Search
Monday 21 May 2018
  • :
  • :

పిలుపు ఎవరికి?

Karnataka

కర్నాటకలో అతిపెద్ద పార్టీగా బిజెపి 

అధికారం కోసం బరిలో మెజారిటీ పార్టీగా బిజెపి

కాంగ్రెస్ మద్దతుతో జెడిఎస్ 

బెంగళూరు: కర్నాటకలో హంగ్ అసెంబ్లీ తప్పలేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన కనీస సీట్లు ఏ పార్టీకీ రాకపోవడంతో, సంకీ ర్ణం తప్పనిసరిగా మారింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం తమకే ఇవ్వాలని అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బిజెపి వాదిస్తుండగా, జన తా దళ్ సెక్యులర్ (జెడిఎస్)కు మద్దతు ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ సరికొత్త నాటకానికి తెరలేపింది. రెండు ప్రధాన పార్టీలు ఒకరి అవకాశాలకు మరొకరు గండికొట్టుకుంటుంటే, ఎవరూ ఊహించని విధంగా జెడి (ఎస్) జాక్‌పాట్ కొట్టేందుకు సిద్ధమైంది. కాంగ్రెస్ బేషరతు మద్దతును ప్రకటించడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం తమకే ఇవ్వాలని గవర్నర్ వాజూభాయ్ రూడాభాయ్‌వాలాను ఆ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కోరారు. మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికల ముందు కంటే, ఫలితాలు వెల్లడయిన తర్వాతే ఉత్కంఠ మరింత పెరిగింది. 224 సీట్లు న్న కర్నాటక అసెంబ్లీలో 222 సీట్లకు పోలింగ్ జరిగితే, బిజెపి 104 సీట్లు సంపాదించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ, ప్రభుత్వాన్ని ఏర్పా టు చేసేందుకు అవసరమైన కనీస మెజారిటీని దక్కించుకోలేకపోయింది. మరో ఎనిమిది సీట్లు లభించి వుంటే, బిజెపి ప్రభుత్వం ఖాయమయ్యేది. రాజ్యాంగం ప్రకారం అతి పెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ ఆహ్వానిస్తే, బలాన్ని నిరూపించుకోవడానికి కనీసం ఎనిమిది మంది ఎమ్మెల్యేల మద్దతును బిజెపి సమకూర్చుకోవాల్సి ఉంటుంది. మరోవైపు, బిజెపికి అధికార పీఠం దక్కకుండా అడ్డుకోవడానికి కాంగ్రెస్ బలమైనఅస్త్రాన్నే ప్రయోగించింది. 78 సీట్లు సంపాదించిన ఈ పార్టీ మూడో స్థానంలో ఉన్న జెడి (ఎస్)కు బేషరతు మద్దతును ప్రకటించింది. ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నా తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. జెడి (ఎస్)కు 37 సీట్లు లభించగా, ఎన్నికల్లో ఆ పార్టీకి మిత్రపక్షమైన బిఎస్పీకి ఒక సీటు దక్కింది. దానిని కూడా తన ఖాతాలో చూపించుకుంటున్న జెడి (ఎస్) బలం 38కి పెరిగింది. ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా తమకే మద్దతునిస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ ప్రకటించారు. వారు కూడా జెడి (ఎస్)కు మద్దతు తెలుపుతారని అన్నారు. మెజారిటీకి అతి చేరువలోకి వచ్చి ఆగిపోయినందుకు బిజెపి భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. గోవాలో తాను అనుసరించిన వ్యూహాన్నే కర్నాటకలో కాంగ్రెస్ అనుసరించడాన్ని బిజెపి నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. గోవా ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా ఏర్పడినప్పటికీ, కనీస మెజారిటీ రాకపోవడంతో, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ సాయంతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని పేర్కొంటూ, బిజెపి మొదట గవర్నర్‌ను కలిసింది. కాంగ్రెస్‌ను సంప్రదించకుండానే, బలాన్ని నిరూపించుకోవాల్సిందిగా బిజెపిని గవర్నర్ కోరవడం, ఆతర్వాతో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగిపోయాయి. అప్పటి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ ముందస్తు దాడి చేసింది. అధికారంలోకి వచ్చే అవకాశం తమకు లేనందున, బిజెపిని నిలువరించడానికి జెడి (ఎస్)కు మద్దతు ప్రకటించింది. అంతేగాక, గవర్నర్‌ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా జెడి (ఎస్)ను ఆహ్వానించాల్సిందిగా కోరింది. గోవా సూత్రాన్నే కర్నాటక గవర్నర్ కూడా అనుసరిస్తే, జెడి (ఎస్)కే ముందుగా అవకాశం ఇవ్వాలి. వజూభాయ్ బిజెపి సానుభూతిపరుడు కాబట్టి, అంత త్వరగా నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. బిజెపిని ఆహ్వానించి, వారం లేదా పది రోజుల గడువును ఇస్తారన్న వాదన వినిపిస్తున్నది. ఏదిఏమైనా కర్నాటక రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన మొదటి రోజు నుంచి కొనసాగిన సస్పెన్స్ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత కూడా కొనసాగుతునే ఉంది. బిజెపి, కాంగ్రెస్ కుమ్ములాటలో జెడి (ఎస్) లాభపడడం మాత్రం ఖాయంగా కనిపిస్తున్నది.

