Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

తనిఖీలతో హడల్

Police Checked in Lakshminagar colony

మన తెలంగాణ/సంగారెడ్డి ప్రతినిధి : తనిఖీలతో సంగారెడ్డి పోలీసులు హడలెత్తించారు. ఒకేసారి వందమందికిపైగా పోలీసు సిబ్బంది కదిలారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కంది మండలంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఆర్టీవో కార్యాలయం ఎదురుగా ఉన్న లక్ష్మీనగర్ కాలనీలో ఈ తనిఖీలు జరిగాయి. ఈ కాలనీ బెంగళూర్ హైవే పక్కన ఉంటుంది. అంతేకాకుండా వికారాబాద్ జిల్లా సరిహద్దులో, జిల్లా జైలుకు సమీపంలో, హైదరాబాద్ – ముంబాయి హైవేకు 2 కి.మీల దూరంలో ఉంటుంది.
అందువల్ల ఈ తనిఖీలు జరిపారు. జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు జరిపిన తనిఖీలతో కాలనీ వాసులతో పాటు పరిసర ప్రాంతాల వారు ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు. లక్ష్మీనగర్‌లోని ప్రతి వీధికి వెళ్లి అక్కడి జనాన్ని ప్రశ్నించారు. మీ పేరేమిటీ? ఎక్కడి నుంచి వచ్చారు? ఏమీ చేస్తారు? మీకు సంబంధించిన ఆధారాలు చూపండి అంటూ పోలీసులు అడిగారు. దీంతో ప్రతి ఒక్కరూ పోలీసులకు తమ సమాచారం ఇచ్చారు. ఎస్పీతో పాటు సంగారెడ్డి డిఎస్పీ, ఐదుగురు సిఐలు, 12 మంది ఎస్‌ఐలు, వందమంది ఇతర సిబ్బంది పాల్గొన్నారు. తగిన పత్రాలు లేని 27 ద్విచక్రవాహనాలను సీజ్ చేశారు. అదేవిధంగా 11 ఆటోలను, ఒక కారును కూడా సీజ్ చేశారు.
ఇద్దరు అనుమానితులను, ఒక రౌడీ షీటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్తగా ఇలాంటి తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా పోలీసు శాఖకు సహకరించాలన్నారు. తగిన పత్రాలు లేని వాహనాలను నడుపుతూ అనేక ప్రమాదాలకు కారకులవుతున్నారని, అంతేకాకుండా ఈ వాహనాలను కూడా కొంతమంది ఎక్కడి నుంచి తెస్తున్నారో తెలియడంలేదన్నారు. ఇలాంటి వాటి ద్వారా ఏదైనా ప్రమాదం జరిగితే విచారణకు ఆటంకాలు కలుగుతాయన్నారు. నిబంధనలకు విరుద్ధ్దంగా ఎవరు వ్యవహరించినా సహించేది లేదని, సరైన పత్రాలున్న వాహనాలు మాత్రమే కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. సరైన పత్రాలు లేని వాహనాలను అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నట్లు కాలనీ వాసులకు ఆయన తెలిపారు.

Comments

comments