Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

సుట్ట బీడి సిగిరెట్ ఇంటింటి సుట్టాలు

Smoking

మనుషులకు అనారోగ్యంకు గురిచేసేటి అన్ని అలవాట్లు మనుషులకు ఇష్టమైపోతయి. పొగకు మంచిది కాదని ఎంతమంది మొత్తుకున్న వాడేది వాడుతనే ఉంటరు. పూర్వకాలంల సుట్ట తాగేది. సుట్ట అంటే మోతుకు ఆకుతో సుట్టగ తయారు చేసికొని అందులో పొగాకును నింపి గుప్ప గుప్ప తాగుడు. దీనికి పెద్ద చరిత్రనే ఉన్నది. సుట్టకోసం మంచి పొగాకు ఎంచుకొని ఇంట్ల తెచ్చుకుంటరు. పూర్తిగా ఎండిపోకుండ కొన్ని నీళ్ళు జిలకరించి దాచిపెట్టుకుంటరు. చెల్కలకు పోయినప్పుడు ల్యాతగ ఉన్న మోతుకు ఆకులను తెంపుకొని పది ఇరవై మడత తెచ్చుకుంటరు. ఆ మడతను ఒక దగ్గర దాసుకొని రోజు కొకటి ఆకు తీసికొని సుట్టగ చేసి అందులో పొగాకు నింపుతరు. ఒక్కసారి సుట్టల పొగకు నింపితే ఆ రోజుకు సరిపడవచ్చు. పొగకు మీద నిప్పుపెట్టి ముట్టిచ్చుకుంటరు. దమ్ములాగ పీల్చుతాంటే అదొక ఆనందం కానవస్తది వాల్ల మొకం మీద ఇదంత ఇండ్లల్ల ఉండే వాల్ల గురించి ఇగ ఇండ్లల్ల ఉండకుండ గొర్లకాడికి మ్యాకల కాడికి ఎవుసం పనులకు పోయేవాల్లు కూడా సుట్ట తాగుతరు. వాల్లకు మోత్కుఆకులు ఎప్పటివి అప్పుడే కొత్తగ తెంపుకుంటరు. పొగాకు మాత్రం నడుంకు ఒక సంచి కట్టుకొని అందులో దాసుకుంటరు.

పొగాకు సుట్ట అంటుపెట్టుకోవాలంటే జంగల్‌ల ఉన్న వాల్లకు అగ్గి కావాలంటే జక మొక కావాలె. జక మొక అనేది ఒక తోలుతో తయారు చేసిన సంచి. అందులో ఒక పలుగు రాయి ఇంత దూది ఉంటది. దూది అంటే పత్తితో చేసినది కాదు ఒక చెట్టు పువ్వుతో తయారు చేసి మాసి తయారు చేసి అందులో కలుపుతరు. ఇంక అందులోనే ఒక ఇనుప బిల్ల ఉంటది. ఇనుప బిల్ల తో పలుగురాయి మీద పక్కకు దూది పెట్టి రాపిడి చేసినట్టు కొట్టుతే మిరుగులు వస్తాయి. ఆ మిరుగులే అగ్గి పుట్టిస్తయి. ఆ దూదిలోని సుట్టమీద పెట్టి అంటిచ్చుకుంటరు.

ఎవుసాయం కాడికిపోయేవాల్లు స్వయంగా అగ్గి సృష్టించుకుంటరు. ఇంటికాడ ఉన్నోల్లు అయితె నిప్పును కుంపటిల నుంచి తీసికుంటరు. కుంపటి అంటే మట్టిపాత్రల ఉనుక లోపల ముద్ద పిడికెలు ఉంచి అంటిస్తే మెల్లెగ కాలుకుంట అగ్గి కాక ఉంటది. దానితోని అంటుపెట్టుకుంటరు. లేకుంటే ఇంట్ల పొయ్యిల కెల్లి కొర్రాయి తెచ్చుకొని సుట్టమీద నిప్క ఏసుకుంటరు. సుట్ట తాగాలంటే పెద్ద పనే ఆకు తెచ్చుకోవాలే పొగాకు తెచ్చుకోవాలే అగ్గి పుట్టిచ్చుకోవాలే గప్పుడే తాగాలె సుట్ట మధురమేవేరబ్బా అంటరు కొందరు.

