Search
Friday 20 April 2018
  • :
  • :

ఎస్‌సి, ఎస్‌టి చట్టంపై ఆర్డినెన్స్?

ind

 పలు మార్గాలను పరిశీలిస్తున్న కేంద్రం 

న్యూఢిల్లీ: ఎస్‌సి, ఎస్‌టిలపై అత్యాచారాలకు పాల్పడిన వారిని అరెస్టు చేయడానికి కొత్త మార్గదర్శకాలను నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్సు ను మార్చాల్సిన అవసరం ఉందని భావిస్తున్న కేంద్రం ఇందుకోసం ఆర్డినెన్స్‌ను తీసుకు రావడం ఒక మార్గంగా భావిస్తోంది. చట్టంలో ఇంతకు ముందున్న నిబంధనలను పునరుద్ధరించడానికి ఆర్డినెన్స్‌ను జారీ చేయ డం వల్ల తక్షణం ఉద్రిక్తతలను చల్లార్చడానికి సైతం తోడ్పడుతుందని ఈ అంశంపై ప్రభుత్వంలో వివిధ స్థాయిలలో జరుగుతున్న చర్చల గురించి తెలిసిన వర్గాలు అంటున్నాయి. ఎస్‌సి, ఎస్‌టిలపై అత్యాచారాల నిరోధక చట్టాన్ని సవరించడానికి వచ్చే జులైలో జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో ఒక బిల్లును ప్రవేశపెట్టడం ప్రభుత్వం ముందున్న రెండో మార్గమ ని ఆ వర్గాలంటున్నాయి. ‘ఒక వేళ ఆర్డినెన్స్‌ను జారీ చేస్తే దాన్ని కూడా బిల్లుగా మార్చాల్సి ఉంటుంది. పార్లమెంటు దాన్ని ఆమోదించాల్సి ఉం టుంది. రెండింటిలోనూ ఫలితం ఒక్కటే. అయితే ఆర్డినెన్స్‌ను జారీ చేయ డం వల్ల తక్షణ ప్రయోజనం ఉంటుంది. తక్షణం ఉద్రిక్తతలను చల్లార్చడానికి అది దోహదపడుతుంది’ అని ఆ వర్గాలు తెలిపాయి. గత మార్చి 20న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా చట్టాన్ని నీరు గార్చడానికి వ్యతిరేకంగా ఈ నెల 2న దేశవ్యాప్తంగా దళిత సంఘాలు నిర్వహించిన నిరసనలు హింసాత్మకంగా మారి పలువురు చనిపోవడం తెలిసిందే. దళితుల హక్కులను కాపాడడంలో ప్రభుత్వం విఫలమయిందని ప్రతిపక్షాలు సైతం ఆరోపిస్తున్నాయి. కాగా ఈ చట్టాన్ని నీరు గార్చడానికి ప్రభుత్వం అనుమతించబోదని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు కూడా.
అయితే ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై విచారణ ఎలా ముందుకు సాగుతుందనే దానిపై అంతా ఆధార పడి ఉంటుందని ఆ వర్గాలు అంటున్నాయి. రివ్యూ పిటిషన్ల వల్ల పెద్దగా ఫలితం ఉండదని, సుప్రీం కోర్టు నిర్ణయం అనుకూలంగా ఉండక పోవచ్చని, అందువల్ల ప్రభుత్వం తన వైఖరిపై కచ్చితమైన నిర్ణయానికి రావలసి ఉంటుందనికూడా ఆ వర్గాలు అంటున్నాయి. ఎస్సీ, ఎస్టీల చట్టంపై సుప్రీం తీర్పు కఠినమైన నిబంధనలను నీరుగార్చాయని, ఫలితంగా ప్రజల్లో ఆగ్రహం, పరస్పర విద్వేషాలకు కారణమయి దేశానికి తీవ్ర నష్టాన్ని కలగజేసిందని గత శుక్ర వారం సుప్రీం కోర్టుకు సమర్పించిన లిఖితపూర్వక వాదనలో కేంద్రం తెలిపింది. కోర్టు సున్నితమైన అంశాన్ని కదిపిందని, ఈ తీర్పు దేశంలో ఘర్షణ, ఆగ్రహం, అభద్రతాభావం, విశ్వాస రాహిత్యానికి కారణమైందని వాదనలో కేంద్రం వ్యాఖ్యానించింది.
చట్టాన్ని చేసే అధికారం కోర్టుకు లేనప్పటికీ చట్టాన్ని చేయగలననే తీరులో సుప్రీం కోర్టు తీర్పు ఉందని కూడా కేంద్రం అభిప్రాయపడింది. తమ తీర్పును వ్యతిరేకించే వారు తీర్పును చదవక పోవడమో లేదా స్వార్థపర శక్తులు వారిని తప్పుదోవ పట్టించడమే జరిగి ఉండవచ్చని అంటూ సుప్రీం కోర్టు తన తీర్పుఅమలును నిలిపివేయడానికి నిరాకరించడంతో కేంద్రం ఈ నిర్ణయానికి వచ్చింది.

Comments

comments