Search
Friday 20 April 2018
  • :
  • :

కాంక్రీటు బాహుబలి కాళేశ్వరం

kaleshqaram

ఒకేరోజు 7,139 క్యూబిక్ మీటర్ల కాంక్రీటును వినియోగించిన చరిత్ర
ఆసియా ఖండంలోనే రికార్డు సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు

ఫలిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకత్వం
పనుల్లో విశేష వేగం, ఇంజినీర్లను అభినందించిన మంత్రి హరీశ్

*సిఎం పర్యటించిన నాటికి కేవలం 3 బూమ్ ప్లేసర్లు వాడుతుండగా ఇప్పుడు 12కు పెరిగింది.
ఆ రోజుకి కేవలం నాలుగు బ్యాచింగ్ ప్లాంట్లను వినియోగిస్తుండగా ఇప్పుడు అది ఎనిమిదికి చేరుకున్నది. బ్యాచింగ్ ప్లాంట్ సామర్థం 390 ఘ.మీ. నుంచి 870 ఘ.మీ.కు పెరిగింది.
*అప్పుడు రోజుకు 1,245 మంది కార్మికులు పనిచేస్తుండగా ఇప్పుడు 3,065కు పెరిగింది.
*అప్పుడు 113 మంది ఇంజనీర్లు పనిచేస్తుండగా ఇప్పుడు 162కు పెరిగారు.
*సిమెంటు కాంక్రీట్‌ను మిక్స్ చేసే సంఖ్య 25 నుంచి 85కు పెరిగింది.
*శనివారం ఒక్కరోజే మూడు బ్యారేజీల దగ్గర లక్షకు పైగా సిమెంటు బ్యాగుల వినియోగం జరిగింది. ఇందులో ఒక్క మేడిగడ్డ బ్యారేజీ దగ్గరే 52,820 బ్యాగుల సిమెంటు వినియోగమైంది.
*మూడు పంప్ హౌజ్‌ల దగ్గర ఒక్కరోజే 4,098 ఘ.మీ. కాంక్రీట్ వినియోగం జరిగింది.

