Search
Friday 20 April 2018
  • :
  • :

సులభ వాణిజ్యంలో మళ్లీ మనమే

bsns

372 వాణిజ్య సంస్కరణల్లో 100% సత్ఫలితాలు
ఐదు రాష్ట్రాలతో కలిసి మళ్లీ తొలిస్థానం
2016లోని 13వ స్థానం నుంచి 2017 నాటికి ప్రథమ స్థానానికి రప్పించిన మంత్రి కెటిఆర్

మన తెలంగాణ / హైదరాబాద్ : వాణిజ్య విభాగంలో సంస్కరణలను అమలు చేయడంలో మరే రాష్ట్రం కంటే మనం తీసిపోకుండా ఉండడంతో సులభ వాణిజ్య విధానం (ఇఒడిబి)లో ఈ సంవత్సరమూ మనం తొలి స్థానంలో నిలిచాం. మొత్తం 372 వాణిజ్య సంస్కరణల్లో వంద శాతం సత్ఫలితాలు (మన రాష్ట్రానికి వర్తించని నాలుగు సంస్కరణలు మినహా) సాధించడంతో ఐదు రాష్ట్రాలతో పాటు తెలంగాణ కూడా తొలి స్థానంలో నిలిచింది. గతేడాది సైతం ఆంధ్రప్రదేశ్‌తో కలిసి తొలి స్థానంలో (రెండు రాష్ట్రాలకూ 99.73% స్కోరు వచ్చింది) ఉండగా ఈసారి హర్యానా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లకు సమానంగా నిలిచాం. గతేడాదితో పోలిస్తే ఈసారి చాలా రాష్ట్రాలు వాణిజ్య సంస్కరణలపై దృష్టి పెట్టాయి. అందువల్లనే గతేడాది దిగువ స్థానంలో ఉన్న కొన్ని రాష్ట్రాలు ఈసారి అనూహ్యంగా పైకి దూసుకొచ్చా యి. వరుసగా రెండో ఏడాది కూడా సులభ వాణిజ్య విభాగంలో తెలంగాణ తొలి స్థానంలో నిలవడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన మంత్రి కెటిఆర్ పరిశ్రమల శాఖ అధికారులను అభినందించారు. గతేడాదితో పోలిస్తే కొన్ని అదనపు సంస్కరణలను ప్రవేశపెట్టిన కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాల నుంచి సంస్కరణల అమలుపై నివేదికలను ఆహ్వానించింది. గతేడాది అక్టోబరు నాటికి ఆయా సంస్కరణల అమలుకు సంబంధించిన వివరాలను సమర్పించడానికి తుది గడువు విధించి ఆ తర్వాత పొడిగించింది. అన్ని రాష్ట్రాల నుంచి అందిన వివరాలను అధ్యయనం చేసిన మంత్రిత్వశాఖలోని పరిశ్రమల ప్రోత్సాహక పాలసీ విభాగం ర్యాంకులను ఖరారు చేసింది. ఇందులో ఆరు రాష్ట్రాలూ వంద శాతం సత్ఫలితాలు సాధించడంతో ఇవన్నీ తొలి స్థానంలో నిలిచాయి. మొత్తం 19 రాష్ట్రాలు 60% కంటే ఎక్కువ మార్కులను సాధించాయి. గోవా మినహా మిగిలిన 18 రాష్ట్రాలూ 92% కంటే ఎక్కువ ఫలితాలు సాధించాయి. కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ అధికారికంగా ఇంకా ర్యాంకులను ప్రకటించాల్సి ఉంది. సులభతర వాణిజ్య విధానంలో ఆయా రాష్ట్రాలకు వచ్చిన ర్యాంకింగ్‌లకు అనుగుణంగా పారిశ్రామిక పెట్టుబడులు వస్తుంటాయి. 2016లో తెలంగాణ రాష్ట్రం 13వ స్థానంలో ఉండగా పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న కెటిఆర్ చొరవ తీసుకుని సంస్కరణలను సంతృపితకరంగా అమలుచేయడానికి అధికారులను ఉత్సాహపర్చడంతో 2017 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు సమానంగా తొలి స్థానం లభించింది. అదే ఒరవడిని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా సంతృప్తికరమైన ఫలితాలు సాధించడంతో మళ్ళీ తొలి స్థానం లభించింది.
‘టిఎస్ ఐపాస్’ పేరుతో దేశంలోనే ఉత్తమ పారిశ్రామిక పాలసీని రూపొందించిన తెలంగాణ దాన్ని అమలు చేయడంలోనూ అంతే చిత్తశుద్ధి ప్రదర్శించడంతో ఇఒడిబిలో సైతం తొలి స్థానం లభించడం కలిసొచ్చే అంశం. పరిశ్రమల స్థాపనకు ఆయా రాష్ట్రాల్లో ఉన్న విధానాలను అధ్యయనం చేయడంతో పాటు ఇఓడిబి ర్యాంకులను కూడా పారిశ్రామికవేత్తలు పరిగణనలోకి తీసుకుంటారు. అన్ని రాష్ట్రాలకంటే భేషైన పారిశ్రామిక విధానం (టిఎస్ ఐపాస్)తో పాటు ర్యాంకింగ్‌లో కూడా తొలి స్థానంలో ఉన్నందువల్ల పారిశ్రామిక పెట్టుబడులకు తెలంగాణ అనువైన రాష్ట్రంగా నిలిచినట్లయింది.

Comments

comments