Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

ఫైనల్లో చెన్నై సూపర్‌కింగ్స్

dupleses

చెలరేగిన డుప్లెసిస్, క్వాలిఫయర్-1లో హైదరాబాద్ ఓటమి

ముంబయి: ఐపిఎల్ పదకొండో సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ ఫైనల్‌కు చేరుకుంది. మంగళవారం ఉత్కంఠభరితంగా సాగిన క్వాలిఫయర్ వన్‌లో చెన్నై రెండు వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి టైటిల్ పోరు కు దూసుకెళ్లింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 19.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ డుప్లెసిస్ 67(నాటౌట్) హీరోచిత ఇన్నింగ్స్‌తో చెన్నైకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. మరోవైపు సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో హైదరాబాద్ చేజేతులా ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో ఓడి నా హైదరాబాద్‌కు మరో ఛాన్స్ ఉంది. బుధవారం రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య జరిగే ఎలిమినేటర్ విజేతతో హైదరాబాద్ తలపడుతుంది. ఈ మ్యాచ్ శుక్రవారం కోల్‌కతాలో జరుగుతుంది.
ప్రారంభంలోనే…

sunrisers
ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన చెన్నైకు తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. భువనేశ్వర్ వేసిన ఈ ఓవర్ ఐదో బంతికి షేన్ వాట్సన్ (౦) పెవిలియన్ చేరాడు. త ర్వాత వచ్చిన సురేశ్ రైనాతో కలిసి మరో ఓపెనర్ డుప్లెసిస్ స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. ఇద్దరు జాగ్రత్తగా ఆడుతూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ధాటి గా ఆడిన రైనా 13 బంతుల్లోనే 4 ఫోర్లతో 22 పరుగులు చేశాడు. ప్రమాదకరంగా కనిపిస్తున్న రైనాను సిద్ధార్థ్ కౌల్ అద్భుత బంతితో క్లీన్‌బౌల్డ్ చేశాడు. తర్వాతి బంతికే స్టార్ ఆటగాడు అంబటి రాయుడును కూడా కౌల్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో చెన్నైకు కోలుకోలేని దెబ్బతగిలింది. కొద్ది సేపటికే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (9) కూడా ఔటయ్యాడు. అతన్ని రషీద్ బౌల్డ్ చేశాడు. ఇక జట్టును ఆదుకుంటారని భావించిన బ్రావో, జడేజాలు నిరాశ పరిచారు. బ్రావో ఏడు పరుగులు చేయగా, జడేజా మూడు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.
డుప్లెసిస్ పోరాటం…
ఒకవైపు వికెట్లు పడుతున్న డుప్లెసిస్ తన పోరాటాన్ని కొనసాగించాడు. చిరస్మరణీయ బ్యాటింగ్‌తో చెన్నైను ఆదుకున్నాడు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలు, సిక్స్‌లుగా మలుస్తూ ముందుకు సాగాడు. అతనికి దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ అండగా నిలిచాడు. ఒక దశలో 92 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి ఓటమి కోరల్లో చిక్కుకున్న చెన్నైను డుప్లెసిస్ ఒంటిచేత్తో గెలిపించాడు. చిరకాలం గుర్తుండి పోయే ఇన్నింగ్స్ ఆడిన డుప్లెసిస్ 42 బంతుల్లోనే 4 సిక్సర్లు, మరో ఐదు ఫోర్లతో 67 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఠాకూర్ కూడా ఐదు బంతుల్లోనే మూడు ఫోర్లతో అజేయంగా 15 పరుగులు చేసి తనవంతు పాత్ర పోషించాడు.
టపా..టపా
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్‌కు మొదటే ఇబ్బందులు మొదలయ్యాయి. ఓపెనర్ శిఖర్ ధావన్ ఇన్నింగ్స్ తొలి బంతికే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీపక్ చాహర్ అద్భుత బంతితో ఈ వికెట్ తీశాడు. కొద్దిసేపటికే వికెట్ కీపర్ గోస్వామి కూడా ఔటయ్యాడు. 12 పరుగులు మాత్రమే చేసి ఎంగిడి చేతికి చిక్కాడు. మరోవైపు జట్టును ఆదుకుంటాడని భావించిన కెప్టెన్ విలియమ్సన్ కూడా నిరాశే మిగిల్చాడు. 4 ఫోర్లతో 24 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మనీష్ పాండే (8) కూడా నిరాశ పరిచాడు. దీంతో హైదరాబాద్ 69 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. అయితే చివర్లో బ్రాత్‌వైట్ అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన బ్రాత్‌వైట్ 29 బంతుల్లోనే 4 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 43 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో హైదరాబాద్ స్కోరు 139కి చేరింది.

Comments

comments