Search
Monday 21 May 2018
  • :
  • :

అసమంజసం

ts

ఆర్‌టిసి సిబ్బందికి ఇప్పటికే పెంచాం
మళ్లీ కొత్త డిమాండ్లు అసంబద్ధం : సిఎం కెసిఆర్

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సుమారు రూ. 2800 కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన నేపథ్యంలో జీతాలను పెంచాలని ఉద్యోగులు డి మాండ్ చేయడం అసమంజసం, అసంబద్ధం అని ముఖ్యమంత్రి సహా మంత్రుల కమిటీ సభ్యులు, ఆర్‌టిసి ఉన్నతాధికారు లు అభిప్రాయపడ్డారు. అనాలోచితంగా డిమాండ్ చేస్తూ సమ్మె నోటీసు ఇవ్వడం తగదని ముఖ్యమంత్రి అభిప్రాయాన్ని వెలిబుచ్చినట్లు ప్రభుత్వం మంగళవారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నది. ‘నిరంతరం నష్టాల్లో కూరుకుపోతున్న ఆర్‌టి సి సంస్థను ప్రభుత్వం నడపాలా వద్దా అని ఉద్యోగులు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది’ అని సిఎం వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయుల డి మాండ్లపై బుధవారం జరగబోయే సమావేశం గురించి మంత్రుల కమిటీ సభ్యులతోనూ, అధికారులతో ముఖ్యమంత్రి మంగళవారం రాత్రి ప్రగతిభవన్‌లో చర్చిస్తున్న సందర్భంగా ఆర్‌టిసి ఉద్యోగుల డిమాండ్లు, సమస్యలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. ‘చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని విధంగా ఆర్‌టిసి ఉద్యోగులకు గతంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 44% ఫిట్‌మెంట్ ఇచ్చిన విషయాన్ని సిఎం గుర్తుచేశారు. ఒక రోజంతా ఆర్‌టిసి ఉద్యోగులతో సమావేశం జరిపి సంస్థను లాభాల్లోకి తీసుకురావాల్సిన అవసరాన్ని నొక్కి వక్కాణించినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుకాగానే 2014-15లో 44% ఫిట్‌మెంట్‌ను ఆర్‌టిసి ఉద్యోగులకు ప్రకటించినప్పుడు సంస్థను లాభాల్లోకి నడిపిస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు హామీ ఇచ్చారు. కానీ ఆ హామీకి విరుద్ధంగా 2014-15లో రూ. 400 కోట్లకుపైగా, 2015-16లో రూ. 776 కోట్లకు పైగా, 2016-17లో రూ. 750 కోట్లకు పైగా, 201718లో రూ. 680 కోట్లకు పైగా సంస్థ నష్టాల్లో కూరుకుపోయిందని సిఎం వ్యాఖ్యానించారు. 4200 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించామని, ఇంత జరిగినా అనాలోచితంగా వారు డిమాండ్ చేస్తూ సమ్మె నోటీసు ఇవ్వడం తగదు’ అని ముఖ్యమంత్రి అభిప్రాయాన్ని వెలిబుచ్చినట్లు ఆ ప్రకటన పేర్కొనింది. ఆర్‌టిసి ఉద్యోగులు కోరిన స్థాయిలో జీతాలు పెంచినట్లయితే ప్రస్తుతం ఏడాదికి వారి జీతాలపై చేస్తున్న ప్రస్తుత రూ. 2400 కోట్లకు అదనంగా ఏటా రూ. 1400 కోట్లను ఖర్చు చేయాల్సి ఉంటుందని సిఎం పేర్కొన్నారు. కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు లాంటి పొరుగు రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థల ఉద్యోగుల జీతభత్యాలతో పోల్చి చూస్తే తెలంగాణ ఆర్‌టిసి ఉద్యోగుల జీతాలు ఎక్కువేనని, ఒక ఆర్‌టిసి డ్రైవర్ జీతంలోని మూల వేతనం రూ. 12,610గా ఉంటే కర్నాటకలో అది రూ. 11,610గానూ, మహారాష్ట్రలో రూ. 4,350గా మాత్రమే ఉందని, తమిళనాట కూడా తెలంగాణ కంటే తక్కువేనని ఆర్‌టిసి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కేవలం జీతభత్యాల మీదనే ఆర్‌టిసి తన ఆదాయంలో 52% పైగా ఖర్చు పెడుతున్నదని, మరే ప్రభుత్వరంగ సంస్థ కూడా ఇంత పెద్దమొత్తంలో జీతాల మీద ఖర్చుపెట్టడంలేదని సిఎ, ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇవేవీ గమనించకుండా మళ్ళీ జీతాలు పెంచాలని ఆర్‌టిసి ఉద్యోగులు డిమాండ్ చేయడాన్ని ఈ సమావేశంలో పాల్గొన్న అధికారులు, మంత్రుల కమిటీ సభ్యులు, ముఖ్యమంత్రి తప్పుపట్టారు. ఈ సమావేశంలో ఆర్‌టిసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ, మంత్రుల కమిటీ సభ్యులు ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఆర్‌టిసి మేనేజింగ్ డైరెక్టర్ రమణారావు, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, ఆర్థికశాఖ కార్యదర్శి శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments