Search
Monday 25 June 2018
  • :
  • :
Latest News

ఐపిఎల్ విజేత చెన్నై

ipl

వాట్సన్ అజేయ శతకం, ఫైనల్లో సన్‌రైజర్స్ ఓటమి

ముంబయి: ఐపిఎల్‌లో పునరాగమనాన్ని చెన్నై సూపర్ కింగ్స్ ఘనంగా చాటుకొంది. రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ ఐపిఎల్ బరిలోకి దిగిన చెన్నై ఏకంగా ట్రోఫీని సొంతం చేసుకొని సంచలనం సృష్టించింది. ఐపిఎల్ పదకొండో సీజన్‌లో భాగంగా ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్లో చెన్నై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో చెన్నై తన ఖాతాలో మూడో ఐపిఎల్ ట్రోఫీని జమ చేసుకుంది. షేన్ వాట్సన్ 117(నాటౌట్) అజేయ శతకంతో చెన్నైకు ట్రోఫీని సాధించి పెట్టాడు. మరోవైపు ఈ సీజన్‌లో ధోని సేన చేతిలో వరుసగా నాలుగో ఓటమిని చవిచూసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ రన్నరప్‌తో సరిపెట్టుకొంది. ఈ విజయంతో ఐపిఎల్‌లో మూడోసారి చెన్నై ట్రోఫీని ముద్దాడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 18.3 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.
నెమ్మదిగా…
క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ప్రారంభంలో హైదరాబాద్ బౌలర్లు కట్టడి చేశారు. తొలి ఓవర్‌లో భువనేశ్వర్ ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. దీంతో ఈ ఓవర్ మెయిడిన్ అయ్యింది. కిందటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బౌలర్లకు చుక్కలు చూపించిన డుప్లెసిస్ ఈసారి ఆ జోరును కొనసాగించలేక పోయాడు. హైదరాబాద్ బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేయడంతో ప్రారంభంలో స్కోరు బోర్డును నత్తను తలపించింది. వాట్సన్, డుప్లెసిస్ ప్రతి పరుగు కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఇదే క్రమంలో డుప్లెసిస్ (10)ను సందీప్ శర్మ వెనక్కి పంపాడు. అప్పటికి చెన్నై స్కోరు నాలుగు ఓవర్లలో 16 పరుగులు మాత్రమే. ఈ దశలో క్రీజులోకి వచ్చిన సీనియర్ ఆటగాడు సురేశ్ రైనా అండతో వాట్సన్ బ్యాట్‌ను ఝులిపించడం ప్రారంభించాడు. కౌల్, సందీప్ శర్మలను లక్షంగా చేసుకొని ముందుకు సాగాడు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే అడపాదడపా ఫోర్లు, సిక్స్‌లు కొడుతూ స్కోరు వేగాన్ని పెంచాడు. రైనా కూడా చక్కని బ్యాటింగ్‌తో వాట్సన్‌కు పూర్తి సహకారం అందించాడు. ఇద్దరు జాగ్రత్తగా ఆడుతూ జట్టును లక్షం వైపు నడిపించారు. ఇదే సమయంలో హైదరాబాద్ బౌలర్లపై ఒత్తిడి పెరిగింది. దీనికి తోడు ఫీల్డింగ్ వైఫల్యం కూడా వాట్సన్, రైనాలకు కలిసి వచ్చింది. ఫీల్డింగ్ వైఫల్యాలను తమకు అనుకూలంగా మార్చుకున్న ఇద్దరు జోరును పెంచారు.
వాట్సన్ విధ్వంసం…
కుదురుకున్న తర్వాత వాట్సన్ తన విశ్వరూపాన్ని చూపించాడు. హైదరాబాద్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ పరుగుల వరద పారించాడు. ఒకవైపు జాగ్రత్తగా ఆడుతూనే చెత్త బంతులను బౌండరీలు, సిక్సర్లుగా మలిచాడు. వాట్సన్ జోరుతో మ్యాచ్ క్రమంగా హైదరాబాద్ చేజారింది. వాట్సన్‌ను అడ్డుకోవడం హైదరాబాద్ బౌలర్లకు శక్తికి మించిన పనిగా మారింది. చూడచక్కని షాట్లతో అలరించిన వాట్సన్ అభిమానులను కనువిందు చేశాడు. రైనా అతనికి అండగా నిలిచాడు. ఇదే సమయంలో రెండో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రైనా 24 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 32 పరుగులు సాధించాడు.
రెండో శతకం..
రైనా ఔటైనా వాట్సన్ జోరును కొనసాగించాడు. అతనికి అంబటి రాయుడు అండగా నిలిచాడు. రాయుడు సహకారంతో వాట్సన్ పరుగుల వరద పారించాడు. ఇదే క్రమంలో సెంచరీని కూడా పూర్తి చేశాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన వాట్సన్ 57 బంతుల్లోనే 11 ఫోర్లు, మరో 8 భారీ సిక్సర్లతో 117 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ సీజన్‌లో వాట్సన్‌కు ఇది రెండో సెంచరీ కావడం విశేషం. రాయుడు ఒక ఫోర్, సిక్స్‌తో 16 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. చిరస్మరణీయ సెంచరీతో చెలరేగిన వాట్సన్ ఒంటిచేత్తో చెన్నై ఐపిఎల్ ట్రోఫీని సాధించి పెట్టాడు. వాట్సన్ జోరుతో హైదరాబాద్ ఆశలు నీరుగారాయి. విలియమ్సన్ సేన రన్నరప్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఆదుకున్న విలియమ్సన్, పఠాన్
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్‌కు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌గా వచ్చిన గోస్వామి (5) నిరాశ పరిచాడు. అయితే మరో ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కలిసి కెప్టెన్ విలియమ్సన్ స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. ఇదే సమయంలో రెండో వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యాన్ని న మోదు చేశారు. త ర్వాత వచ్చిన సాకిబ్ అండతో విలియమ్సన్ జోరు కొనసాగించాడు. విలియమ్సన్ రెండు సిక్సర్లు, మరో ఐదు ఫోర్ల తో 47 పరుగులు చేశాడు. యూసుఫ్ పఠాన్ 25 బంతుల్లో రెండు సి క్స ర్లు, మరో 4 ఫోర్లతో 45 పరుగులు చేశాడు.

Comments

comments