Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

ఫ్రీ వైఫై.. అతని జీవితాన్ని మార్చేసింది!

చేతిలో స్మార్ట్‌ఫోన్ దానికి ఉచిత వైఫై ఉంటే చాలా మంది చేసేపని ..కొత్తగా వచ్చిన సినిమాని డౌన్‌లోడ్ చేసుకోవడం, ఆన్‌లైన్ గేమ్స్ అడుకోవడం లేదంటే వాట్సాప్, ఫేస్‌బుక్‌లో చాట్ చేస్తూ కాల క్షేపం చేస్తూంటారు. ఇందుకు భిన్నంగా రైల్వే కూలీగా పనిచేస్తున్న ఓ యువకుడు ఫ్రీ వైఫైని ఉపయోగించుకొని పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన రాత పరీక్షల్లో అర్హత సంపాదించాడు. మనసుంటే మార్గముంటుంది. ఎలాంటి సౌకర్యాలు లేవు.. చేతిలో డబ్బు లేదు.. చదవలేం.. అనుకుంటే నిజంగా మనలో ఎవరూ  చదవలేరు. అలాంటి వారు చదవలేమని బాధపడేకన్నా తమకు తామే అవకాశా లను సృష్టించుకోవాలి. ఆ అవకాశాలతోనే చదువుకోవాలంటున్నాడీ కుర్రాడు.

Railway-Labour

కేరళలోని మున్నూరుకు చెందిన శ్రీనాథ్ వినూత్న రీతిలో చదువుకొని అనుకున్న విజయం సాధించాడు. ఓ వైపు రైల్వేస్టేషన్‌లో మూటలు మోసే కూలీగా పనిచేస్తూనే మరోవైపు సమయం దొరికినప్పుడల్లా తన స్మార్ట్‌ఫోన్‌లో రైల్వే ఉచిత వైఫై ద్వారా ఇంటర్నెట్‌లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యాడు. ఆ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన రాత పరీక్షలో అర్హత సాధించాడు.  శ్రీనాథ్ గత ఐదేళ్ల నుంచి ఎర్నాకులం రైల్వేస్టేషన్‌లో కూలీగా పని చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కోరిక ఉండేది.

కానీ అతను చదువుకునేందుకు పేద కుటుంబం కావడంతో తగిన డబ్బులు లేకపోవడంతో రైల్వేస్టేషన్‌లో వస్తున్న ఉచిత వైఫై ఇంటర్నెట్ సదుపాయం చూసి ఓ స్మార్ట్ ఫోన్ కొన్నాడు. అందరిలా వాట్సాప్ , ఫేస్‌బుక్‌లతో టైంపాస్ చేయలేదు. అందులో కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షకు సంబంధించిన మెటీరియల్‌ను ఫోన్‌లోనే ఆన్‌లైన్‌లో కలెక్ట్ చేశాడు. ఆడియో శాంపిల్స్, మాక్ టెస్ట్ పేపర్లు డౌన్‌లోడ్ చేసుకునేవాడు. ఆన్‌లైన్ ఎగ్జామ్స్ కూడా ఫోన్‌లోనే ప్రాక్టీస్ చేసేవాడు. ఇదంతా శ్రీనాథ్ తనకు దొరికిన ఖాళీ సమయంలో చేసేవాడు. అలా రైల్వేస్టేషన్‌లో వస్తున్న ఉచిత వైఫై ఇంటర్నెట్‌ను ఉపయోగించుకుని డిజిటల్ మాధ్యమం వేదికగా శ్రీనాథ్ చదువుకున్నాడు.

ఓ వైపు కూలిగా పనిచేస్తూనే మరోవైపు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పరీక్షకు చెందిన మెటీరియల్, సబ్జెక్టు వివరాలను వినేవాడు. వాటిని మనస్సులో మననం చేసుకునేవాడు. రాత్రి సమయాల్లో వాటిని మళ్లీ రివిజన్ చేసుకునేవాడు. చివరకు ఇటీవలే నిర్వహించిన కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫీల్ అసిస్టెంట్ ఎగ్జామ్స్‌లో రాతపరీక్షలో అర్హత సాధించాడు. ఇక ఇంటర్వ్యూ ఒక్కటే మిగిలి ఉంది. అది కూడా అటెండ్ అయి పాసైతే అతను విలేజ్ ఫీల్డ్ అసిస్టెంట్‌గా ఎంపికవుతాడు. అందుకు తగిన విధంగా ప్రిపేర్ అవుతున్నట్లు శ్రీనాథ్ వెల్లడించాడు. అతని ఆశయం నెరవేరాలని మనమూ కోరుకుందాం. చదువుపై శ్రద్ధతో అతను అలా చదివాడంటే అతని పట్టుదల, శ్రమకు అతన్ని మనం నిజంగా అభినందించాల్సిందే..!

విష్ణు కాసోజు

6302237820

Comments

comments