MODI

గవర్నర్  ముందు నాలుగు మార్గాలు

1. ఎన్నికలకు ముందే పొత్తుపెట్టుకున్న మిత్ర పక్షాలను ఆహ్వానిం చడం. (కర్నాటక విషయంలో ఇది సాధ్యం కాకపోవచ్చు. ఎం దుకంటే, ఎన్నికలకు ముందు జెడిఎస్, బిఎస్పీ మినహా ఏ ఇతర పార్టీలు ఎన్నికల పొత్తు పెట్టుకోలేదు. జెడిఎస్‌కు 37 సీట్లు వస్తే, బిఎస్పీ ఒక సీటును దక్కించుకుంది. ప్రస్తుతం మద్దతు ప్రకటి స్తున్న కాంగ్రెస్ ఎన్నికలకు ముందు జెడిఎస్ మిత్రపక్షం కాదు. కాబట్టి ఎన్నికల పొత్తు అనే అంశాన్ని ఆధారంగా చేసుకొని, జెడిఎస్‌ను ఆహ్వానించడం గవర్నర్‌కు సాధ్యం కాదు).
2. అతి పెద్ద పార్టీకి అవకాశం ఇవ్వడం. (ప్రస్తుత ఎన్నికల్లో బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరించిందిగానీ, సింపుల్ మెజారిటీకి ఎనిమిది సీట్లు తక్కువకావడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితిలో లేదు. మిత్ర పక్షమంటూ బిజెపికి ఏదీ లేదు. ఇద్దరు ఇండిపెండెంట్లు మద్దతునిస్తారనుకున్నా, ఆ పార్టీ బలం 106కు చేరుతుంది. కాంగ్రెస్ లేదా జెడిఎస్ నుంచి ఎవరైనా విడిపోయి మద్దతునిస్తే తప్ప మ్యాజిక్ ఫిగర్‌ను అందుకునే అవకాశం లేదు. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు బిజెపిని ఆహ్వానిస్తూనే, నిర్ణీత గడువులోగా బలాన్ని నిరూపించుకోవాల్సిందిగా గవర్నర్ కోరవచ్చు. అదే జరిగితే, ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను ఆకర్షించే అవకాశం బిజెపికి ఉంటుంది).
3. ఎన్నికల తర్వాత పొత్తుగా ఏర్పడిన పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వచ్చు. ( అవగాహన కుదుర్చుకున్న పార్టీలన్నీ ప్రభుత్వంలో భాగస్వాములై ఉండాలి. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే, కాంగ్రెస్ బేషరతు మద్దతునిచ్చింది కాబట్టి జెడిఎస్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించాలి).
4. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత కొన్ని పార్టీలు కలిసి ఏర్పడే కూటమి బలాన్ని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ ఏర్పాటు చేయాల్సిందిగా వాటిలో ఒక పార్టీని ఆహ్వానించవచ్చు. (ఈ విధానం కింద, కూటమిలో ఉన్న పార్టీలన్నీ తప్పనిసరిగా ప్రభుత్వంలో చేరాలన్న నిబంధన ఏదీ లేదు. కొన్ని పార్టీలు ప్రభుత్వంలో చేరి మద్దతునిస్తే, మరికొన్ని బయట నుంచి మద్దతును ప్రకటించవచ్చు)

Comments

comments