Search
Monday 21 May 2018
  • :
  • :

కర్ణాటకంపై కాంగ్రెస్ ఫైర్

 Congress leaders today protested in Karnataka

బెంగళూరు : కర్నాటకలో గురువారం కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. యడ్యూరప్ప ప్రమాణ స్వీకారానికి గవర్నర్ ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ ధర్నాలు చేపట్టారు. స్థానిక విధాన సౌధ, సచివాలయం  సమీపంలోని గాంధీజీ విగ్రహం వద్ద కాంగ్రెస్ సీనియర్ నేతలు భైఠాయించారు. మాజీ సిఎం సిద్ధరామయ్య, గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్, మల్లిఖార్జున ఖర్గే, కెసి వేణుగోపా ల్ వంటి పలువురు నేతలు గాంధీజీ విగ్రహం పాదాల వద్ద కూర్చుని ధర్నా సాగించారు. అప్రజాస్వామిక రీతి లో యడ్యూరప్ప ప్రమాణం జరిగిందని,దీనికి వ్యతిరేకం గా తమ ఉద్యమం సాగుతుందని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. తమతో పాటు జెడిఎస్ లెజిస్లేటర్లు, నాయకులు కూడా ఉద్యమంలో కలిసివస్తారని తెలిపారు. రిసార్ట్‌లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ధర్నా స్థలికి చేరుకున్నారు. గవర్నర్ వాజూభాయ్ అసాధారణ రీతిలో యడ్యూరప్పకు అవకాశం ఇచ్చారని పైగా బల నిరూపణకు పక్షం రోజులు గడువు కూడా ఇవ్వడం దారుణం అని సిద్ధరామయ్య విమర్శించారు. ఓ వైపు యడ్యూరప్ప ప్రమాణస్వీకారం జరిగి బిజెపి వారు సంబరాలు నిర్వహించుకుంటున్న దశలోనే కాంగ్రెస్‌జెడిఎస్ శ్రేణులు నగరంలో ధర్నాలకు దిగి నిరసనలు వ్యక్తం చేశారు. యెడ్యూరప్పను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికి ఆహ్వానించాలన్న కర్నాటక  గవర్నర్ వజూభాయ్ వాలా నిర్ణయానికి నిరసనగా శుక్రవారం  అన్ని జిల్లాలు, రాష్ట్ర ప్రధాన కేంద్రాల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ దినాన్ని పాటిస్తామని కూడా ఆ పార్టీ తెలిపింది.

రాయ్‌పూర్ : దేశంలో పరిస్థితి దారుణంగా ఉందని కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ విమర్శించారు. రాజ్యాంగం తీవ్రస్థాయిలో దాడికి గురవుతోందని, దేశంలో భయానక వాతావరణం ఏర్పడిందని విమర్శించారు. న్యాయవ్యవస్థను కూడా అణచివేస్తూ, బెదిరిస్తున్నారని విమర్శించారు. ఛత్తీస్‌గఢ్‌లో రెండు రోజుల పర్యటనకు వచ్చిన సందర్భంగా రాహుల్ ఇక్కడి సభలో ప్రసంగించారు. దేశంలో తొలిసారిగా రాజ్యాంగ వ్యవస్థలన్ని కూడా అభద్రతకు గురి అయ్యాయని, న్యాయవ్యవస్థ సమగ్రతకు ముప్పు వాటిల్లిందని తెలిపారు. కర్నాటకలో ఎమ్మెల్యేలు అంతా ఒక వైపు ఉన్నారు. గవర్నర్ మరో వైపు నిలిచారని, రాహుల్ చెప్పారు. అక్కడి చర్య పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లకు వందల కోట్ల రూపాయలు, మంత్రి పదవులు ఇవ్వజూపడం ఏం స్వామ్యం అన్పించుకుంటుందని నిలదీశారు. బల నిరూపణకు బిజెపి వారు బేరసారాలకు దిగి, అధికారం కోసం రాజ్యాంగ నిబంధనలకు తూట్లు పొడిచారని ఆరోపిం చారు.స్థానిక స్వయం పాలనకు సంబంధించిన రాజ్యాంగంలోని 73,74 సవరణల సిల్వర్‌జూబ్లీ సందర్భంగా నిర్వహించిన జన్ స్వరాజ్ సమ్మేళన్ సభలో రాహుల్ మాట్లాడారు. ప్రతి ప్రజాస్వామిక ప్రక్రియను ఒక పద్ధతి ప్రకారం దెబ్బతీస్తున్నారని అన్నారు. అన్ని వ్యవస్థల్లోనూ ఆర్‌ఎస్‌ఎస్ మనుష్యులను నింపే యత్నాలకు దిగిందని విమర్శించారు. దేశ గొంతుకగా ఉండే వ్యవస్థలను ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలు అణచివేస్తున్నాయని ఆరోపించారు.
ప్రజాస్వామ్య ఖూనీకి సంతాప దినం: కర్నాటకలో ప్రజస్వామ్యానికి జరిగిన ద్రోహంతో దేశం సంతాపం పాటిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ వ్యాఖ్యానించారు. కర్నాటకలో సిఎంగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం ఒక ప్రహసనం అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంఖ్యాబలం లేకున్నా కర్నాటకలో బిజెపి ప్రభుత్వ స్థాపనకు దిగడం ప్రజాస్వామ్య విద్రోహ చర్య అని పార్టీ తెలిపింది.

Comments

comments