Search
Friday 25 May 2018
  • :
  • :

కాంగ్రెస్ డీలా

ind

కర్నాటక దెబ్బతో దిక్కుతోచని స్థితి

మిట్టపల్లి శ్రీనివాస్
కర్ణుడి చావుకు కారణాలనేకం అన్నట్లు వరుసగా పదేండ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు 2014 ఎన్నికల నుంచి పతనం ప్రారంభమైంది. స్వర్గీయ రాజీవ్‌గాంధీ హయాం లో 440 పైచిలుకు లోక్‌సభ సీట్లతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేడు కేవ లం రెండు రాష్ట్రాలకే పరిమితమై దయనీయ స్థితి కి దిగజారింది. తాజాగా కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2019కి పూర్వ వైభవం సులభమనే ఆశల పల్లకీలో ఊరేగుతున్న కాంగ్రెస్ నేతల్లో అక్కడి ఫలితాలు ఒక్కసారిగా పటాపంచలయ్యా యి. కర్నాటక జోష్‌తో 2019 సాధారణ ఎన్నిక ల్లో తెలంగాణలో పూర్వవైభవం సాధిస్తామనే ధీమాతో ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ప్రస్తుతం డీలా పడిపోయారు. రాహుల్‌గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ఇక కనుమరుగవుతుందేమోన న్న భయాందోళనలు ఆ పార్టీవర్గాలను వేధిస్తున్నాయి. కాంగ్రెస్‌ను జాతీయ స్థాయిలో రక్షించే ‘బాహుబలి’ ఎవరు అనేది ఇప్పుడు ఆ పార్టీలో చర్చనీయాంశమైంది. రాహుల్‌ను కాదని దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకొచ్చే జనాకర్షక నేత గురించి ఇప్పుడు ఆ పార్టీలో తర్జనభర్జనలు సాగుతున్నాయి.
నాయకత్వ వైఫల్యం, పార్టీకి శాపం : 2014 సాధారణ ఎన్నికల్లో కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పొందలేనంత ఘోరంగా తన ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్ ఆ తర్వాత జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సైతం చతికిలపడింది. తాజాగా కర్నాటక ఎన్నికల్లో సైతం అధికారాన్ని నిలుపుకోలేకపోయింది. గోవా, మేఘాలయ, మణిపూర్ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు మెజారిటీ ఉన్నా ఆ పార్టీ జాతీయ నాయకత్వ వ్యూహ వైఫల్యంతో అవి బిజెపి ఖాతాలోకి వెళ్ళిపోయాయి. ముఖ్యంగా కీలకమైన గోవాలో 40 మంది ఎంఎల్‌ఎలలో కాంగ్రెస్ పార్టీ 17 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వాన్ని మాత్రం ఏర్పాటుచేయలేకపోవ డం ఆ పార్టీ హీనస్థితికి అద్దం పట్టింది. కేవలం పన్నెండు సీట్లు ఉన్న బిజెపి ఇక్కడ ఎంజిపి, జిఎఫ్‌పి పార్టీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మణిపూర్‌లో కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ 60 మంది శాససభ్యులున్న అసెంబ్లీలో కాంగ్రెస్ 28 స్థానాలతో పెద్ద పార్టీగా అవతరించింది. 21 మంది ఎంఎల్‌ఎలున్న బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పా టు చేసింది. ఇక మేఘాలయలో కాంగ్రెస్ పార్టీ తనకు సరైన మెజారిటీ ఉన్నప్పటికీ నాయకత్వ వైఫల్యంతో బిజెపి ఆ రాష్ట్రంలోని ఇతర భాగస్వామ్య పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఇవి ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి వైఫల్యాలు అంతటా కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నా ఆ పార్టీ జాతీయ నేతల్లో మేలుకొలుపు రాకపోవడం విషాదం. ఇంత ఘోరంగా పతనం కావడం వెనక ఆ పార్టీ స్వయంకృతాపరాధాన్ని సైతం కాదనలేం.
