Search
Monday 21 May 2018
  • :
  • :

ఎక్కడి సూచీలు అక్కడే..

 bs

కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అప్రమత్తంగా ఇన్వెస్టర్లు

న్యూఢిల్లీ: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. కర్నాటక ఎన్నికల ఫలితాలు మంగళవారం(15న) వెల్లడించనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారు. తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయిన స్టాక్‌మార్కెట్లు చివరికి ఎక్కడివి అక్కడే నిలకడగా ఉండిపోయాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై దృష్టి పెట్టిన ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించగా.. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 21 పాయింట్ల స్వల్ప లాభంతో 35,557 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ యథాతథంగా 10,807 వద్దే స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఇలో ప్రధానంగా ఆటో, రియల్టీ, మెటల్, ఐటీ రంగాలు నష్టపోయాయి. మరోవైపు పిఎస్‌యు బ్యాంక్స్ 0.75 శాతం బలపడింది. బ్లూచిప్స్‌లో టైటన్, జి, టాటా మోటార్స్, ఎం అండ్ ఎం, ఇన్‌ఫ్రాటెల్, ఐబి హౌసింగ్, యస్‌బ్యాంక్, వేదాంతా, ఐషర్, ఎయిర్‌టెల్ 1 నుంచి 3.5- శాతం మధ్య క్షీణించాయి. మరోవైపు ఎన్‌టిపిసి, బిపిసిఎల్, ఇండస్‌ఇండ్, డాక్టర్ రెడ్డీస్, పవర్‌గ్రిడ్, హీరో మోటో, ఎసియన్ పెయింట్స్, సిప్లా, ఇన్ఫోసిస్, ఎస్‌బిఐ 2.2-1 శాతం మధ్య ఎగశాయి. బిఎస్‌ఇలో మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 1 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1830 నష్టపోగా.. 842 షేర్లు మాత్రమే లాభపడ్డాయి. నగదు విభాగంలో గతవారం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐలు) రూ. 1940 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. దేశీ ఫండ్స్(డిఐఐలు) రూ. 4670 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి.
అమ్మకాల ఒత్తిడిలో అడాగ్ షేర్లు
రిలయన్స్ కమ్యూనికేషన్ రుణాలతో సతమతమవుతున్న అనిల్ అంబానీకి మరో ఆందోళన మొదలైంది. సోమవారం మార్కెట్లో అనిల్ అంబానీ గ్రూప్(అడాగ్) షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇన్వెస్టర్లు భారీ స్థాయిలో అమ్మకాలు చేపడుతుండటంతో ప్రస్తుతం రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ కేపిటల్, రిలయన్స్ పవర్, రిలయన్స్ నావల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ డీలాపడ్డాయి. రిలయన్స్ నావల్ అత్యంతగా 14 శాతం నష్టపోయి రూ. 14.45కు చేరింది. రిలయన్స్ పవర్ 6 శాతం పతనమై రూ.33.70 వద్ద ముగియగా, ఇదే బాటలో రిలయన్స్ ఇన్‌ఫ్రా 5 శాతం నష్టపోయి రూ.395కు నష్టపోయింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ 2 శాతం బలహీనపడి రూ. 58 వద్ద ట్రేడ్ అవుతోంది. రిలయన్స్ కమ్యూనికేషన్ టవర్స్‌ను తన సోదరుడు ముఖేష్ అంబానీకి విక్రయించాలని ఒప్పందం చేసుకు న్నా.. ఇది కోర్టు కేసుతో ఆగిపోయింది.

Comments

comments