Search
Friday 25 May 2018
  • :
  • :

ఒఆర్‌ఆర్ క్షతగాత్రులకు… హెలికాప్టర్ సేవలు

Passing to hospitals is free

ఆసుపత్రులకు తరలింపు ఉచితం
గోల్డెన్‌అవర్‌లో వైద్యం అందించడమే ధ్యేయం
ట్రూఎయిడ్ సంస్థతో త్వరలో ఒప్పందం
ఔటర్‌లో నాలుగు ప్రాంతాల్లో హెలిప్యాడ్ స్టాండ్లు
ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వం : కమిషనర్ చిరంజీవులు

మన తెలంగాణ/సిటీబ్యూరో: ఔటర్ రింగ్ రోడ్ ప్రమాద బాధితులకు అత్యవసరంగా హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని హెచ్‌ఎండిఎ కమిషనర్ చిరంజీవులు నిర్ణయించారు. ఈ మేరకు ట్రూఎయిడ్ అనే సంస్థతో సంప్రదింపులు జరిపారు. అందుకు ఆ సంస్థ అంగీకారాన్ని తెలపడంతో ఆ మేరకు ఒప్పందం చేసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఔటర్‌లో ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటున్న నేపథ్యంలో క్షతగాత్రుల ప్రాణాలను కాపాడేందుకు హెలికాప్టర్ సేవ లు అవసరమని కమిషనర్ భావించారు. ప్రమాదబాధితులను వేగంగా ఆసుపత్రికి తరలించేందుకు ఇది చాలా అవసరమని భావించిన కమిషనర్ ఈ సేవల ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చారు. దీంతో ఇక ముందు ఔటర్ రింగ్ రోడ్ ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని తగ్గించడానికి మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ఆ యన యోచిస్తున్నారు. ఈపాటికే టోల్ కేంద్రాల వద్ద పరిపాలనా భవనంలో ట్రామా కేంద్రాలను ఏర్పాటుకు సన్నాహాలు మోదలుపెట్టారు. అయితే, వీటిల్లో ఎన్ని పడకలను ఏర్పాటు చేయాలనేది ఖరారు కావాల్సి ఉన్నది.

నాలుగు హెలిప్యాడ్ స్టాండ్లు…
ఔటర్ రింగ్ రోడ్ పొడవులో మొత్తం నాలుగు ప్రాంతాల్లో హెలికాప్టర్‌ను నిలిపేందు కు స్థలాలను కేటాయించాలని ట్రూఏయిడ్ సంస్థ హెచ్‌ఎండిఎ కమిషనర్ చిరంజీవులును కోరారు. ఈ స్టాండ్లు కనీసం 60×60 విస్తీర్ణం లేదా కనీసంగా ఒక ఎకరం భూ మిని కేటాయించాలని ప్రతిపాదించింది. అందుకు హెచ్‌ఎండిఎ సుముఖతను తెలిపినట్టు సమాచారం. ఇవి ముఖ్యంగా జాతీయ, రాష్ట్రీయ రహదారులు కలిసే ప్రాం తాల్లో కేటాయించాలని సంస్థ కోరింది. జాతీయ, రాష్ట్రీయ రహదారుల్లోనూ పెద్దగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంటే అక్కడి క్షతగాత్రులకు గోల్డెన్ హవర్‌లో వైద్యం అందించి వారి ప్రాణాలను కాపాడేందుకు అందుబాటులో స్టాండ్లు ఉండాలని పేర్కొన్నట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ ఏర్పాటు వల్ల ఔటర్ రింగ్ రోడ్‌తో పాటు జాతీయ, రాష్ట్రీయ, ప్రాంతీయ రహదారుల్లోనూ క్షతగాత్రులకు గోల్డెన్ హవర్ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.

సేవలు ఉచితం…
ప్రమాద స్థలాల నుండి క్షతగాత్రులకు అత్యవసర సేవలను అందించే ప్రాంతాలైన ట్రామాకేంద్రాలకు, లేదా అక్కడి నుండి హెలిప్యాడ్ దిగేందుకు అనువుగా ఉన్న ఆసుపత్రులకు తీసుకెళ్తారు. వారి పరిస్థితిని పరిగణలోకి తీసుకుని ఆసుపత్రులకు తరలింపు ఉంటుందని, క్షతగాత్రులను తరలించినందుకు ఎలాంటి రుసుంలు విధించడంగానీ, చార్జీలుగానీ తీసుకోవడం జరగదని ట్రూఎయిడ్ ప్రతినిధులు తెలిపినట్టు అథారిటీ అధికారులు వెల్లడిస్తున్నారు. చారిటీ ట్రస్టుల ద్వారా హెలిప్యాడ్ నిర్వాహణ వ్యయం అందుతుందని, ఈ సేవలను ఒక సంఘసేవగానే భావించి క్షతగాత్రులకు ప్రయాణ, తరలింపు సదుపాయాన్ని కల్పించుతున్నట్టు వారు స్పష్టంగా తెలిపారని అధికారులు వివరిస్తున్నారు.

ప్రత్యేక శ్రద్దతో ప్రభుత్వం : కమిషనర్ చిరంజీవులు

ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు గోల్డెన్ హవర్‌లో క్షతగాత్రుల కు వైద్యం అందించాలనేది ప్రభుత్వం ముఖ్యఉద్దేశ్యమని, అందులో భాగంగా హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్టు హెచ్‌ఎండిఎ కమిషనర్ చిరంజీవులు తెలిపారు. ట్రూఎయిడ్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై ప్రత్యేక శ్రద్దచూపుతుందని, ట్రామా కేంద్రాలను ఆధునికంగా ఏర్పాటుచేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు.

Comments

comments