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు మరో రికార్డును సృష్టించింది. ప్రాజెక్టు పనులను వేగం చేస్తూ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఒకేరోజున 7,139 ఘనపు మీటర్ల మేర సిమెంటు కాం క్రీటును వినియోగించి ఆసియాఖండంలోనే రికార్డు సృష్టించిందని రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ స్పష్టం చేసింది. అతి తక్కువ కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసి ఆసియా ఖండంలోనే సరికొత్త రికార్డును సృష్టించినట్లవుతుందని పేర్కొన్నది. అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలతో పాటు గ్రావిటీ కెనాల్ మూడు దశల పనులు, మూడు ఎత్తిపోతల పంప్‌హౌస్‌ల వద్ద కూడా కలుపుకుంటే ఒకేరోజు (ఏప్రిల్ 14న) 20,447 ఘన పు మీటర్ల సిమెంటు కాంక్రీటును వినియోగించిందని, ఇంత రికార్డు స్థాయిలో పనులు జరగడానికి కారణం ముఖ్యమంత్రి కెసిఆర్ గతేడాది డిసెంబరు 7వ తేదీన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీతో పాటు కన్నేపల్లి పంప్‌హౌస్, అన్నారం బ్యారేజీలను పరిశీలించిన తర్వాత పనుల్ని వేగవంతం చేయాలని మార ్గనిర్దేశనం చేయడమేనని సాగునీటి పారుదల శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే భూసేకరణ చేపట్టడం, అంతర్ రాష్ట్ర ఒప్పందాలు కుదుర్చుకోవడం, కేంద్ర ప్రభుత్వం నుంచి పలు రకాల అనుమతులను సాధించడం, టెండర్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయడం, నిర్మాణాన్ని ఊహించనంత వేగం చేయడం.. ఇలా అనేక రికార్డులను సృష్టించిన కాళేశ్వరం, ఇప్పుడు రోజువారీ పనులను వేగంగా చేయడంలో సరికొత్త రికార్డును సృష్టించిందని వెల్లడించింది. రికార్డు స్థాయిలో పనులు చేస్తున్నందుకు కాంట్రాక్టు సంస్థ ఎల్ అండ్ టి తో పాటు ఇంజినీ ర్లు, సిబ్బంది, కార్మికులు తదితరులందరినీ మంత్రి హరీశ్‌రావు అభినందించారు. ఇదే వేగాన్ని చివరి వరకూ కొనసాగించాలని, రోజుకు మూడు టిఎంసిల నీటిని ఎత్తిపోసే ఈ పథకం పూర్తయితే సిఎం కల సాకారమవుతుందని పేర్కొన్నా రు. ప్రాజెక్టుల నిర్మాణ రంగంలో కాళేశ్వరం పనులు చరిత్ర లో ఎప్పటికీ నిలిచిపోతాయని ఆయన వ్యాఖ్యానించారు.
ఫలితాలిస్తోన్న సిఎం మార్గదర్శకత్వం : ముఖ్యమంత్రి కెసిఆర్ సుమారు 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్షంతో అత్యంత సాహసోపేతంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని, గతేడాది డిసెంబరు 7వ తేదీన స్వయంగా ప్రాజెక్టు పనులను పరిశీలించారని, వానాకాలం నాటికి కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి నీటిని పంపాలన్న లక్షం నెరవేరాలంటే రోజుకు కనీసంగా ఏడు వేల ఘనపు మీటర్ల కాంక్రీటు పనులు జరగాల్సి ఉంటుందని, ఆ దిశగా పనులను వేగవంతం చేయాలని సూచించినట్లు సాగునీటిపారుదల శాఖ ఆ ప్రకటనలో పేర్కొనింది. సిఎం కెసిఆర్ పర్యటన చేసి వెళ్ళిన ఈ నాలుగు నెలల్లో పనులు జరుగుతున్న తీరు, సాధిస్తున్న ఫలితాలు, మొత్తం ప్రాజెక్టు పురోగతి నిపుణులైన ఇంజనీర్లకు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులకు కూడా ఆశ్చర్యం కలిగిస్తోందని పేర్కొనింది. సిఎం పర్యటన చేసిన సమయంలో మేడిగడ్డ బ్యారేజీలో రోజుకు సగటున 1,169 ఘనపు మీటర్ల కాంక్రీటు పనులు మాత్రమే జరుగుతుండేవని, ఆయన ఆదేశాల మేరకు పకడ్బందీ ప్రణాళిక రూపొందించడం ద్వారా, వివిధ శాఖల మధ్య, వాటి అధికారుల మధ్య మెరుగైన సమన్వయం సాధించడం, కార్మికుల సంఖ్యను, పర్యవేక్షక (ఆన్ సైట్) ఇంజనీర్ల సంఖ్యను పెంచడం, యంత్రాలను అదనంగా సమకూర్చడం తదితర కారణాల వలన ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజీలో 7,139 ఘనపు మీటర్లు, పంప్‌హౌజ్ దగ్గర 1,786 ఘ.మీ., అన్నారం బ్యారేజీ దగ్గర 3,215 ఘ.మీ., పంప్‌హౌజ్ దగ్గర 838 ఘ.మీ., సుందిళ్ళ బ్యారేజీ దగ్గర 3,076 ఘ.మీ., పంప్‌హౌజ్ దగ్గర 1,602 ఘ.మీ., గ్రావిటీ కెనాల్ దగ్గర 762 ఘ.మీ., ఆరవ ప్యాకేజీ దగ్గర 707 ఘ.మీ., ఏడవ ప్యాకేజీ దగ్గర 720 ఘ.మీ., ఎనిమిదవ ప్యాకేజీ దగ్గర 592 ఘ.మీ. చొప్పున మొత్తం ఈ పది ప్రాంతాల్లో శనివారం ఒక్క రోజే 20,447 ఘ.మీ. మేర సిమెంటు కాంక్రీటు పనులను చేసినట్లు అధికారులు ఆ ప్రకటనలో వివరించారు. ముఖ్యమంత్రి మేడిగడ్డ బ్యారేజిని సందర్శించి వెళ్ళిన తర్వాత ఇప్పటివరకు ఆ ఒక్కచోటనే సుమారు 5.39 లక్షల ఘనపు మీటర్ల సిమెంటు కాంక్రీటు పనులు జరిగాయని, సిఎం పర్యటించే సమయానికి ఇది కేవలం 77,946 ఘ.మీ. మాత్రమేనని వివరించారు.
ప్రారంభం నుంచీ కాళేశ్వరం ఒక రికార్డు : మంత్రి హరీశ్
ముఖ్యమంత్రి ఆలోచన మొదలు నిరంతర పర్యవేక్షణ, సూచనలు, సలహాలు కాళేశ్వరం ప్రాజెక్టు పురోగతికి, రికార్డు సాధనకు ప్రధాన కారణమని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ఇదే వేగాన్ని కొనసాగించి సిఎం ఆశిస్తున్నట్లుగా రోజుకు మూడు టిఎంసిల నీటిని ఎత్తిపోస్తే కల సాకారమైనట్లేనని, ఆ తీరులోనే ప్రాజెక్టును పూర్తి చేసి అతి తక్కువ కాలంలో ప్రాజెక్టును నిర్మించిన ‘ఆసియా రికార్డు’ సృష్టిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో భాగస్వాములైన ఎల్ అండ్ టి సంస్థతో పాటు ఇంజనీర్లు, కార్మికులు, సిబ్బంది… ఇలా ప్రతి ఒక్కరినీ హరీశ్‌రావు అభినందించారు. ప్రాజెక్టుకు ఆలోచన జరిగినప్పటి నుంచి అతి తక్కువ కాలంలో భూసేకరణ జరిగిందని, కేంద్రం నుంచి అటవీ, పర్యావరణ అనుమతులు తెచ్చుకున్నామని, పొరుగు రాష్ట్రంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని, టెండర్లను సకాలంలో పిలిచామని.. ఇలా అన్ని దశల్లోనూ రికార్డు సృష్టించామని గుర్తుచేశారు. ఇప్పుడు జరుగుతున్న వేగం ఇకపైన కూడా కొనసాగాలని, ఇందుకోసం రెవిన్యూ, సాగునీటిపారుదల, అటవీ, విద్యుత్, గనులు తదితర ప్రభుత్వ శాఖల, ఏజెన్సీల, కాంట్రాక్టు సంస్థల మధ్య మెరుగైన సమన్వయం, సమిష్టి కృషి ఉండాలని, నిర్ణీత గడువులోపు పనులు పూర్తికావాలని కోరారు. ప్రాజెక్టుపై సిఎం నిరంతర సమీక్ష, దానికి తగిన విధంగా సూచనలు చేయడం కారణంగా ఈ అసాధారణ రికార్డు సాధ్యమైందని నిర్మాణ కాంట్రాక్టు సంస్థ ఎల్ అండ్ టి కూడా ఒక ప్రకటనలో పేర్కొనింది.

Comments

comments