Search
Friday 25 May 2018
  • :
  • :

క్యాన్సర్ ను జయించారు…

 

పెద్దపెద్ద రోగాలను జయించి ఇప్పుడు ఆరోగ్యంగా, సంతోషంగా జీవించే వారిని చూసి తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. వారి ప్రేరణతో మరి కొంతమంది క్యాన్సర్ రోగులు ధైర్యంగా జీవించగలుగుతున్నారు. నువ్వు బతుకు.. మిగతా వారిని బతికించు అని పెద్ద వాళ్లన్నారు. అలాంటి వారి
కోవలోకి చెందినవారే ఈ నలుగురు. క్యాన్సర్‌ను ఆత్మస్థైర్యంతో జయించి అందరికీ ప్రేరణగా నిలుస్తున్నారు. క్యాన్సర్ బారినపడినవారికి బతుకు మీద ఆశలు చిగురింపచేస్తున్నారు. కుటుంబసభ్యుల సహాయం, ప్రేమ, ఆప్యాయతలతో వీరంతా క్యాన్సర్ నుంచి ఎలా బయటపడగలిగారో తెలుసుకుందాం..

జీవితాన్ని సవాలుగా తీసుకున్నా..

Cancer is conquered

శివకాశికి చెందిన  81 సంవత్సరాల పి. ఎన్. కమల కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో క్యాన్సర్‌ను జయించింది.  మనవలతో ఇంటివద్ద సంతోషంగా జీవిస్తోంది. తన కొడుకు, కోడలుతో సమానంగా, ఉత్సాహంగా  ఇంటిపనులు చేసుకోగలుగుతోంది. 2005లో కొంత అనారోగ్యం వల్ల కమల ఆరోగ్య పరీక్షలు చేయించుకుంది. అప్పుడే ఆవిడకి బ్రెస్ట్ క్యాన్సర్ అని తేలింది. ఆ వార్త విన్నంతనే  జీవితాన్ని సవాలుగా తీసుకుంది. ఇంకొక ఆరు నెలలైనా జీవించాలని లక్షంగా పెట్టుకుంది. కోడలు సీత వైద్య చికిత్సలు, చాలా జాగ్రత్తలు తీసుకుంది.  కొడుకు  ప్రోత్సాహాన్ని ఇస్తూ ఒక అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాడు. నిరంతర పర్యవేక్షణ, జాగ్రత్తలతో అమ్మకు సేవలు చేశాడు. దాదాపు 10 సంవత్సరాలపాటు క్యాన్సర్ చికిత్స తీసుకున్న తర్వాత 18 ఏళ్ల  అమ్మాయిలా  ఉత్సాహంగా తన పనులు తాను చేసుకుంటూ గడుపుతోంది కమల.  జీవితంలో బిజీగా  ఉంటూ  ప్రజలకుండే ఆసక్తికరమైన విషయాలు, సాహిత్య విషయాలపై చర్చలు కూడా చేస్తోంది. చికిత్స పొందేటప్పుడు  ‘పుచ్చి పైరంద భూబాలమ్(క్యాన్సర్ నుండి వచ్చిన పద్యాలు) అనే కవితల పుస్తకాన్ని రచించింది.  రోజావుక్కు (నా ప్రియమైన రోజా కి) అనే పుస్తకం రచించి  ఆమె స్నేహితురాలు, క్యాన్సర్ బాధితురాలు రోజాకి అంకితం ఇచ్చింది.  క్యాన్సర్‌ని ఎలా జయించాలి అనే విషయాన్ని దాంట్లో వివరించింది. ఆమె రాసిన సాహిత్య పుస్తకాలు రెండూ ఆంగ్లంలోకి అనువదింపబడ్డాయి. ప్రస్తుతం క్యాన్సర్ మీద అవగాహన కలిగిస్తూ క్యాన్సర్  పేషెంట్లలో ధైర్యాన్ని నింపుతోంది కమల.

