరగవచ్చని నగల వ్యాపారులు అంచనా వేస్తున్నారు. మార్కెట్ సెంటిమెంట్ సానుకూలంగా ఉండడం, నిలకడగా ధరలు, రానున్న పెళ్లి సీజన్ నేపథ్యంలో ఈసారి పసిడి సేల్స్ బాగుంటాయని వారు భావిస్తున్నారు. గత అక్షయ తృతియతో పోలిస్తే ఈసారి ఇంకా ఎక్కువగా పసిడి అమ్మకాలు ఉంటాయని ఆల్ ఇండియా జెమ్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్(జిజెసి) చైర్మన్ నితిన్ ఖండేవాల అన్నారు. ప్రస్తుతం 10 గ్రాముల పసిడి ధర రూ.30,820గా స్థిరంగా కొనసాగుతోందని, పెళ్లి సీజన్ సందర్భంగా విక్రయాలు మెరుగ్గా ఉంటాయని అన్నారు. ప్రత్యేకించి ట్రెండీ ఐటెమ్స్, వివాహ ఆభరణాలకు మరింతగా డిమాండ్ ఉండనుందని తెలిపారు. ఈ అక్షయ తృతీయనాడు 15-20శాతం అమ్మకాలు పెరుగుతాయని ఆశిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయంగా బులియన్ మార్కెట్ స్థిరంగా ఉందని ఇండియా బులియన్ అండ్ జ్యువెలరీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పిఎన్ గాడ్గిల్ తెలిపారు. నీరవ్ మోడీ కుంభకోణం బయటపడటంతో నగల తయారీ రంగం ఆశించిన స్థాయిలో పెరగలేదని పేర్కొన్నారు. వివాహాలకు సంబంధించిన ఆభరణాలకు బాగానే ఆర్డర్లు వస్తున్నాయని అక్షయ తృతీయనాడు డెలివరీ తీసుకునేందుకు ఇప్పటికే చాలా బుకింగ్‌లు జరిగాయని తెలిపారు.

నేటి నుంచి తొలి దశ గోల్డ్ బాండ్ విక్రయం

gld

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి దశ గోల్డ్ బాండ్ విక్రయాలను ప్రభుత్వం నేటి (ఏప్రిల్ 16) నుంచి ప్రారంభించనుంది. బ్యాంకులు, ఎస్‌హెచ్‌సిఐఎల్(స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్), ఎంపిక చేసిన పోస్ట్ ఆఫీస్‌లు, ఎన్‌ఎస్‌ఇ, బిఎస్‌ఇ వంటి స్టాక్ ఎక్సేంజ్‌లలో సావరిన్ గోల్డ్ బాండ్ సిరీస్1 విక్రయాలు చేపట్టనున్నారు. ఈ నెల 20 దాకా కొనుగోలుకు దరఖాస్తులు స్వీకరణ, మే 4న సర్టిఫికెట్స్ జారీ ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే వారికి.. ఇష్యూ ధరతో పోలిస్తే గ్రాముకు రూ. 50 మేర రేటు తగ్గుతుంది. ఈ స్కీము కింద కనిష్టంగా 1 గ్రాము విలువ చేసే యూనిట్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి గరిష్ఠంగా 500 గ్రాముల దాకా కొనుగోలు చేయొచ్చు.

Comments

comments