ఈ తతంగం పని ఎక్కువ ఉన్నదనుకుంటే ఆ మధ్య గంట సుట్టలు అని వచ్చినవి వీటికి మీద మోతుకు ఆకు ఉండది. డైరెక్ట్‌గా పొగాకునే సుట్టగ సుట్టి ఐదు ఐదు ప్యాక్ చేసి అమ్ముతరు. ఇది తాగుతే కూడా మస్తు దమ్ముగ ఉంటది. ఎందుకంటే మొత్తం పొగాకునే కాల్చితాగుడొ పాతసుట్ట అయితే మోదుకు ఆకుల కొంత పాగాకు వచ్చేది. గంట సుట్టలు చాలా కాలం నడిచనయి. ఆల్కగ పనిచేసికునేందుకు సినిమాలల్ల వచ్చినందున కొంత కదర్‌గా ఉంటదని ఆ కాలంల మోత్కా కు సుట్ట నుంచి గంట సుట్టకు అలవాటైండ్రు. ఇవి రెండు నడవంగనే బీడిలు వచ్చినై. బీడిలు తునికి ఆకుతో తయారు చేస్తరు. అందులో కూడా పొగాకు పొడిచేసి చూరను కొంచెం పోస్తరు. చిన్నగ సన్నగ ఉంటయి.

సుట్టలతో పొల్చుకుంటే కొంచెం ప్రమాదం తక్కువ. ఇంటింటికి బీడిలు అలవాటు అయినయి. ఎవుసం చేసేవాల్లు పనులకు పోయేవాల్లు ఊర్లల్ల అందరు మారాజుగా బీడీలు తాగుడే అలవాటు అయ్యిండ్రు. బీడీలల్ల కూడా ఏ ఏరియా ఆ కంపెనీలు ఉంటయి. కంపెనీ బట్టి రుచులు ఉంటయి. రోజుకో బీడీ కట్ట జేబుల ఉంచుకుంటరు.

బీడీలు ఉండగనే సిగిరెట్లు కూడా ఊర్లల్లకు వచ్చినయి. ఎన్కట చార్మినార్ బర్కిలీ సిగెరెట్లు ఉంటుండె. బీడీలు తాగేటోల్లు జర మోటు మనుషులు అన్నట్టు సుట్టలు తాగేటోల్లు ఇంక అర్వమోటులెక్క. సిగిరెట్లు తాగేటోల్లు శాని శాని వాల్లు అన్నట్టు పైసలు ఉన్నోల్లు సదువుకున్నొలు పటేండ్లు, దొరలు సిగిరెట్లు తాగుతుంటిరి. సిగిరెట్లు చార్మినార్ కంటే బర్కిలీ జర రేటు ఎక్కువ. ఆ తర్వాత గోల్డ్‌ఫ్లేక్ జిల్లాల్ల తాగుతుంటిరి.కొన్ని సిగరెట్లల్ల ఆండ్ల పొగల మైల రాకుంట దూది లాంటిది ఉంటుండె. ఈ సిగరెట్లు అంటు పెట్టుకునేతందుకు లైటర్‌లు వచ్చినయి. లైటర్‌తోని ముట్టిచ్చుకోని కమ్మగ తాగుకుంట పోతాంటే వాల్ల సోక భలే ఉండేది.  సుట్టల బీడీలు సిగరెట్లు అన్ని రకరకాల రోగాల నిలయాలు అయినా ఆగుడే లేదు. సుట్టలు అయితే ఆడోల్లు మొగోలు కల్సి తాగుతుంటరు. కల్లు కూడా కల్సి తాగుతుంటరు అది వేరే సంగతి.

అన్నవరం దేవేందర్ 94407 63479

Comments

comments