భయం లేకుండా..

woman-image

లక్ష్మీ ఖనగర్‌కు సంగీతమన్నా, పాటలు పాడటమన్నా చాలా ఇష్టం. బెల్‌గ్రామ్ జిల్లా, ఒక చిన్న గ్రామంలో  పుట్టింది. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడింది.  పాఠశాల విద్య పూర్తవగానే కాలేజీ ఖర్చుల కోసం ఒక వైద్యశాలలో పనిచేసింది. 12వ తరగతి పూర్తయ్యాక చాలా ఇబ్బందులు పడుతూ  ఇంటింటికి తిరిగి కొన్ని వస్తువులను అమ్మేది.  పట్టుదలగా  కష్టపడి పనిచేసి మేనేజర్ స్థాయికి చేరుకుంది. అదే సమయంలో  విష్ణుతో పరిచయం ఏర్పడింది.బెల్గాంలో ఎన్‌జిఒ సహాయంతో ఉద్యోగం పొందింది. విష్ణు పూనేలోని ఒక కాల్ సెంటర్‌లో పనిచేశారు.  కొంత కాలం తర్వాత లక్ష్మి ఆరోగ్యం క్షీణించింది. తోటి ఉద్యోగులు పట్టుబట్టటంతో డాక్టర్ దగ్గరకు వెళ్లింది. వైద్యులు రక్తపరీక్ష చేసి వైట్ బ్లడ్ సెల్స్ సాధారణంగా కంటే కూడా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇంకా కొన్ని  పరీక్షలు నిర్వహించారు.  లక్ష్మి ఇవేమీ లెక్కపెట్టక తన చెల్లి పెళ్లిపనులలో బిజీగా గడిపింది. లక్ష్మి బ్లడ్ క్యాన్సర్‌కు గురైనట్లు వైద్యులు చెప్పారు. నెలకు 6,000 రూపాయలు ఖర్చుపెట్టి వైద్యం చేయించు కోవటానికి నిరాకరించి  ప్రేమించిన విష్ణును  కూడా వదిలి అందరికీ దూరంగా వెళ్లిపోవాలని నిశ్చయించుకుంది. అర్థం చేసుకున్న భర్త ఆమెకు దగ్గరుండి వైద్యం చేయించాడు. అదే సమయంలో వార్తాపత్రికలో క్యాన్సర్ వైద్యశాల అడ్వర్‌టైజ్‌మెంట్ చూసి హాస్పిటల్‌కి వెళ్లి ఖర్చు లేని వైద్యం చేయించుకోవడానికి డాక్యుమెంట్స్ మీద వైద్యులు సంతకం చేసిన పేపర్లను తీసుకుంది.  బెంగళూరులో చికిత్స పొందింది.ఆ సమయంలో లక్ష్మి తనకు ఇష్టమైన పాటలు పాడటం తిరిగి ప్రారంభించింది.  ఆమె ఒక ప్రదర్శన కూడా ఇచ్చింది. భర్త, కుటుంబ సభ్యుల సహకారంతో  క్యాన్సర్‌తో ధైర్యంగా పోరాడి గెలిచింది. శస్త్ర చికిత్స అనంతరం ఈ రోజు వరకు  నిత్యజీవితంలో తన కలలను సాకారం చేసుకుంటూ ఆనందంగా జీవిస్తోంది.

మారథాన్‌లో నేను…

helth-image

క్రీడల పట్ల అమిత ఆసక్తి. సిద్ధార్థ ఘోష్  ఎక్కువగా క్రికెట్, ఫుట్‌బాల్, రన్నింగ్ మారథాన్స్ లాంటి క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనేవాడు.  ఇలాంటి తనకు కిడ్నీ వ్యాధి వస్తుందని ఊహించలేదు.  అనారోగ్యంతో డాక్టర్‌ను కలిసినప్పుడు కిడ్నీ క్యాన్సర్ ఉన్నట్లు  చెప్పారు.  కుడి మూత్రపిండంలో  గోల్ఫ్ బాల్ సైజ్ కంటే పెద్ద కణితి  ఉన్నట్లు  గుర్తించారు. వైద్యుల సూచనతో చికిత్స చేయించుకున్నాడు. కణితితో పాటు కుడి మూత్రపిండం, మూడు ధమనులు, నాలుగు సిరలు, ఒక లింఫ్‌నోడ్, కొన్ని కణజాలాలు తొలగించారు. శస్త్ర చికిత్స అనంతరం కొద్దినిముషాలు నిలబడటం కూడా చాలా కష్టమైంది.  శరీరం సహజంగా క్యాన్సర్‌తో పోరాడటానికి ఇమ్మునోథెరపీ  చేయించుకున్నాడు సిద్ధార్థ. యువరాజ్ సింగ్, లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ గురించి  తెలుసుకుని  స్ఫూర్తిని పొందాడు. కోలుకున్న  ఒక సంవత్సరం తర్వాత  2015 జనవరిలో  ఫుల్ మారథాన్‌లో పాల్గొన్నాడు. కాన్సర్‌ని జయించి ఈ రోజు అన్ని కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నాడు.

Comments

comments