పార్టీని రక్షించలేకపోయిన జనాకర్షక పథకాలు : విప్లవాత్మకమైన అనేక పథకాలకు శ్రీకారం చుట్టినా, ప్రత్యక్షంగా ప్రజలు ఫలాలు అనుభవిస్తు న్నా ఆ పార్టీకి విజయం లభించకపోగా ఘోరమైన తీరులో ఆదరణ కోల్పోయింది. సమాచార హక్కు చట్టం, గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఉచిత నిర్బ ంధ విద్య.. ఇలా ఎన్నో వినూత్నమైన పథకాలు ఆ పార్టీకి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చినా ఫలితం లేకపోయింది. పదేళ్ళపాటు అధికారంలో ఉన్న తర్వా త ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత సహజంగానే ప్రజాదరణ కలిగిన నరేంద్రమోడీ లాంటి వ్యక్తికి అనుకూలంగా మారింది. వాక్చాతుర్యం, కొత్తగా దేశ స్థాయి రాజకీయాల్లోకి వస్తున్నందువల్ల ప్రజలకు ఒక ఆశాకిరణం లాగా కనిపించడం, దాన్ని బలపర్చే తీరులో మాటల బాణాలు సంధించడం వ్యక్తిగా కలిసొచ్చా యి. అది అంతిమంగా బిజెపికి లాభించింది. అప్పటికి ‘గుజరాత్ మోడల్’ అనేది ఒక అభివృద్ధికి ఒక పర్యాయపదంగా ఉండడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ గొప్పదనంగా ప్రతిబింబించబడింది. రాజీవ్‌గాంధీ కాలంలో దాదాపు 440 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ పదేళ్ళ పాలన అనంతరం కేవలం 44 సీట్లకు పడిపోయింది. అతి ఎక్కువ పార్లమెంటు స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్‌లో కేవలం తల్లీ కొడుకులు (సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ) మాత్రమే గెలవగలిగారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు వాక్చాతుర్యం లేకపోవడం, సూటిగా విమర్శలను తిప్పికొట్టడంలో నైపు ణ్యం లేకపోవడం ఆ పార్టీ బలహీనత.
అవినీతి అసమర్ధతలు పార్టీని దిగజార్చాయి : పదేళ్ళ పాలనలో చోటుచేసుకున్న అవినీతి, కోర్టుల్లో కేసుల విచారణ, మంత్రులుగా ఉన్నవారు నిందితులుగా ఉండడం, జైలుశిక్షలు… ఇలాంటివన్నీ ఆ పా ర్టీ పట్ల ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయేలా చేసింది. అప్పటికి దశాబ్దాల తరబడి రాజకీయాల్లో ఉన్న మన్మోహన్‌సింగ్‌పై ఏ అవినీతి మచ్చా లేకపోయినా యుపిఏ పదేండ్ల హయాంలో మాత్రం వాటిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైన పరిస్థితుల్లో పివి నర్సింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ఆర్థికమంత్రిగా వ్యవహరించిన మన్మోహన్‌సింగ్ సంస్కరణలను వేగవంతంచేసి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారన్న కీర్తి ప్రతిష్టలు ఆయన సొంతం. అయితే ఈ పదేళ్ళ పాలనలో మంత్రులే అవినీతి ఆరోపణల్లో ఇరుక్కోవడంతో వాటిని మన్మోహన్‌సింగ్ మూటగట్టుకోవాల్సి వచ్చింది. మరోవైపు ఇంత గొప్ప ఆర్థికవేత్త సైతం ప్రధాని సీట్లో కూర్చున్నా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేని నిస్సహాయ స్థితిలో యుపిఏ ఛైర్‌పర్సన్‌గా సోనియాగాంధీ తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడాల్సి వచ్చింది. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న పార్టీయే అయినప్పటికీ సమర్ధవంతమైన నాయకత్వం లేకపోవడం, ‘గాంధీ’ కుటుంబ పార్టీగా కొనసాగుతుండడం, పాలనపై నియంత్రణ లేకపోవడం.. ఇలాంటి అనేకం ఆ పార్టీకి చేయాల్సినంత నష్టం చేశాయి. ఇక 2014 సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. గుజరాత్ లాంటి రాష్ట్రంలో వరుసగా పాతికేళ్ళపాటు బిజెపి పాలనలో ఉన్నప్పటికీ ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైంది.
