Search
Monday 21 May 2018
  • :
  • :

రైతులను ఇబ్బంది పెట్టొద్దు

ktr1

బ్యాంకుల పనితీరును పరిశీలించిన మంత్రి కెటిఆర్

 మన తెలంగాణ / సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రైతులు రైతుబంధు చెక్కులను నగదుగా మార్చుకునే ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుందో మంగళవారం మంత్రి కె. తారకరామరావు ప్రత్యక్షంగా పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన మంత్రి కెటిఆర్ జిల్లాలోని బోయిన్‌పల్లి మండలం విలాసాగర్, తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో రైతుబంధు చెక్కులను పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని బ్యాంకుల వద్ద రైతులు పెద్ద సంఖ్యలో గుమిగూడి చెక్కులు విత్‌డ్రా చేసుకుంటున్నారని తెలుసుకున్న మంత్రి కెటిఆర్ బ్యాంకుల వద్దకు చేరుకుని రైతులకు బ్యాంకులు కల్పిస్తున్న సదుపాయాలను పరిశీలించారు. అనంతరం బ్యాంకు అధికారులు జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, పోలీస్ ఉన్నతాధికారులతో రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రైతు బంధు చెక్కులు నగదుగా మార్చి ఇవ్వాలని, వారికి మెరుగైన వసతులు కల్పించాలని మంత్రి  కలెక్టర్‌కు, బ్యాంకు అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్ గడ్డం నర్సయ్య, అర్బన్ బ్యాంక్ చైర్మన్ దార్నం లక్ష్మినారాయణ, ఏఎంసి చైర్మన్ జిందం చక్రపాణి, తెరాస శ్రేణులు పాల్గొన్నారు.

మంత్రి కెటిఆర్‌కు రెండు పంటసాయం చెక్కులు అందజేత

ktr

రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ కౌన్సిలర్ గుండ్లపెల్లి పూర్ణచందర్, మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని భర్త దేవదాస్‌ల రైతుబంధు పెట్టుబడి సాయాన్ని తిరిగి రాష్ట్ర మంత్రి కె. తారకరామారావు అందజేశారు.   సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిలర్ గుండ్లపెల్లి పూర్ణ చందర్‌కు ప్రభుత్వం పంట సాయం కింద రూ.11, 925 రూపాయల చెక్కును, మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని భర్త దేవదాస్‌కు రూ. 4వేల చెక్కును ప్రభుత్వం పంట సాయం కింద అందించింది. అయితే తాము పంటకు పెట్టుబడులు స్వయంగా పెట్టుకునే శక్తి కలిగి ఉన్నామని చెప్తూ మంత్రి కెటిఆర్‌కు చెక్కులను వారు తిరిగిచ్చారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు వారిని అభినందించారు.

Comments

comments