Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

ధోని సేనపై ప్రశంసలే ప్రశంసలు..

Metal TrophiesWon ChennaiSuper kings

ముంబయి : రికార్డు స్థాయిలో మూడో ఐపిఎల్ ట్రోఫీని సాధించిన చెన్నై సూపర్ కింగ్స్‌పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. రెండేళ్ల నిషేధం తర్వాత మళ్లీ బరిలోకి దిగిన చెన్నై ఏకంగా ట్రోఫీని సాధించడంపై అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తానెంత విలువైన ఆటగాడో ధోని మరోసారి ప్రపంచానికి చాటాడు. కిందటి ఏడాది పుణె సూపర్‌జెయింట్స్ జట్టు యాజమాన్యం ధోనిని ఘోరంగా అవమానించింది. అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించి స్టీవ్ స్మిత్‌కు పగ్గాలు అప్పగించింది. అయినా ధోని ఏమాత్రం నిరాశ పడలేదు. జట్టుకు అండగా నిలుస్తూ ఫైనల్ వరకు తీసుకెళ్లడంలో ముఖ్య భూమిక పోషించాడు. అయితే ఈసారి చెన్నై మళ్లీ బరిలోకి దిగడంతో చెన్నై యాజమాన్యం ధోనికి కెప్టెన్సీ అప్పగించింది. ధోని తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టాడు. జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో సఫలమయ్యాడు. క్లిష్ట సమయాల్లో తానే ముందుకు వచ్చి జట్టును గెలుపు బాటలో నడిపించాడు. జట్టుపై తన నాయకత్వ ముద్ర వేశాడు. సమష్టితత్వంతో జట్టును విజయపథంలో నడిపించడంలో సఫలమయ్యాడు. ధోని సారథ్య ప్రతిభవల్లే చెన్నైకు ట్రోఫీ దక్కిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆటగాడిగా, కెప్టెన్‌గా తన పాత్రను సమర్థంగా పోషించాడు. ఇతర జట్లు వరుస ఓటములతో సతమతమైన సమయంలోనే ధోని అద్భుత కెప్టెన్సీతో చెన్నైను గెలుపు బాటలో నడిపించాడు. ధోని నాయకత్వ ప్రతిభకు అభిమానులు నీరాజనం పలుకుతున్నారు. ఇక, ఫైనల్లో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సెంచరీ హీరో షేన్ వాట్సన్‌పై కూడా అభిమానులు ఫిదా అయ్యారు. రాయుడు, సురేశ్ రైనా, దీపక్ చాహర్ తదితరుల ప్రతిభపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక తమ జట్టు ఐపిఎల్ ట్రోఫీ సాధించడంతో చెన్నై అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆదివారం రాత్రంత అభిమానులు సంబరాలు చేసుకున్నారు. చెన్నై, కొయంబత్తూర్, మధురై తదితర నగరాల్లో అభిమానుల కోలాహలం కనిపించింది. బాణా సంచా పేల్చుతూ, స్వీట్లు పంచుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Comments

comments