Search
Monday 21 May 2018
  • :
  • :

కర్నాటకీయం రసవత్తరం

Article about Modi china tour

యావద్దేశం అత్యంత ఆసక్తితో ఎదురు చూసిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఒపీనియన్ పోల్స్‌కు అనుగుణంగా ‘హంగ్’ అసెంబ్లీని ఆవిష్కరించాయి. అధికారం నిలుపుకుంటామని ఆశించిన కాంగ్రెస్ ఓటమిపాలైంది. మోడీ షా ద్వయం చోదకులుగా బిజెపి హై స్పీడ్ రైలు ఔటర్ సిగ్నల్ వద్ద ఆగక తప్పలేదు. మరో కీలక పోటీదారైన జనతాదళ్ (సెక్యులర్) ‘కింగ్ మేకర్’ పాత్ర పోషిస్తుందన్న ఊహాగానాలకు భిన్నంగా ‘కింగ్’ అయ్యే అవకాశాన్ని అందిపుచ్చుకునే స్థితిలో ఉంది. ఇప్పుడు కిరీటం గవర్నర్ వాజూభాయి వాలా చేతిలో ఉంది. ఆయన దాన్ని బిజెపి నేత యడ్యూరప్ప, జెడిఎస్ నేత కుమారస్వామిల్లో ఎవరి నెత్తికి అలంకరిస్తారో ఉత్కంఠభరితం. ఇదీ స్థూలంగా కర్నాటక ఎన్నికల ఫలితాల పర్యవసానం. 224 స్థానాలుగల అసెంబ్లీలో రెండు స్థానాల్లో పోలింగ్ వాయిదాపడగా 222 ఫలితాలు వెలువడ్డాయి. మ్యాజిక్ ఫిగర్ 112. బిజెపి 104 స్థానాలు గెలుచుకుని ఏకైక పెద్ద పార్టీగా అవతరించింది. కాగా కాంగ్రెస్ 78, జెడిఎస్ 38 స్థానాలతో 116 సంయుక్త సంఖ్యాబలంతో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. ఇతరులు రెండు స్థానాలు గెలిచారు. వారూ కాంగ్రెస్‌కే మా మద్దతు అంటున్నారు. జెడిఎస్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని బలపరచటానికి సిద్ధపడిన కాంగ్రెస్ తమ నిర్ణయాన్ని గవర్నర్‌కు తెలియజేసింది. యడ్యూరప్ప బృందం కూడా గవర్నర్‌ను కలిసి పెద్ద పార్టీగా ఆవిర్భవించిన తమకు ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరారు. పెద్ద పార్టీకి ముందుగా అవకాశం అంటూ గవర్నర్, బిజెపి నేత చేత ప్రమాణ స్వీకారం చేయించి, అసెంబ్లీలో బల నిరూపణకు గడువు ఇస్తారా లేక స్పష్టమైన మెజారిటీ కనిపిస్తున్న జెడిఎస్ కాంగ్రెస్ కూటమి నేతను ఆహ్వానిస్తారా? వేచి చూడాలి. మణిపూర్, గోవాల్లో ఏకైక పెద్దపార్టీగా అవతరించిన కాంగ్రెస్‌ను కాదని, ఎన్నికల అనంతరం బలం కూడగట్టిన బిజెపిని అందలమెక్కించిన గవర్నర్ల్లూ మోడీ ప్రభుత్వం నియమించిన వారే.
కర్నాటకలో 2013 ఎన్నికల్లో బిజెపి నుంచి విడిపోయిన యడ్యూరప్ప, గాలి జనార్దన్ రెడ్డి శిష్యుడు శ్రీరాములు సొంత పార్టీలు పెట్టి పోటీ చేయటంవల్ల కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది. ఈ ఎన్నికల్లో ఆ మూడు పాయలు ఒక్కటి కావటం కాంగ్రెస్‌ను దెబ్బతీసింది. దీన్ని ఊహించలేకపోవటం కాంగ్రెస్ తప్పిదం. సిద్ధరామయ్య ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కర్నాటక రాష్ట్రానికి ప్రత్యేక పతాకం, హిందీ వ్యతిరేకత, లింగాయత్‌లకు మైనారిటీ మత హోదా ఇవ్వటానికి అంగీకారం, టిప్పుసుల్తాన్ జయంతి నిర్వహణవంటి విభజనవాద చర్యలు కన్నడిగుల ఆత్మాభిమానాన్ని తాకి ఓట్ల వర్షం కురిపిస్తాయని భ్రమపడింది. రాహుల్ గాంధి ఆలయ, మఠదర్శనాలు, మానస సరోవరం యాత్ర సంకల్ప ప్రకటన సహా విస్తృత ప్రచారంలో ప్రధాని మోడీకి ఎన్ని ప్రశ్నలు సంధించినా, విమర్శలు చేసినా ఫలితం దక్కలేదు. 2019 ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఐక్యత ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో సైతం కాంగ్రెస్ జెడిఎస్‌తో పొత్తుకు ప్రయత్నించకపోవటం దాని అహంభావానికి నిదర్శనం. తమది ఎంత ప్రాచీన పార్టీ అయినప్పటికీ కుంచించుకుపోయిన ఇవాల్టి వాస్తవాన్ని జీర్ణించుకుంటేనే ప్రతిపక్ష ఐక్యత సాధనలో అది తన వంతు పాత్ర పోషించగలుగుతుంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగినన్ని స్థానాలు లభిస్తే ప్రధాన మంత్రి పదవి చేబట్టటానికి తాను సిద్ధమని రాహుల్ గాంధి ప్రకటించటం వ్యూహాత్మక తప్పిదం.
బిజెపి విజయాలకు మూలం ఐక్యత. బూత్ స్థాయి వరకు అమిత్ షా పోల్ మేనేజిమెంట్. ప్రజాకర్షక నాయకునిగా ప్రధాని మోడీ సుడిగాలి పర్యటనలు, ప్రసంగాలు. అన్నిటికీమించి అనేక మాసాలుగా బిజెపి కార్యకర్తలు, సంఘ్ పరివార్ దళాలు ప్రజలతో మమేకమై ఇంటింటికీ చేర్చిన మోడీ ‘అభివృద్ధి’, ఆర్‌ఎస్‌ఎస్ ‘హిందూత్వ’ సందేశం, ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తెచ్చేందుకు చేసిన నిబద్ధతాపూర్వక కృషి. కర్నాటకను దక్షిణాదికి ముఖద్వారం చేసుకుని విస్తరించాలన్న బిజెపి వ్యూహం, ఉత్తరాదిపార్టీ అన్న ముద్రను చెరిపివేయాలన్న తపన చాలా వరకు నెరవేరిందనవచ్చు. దక్షిణ భారత్‌లోని ప్రాంతీయ పార్టీలకిదొక హెచ్చరిక. ఏదోక ప్రాంతీయ పార్టీతో పొత్తుతో అది సంకీర్ణ ప్రభుత్వాలకు ప్రయత్నించే అవకాశాలు మెరుగైనాయి. అలాగే సంవత్సరాంతంలో జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌ఘడ్ అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి శ్రేణులను కర్నాటక ఫలితం ఉత్సాహపరుస్తుంది. అన్నిటికీమించి ప్రతి అసెంబ్లీ ఎన్నికలను తనకు రాహుల్ గాంధికి మధ్య వ్యక్తిగత పోటీగా మార్చే మోడీ నేర్పరితనం ఆయన ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చుతున్నది. అందువల్ల కర్నాటక ఫలితాలు, నేర్చుకోదలిస్తే కాంగ్రెస్‌కు ఎన్నో పాఠాలు బోధిస్తున్నది.

Comments

comments