అధికారంలో ఉన్నా అధికారం దూరమే :కేరళ, మహారాష్ట్ర, బీహార్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ… ఇలా అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉండి కూడా ఓడిపోయింది. చివరకు అది రెండు రాష్ట్రాలకు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి మాత్రమే పరిమితమైంది. కాంగ్రెస్‌లో సీనియర్ నేతలంతా ఎవరికివారే అనే తీరులో వ్యవహరించడం, రాష్ట్రాల పిసిసి అధ్యక్షుల మీద పట్టు లేకపోవడం ఆ పార్టీ బలహీనతగా మారింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నా, వర్కింగ్ కమిటీలో తీర్మానం చేసినా, ముసాయిదా బిల్లును తయారుచేసినా, పార్లమెంటులో ప్రవేశపెట్టినా… కిరణ్‌కుమార్‌రెడ్డి లాంటి ముఖ్యమంత్రి బహిరంగంగానే వ్యతిరేకిస్తూ ఉంటే ఎలాంటి చర్య లూ తీసుకోలేకపోయింది. ఒక వ్యక్తి తీరు పార్టీకి నష్టం కలిగిస్తున్నా మౌనంగా ఉండడం ఆ పా ర్టీ చేతగానితనానికి నిదర్శనం. ప్రస్తుతం తెలంగాణలో పార్టీ సీనియర్ నేతలంతా ముఖ్యమంత్రి అభ్యర్థులే. కర్నాటకలో ముఖ్యమంత్రి అభ్యర్థులు లేకుండా పార్టీ ఒక గా డిలో ఉన్నప్పటికీ ఐదేళ్ళకే ప్రజల వ్యతిరేకతను ఎదుర్కొనింది. యెడ్యూరప్ప, గాలి జనార్ధన్‌రెడ్డి లాంటి అవినీతిపరు లు ఉన్నప్పటికీ దాదాపు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే స్థా యికి చేరుకుంది. అయితే నోట్ల రద్దు, జిఎస్‌టి లాంటి వి ధానాల తర్వాత ప్రజల్లో బిజెపి పట్ల వ్యతిరేకత పెరిగినా దాన్ని ఆ మేరకు సద్వినియోగం చేసుకుని ఓటుబ్యాంకును తనవైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది. రాహుల్‌గాంధీ ఆ పార్టీ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించినా ప్ర జల్లో పెద్దగా ఆ పార్టీ పట్ల ఆదరణ పెరగకపోవడం గమనార్హం.
తెలంగాణలోనూ నిరాశా నిస్పృహలు : తెలంగాణ ఇచ్చిన పార్టీగా చెప్పుకుంటున్నా దాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఓటుబ్యాంకుగా మల్చుకోవడంలో వైఫల్యం చెందడంతో కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారం కోల్పోయింది. ఈ నాలుగేళ్ళలో కూడా అధికార టిఆర్‌ఎస్‌కు బలమైన ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ ఎదగలేకపోయింది. ముఖ్యంగా టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌కు దీటైన నాయకత్వం ఈ పార్టీలో కొరవడింది.
పేరుకు ఎంతమంది సీనియర్ నేతలున్నా వారంతా సిఎం అభ్యర్థులే. ఎవరికివారు యమునా తీరే అనే చందంలో బహుళ నాయకత్వం ఈ పార్టీలో కనిపిస్తూ ఉంది. కర్నాటకలో అధికారం ఉండి ఏక నాయకత్వం ఉన్నా, పుష్కలంగా డబ్బు ఉన్నా ఆ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. అక్కడ అన్నీ అనుకూల పరిస్థితులే ఉన్నా అధికారంలోకి రాలేనప్పుడు ఇక తెలంగాణలో అధికారంలోకి రావడంపై కాంగ్రెస్ నేతల్లోనే గుబులు పుట్టిస్తున్నది. జనాకర్షక పథకాలతో టిఆర్‌ఎస్ అన్ని ఉప ఎన్నికల్లోనూ విజయ దుందుభి మోగిస్తుండగా కాంగ్రెస్ మాత్రం గ్రూపుల గొడవలతో బైటపడలేకపోతున్నది. ఎన్నికల ముందు కూడా గ్రూపుల గొడవలు, సిఎంకు తామే అర్హులమంటూ బహిరంగంగానే ప్రకటనలు చేసుకుంటూ వివాదాస్పదులవుతున్నారు.

Comments

comments