Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

మానుకోట కాంగ్రెస్‌లో ‘గడి’ ప్రకంపనలు

Ryth Garjana program in Mahabubabad district

మన తెలంగాణ /మహబూబాబాద్ ప్రతినిథి: మానుకోట కాంగ్రెస్ గడిలో ప్రకంపనలు మొదలయ్యాయి. వర్గపోరు వివాదాలు ముదిరి పాకానపడ్డాయి. గిరిజన కాంగ్రెస్ నాయకులపై జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జెన్నారెడ్డి భరత్ చందర్‌రెడ్డి చేసిన ఫోన్ సంభాషణతో మానుకోటలో కాంగ్రెస్ వర్గాల మాటల తూటాలకు అవదులు లేకుండా పోయింది. జిల్లాలో కాంగ్రెస్ వర్గపోరు విషయాలు తాజాగా చర్చనీయాంశమయ్యాయి. చిలికి, చిలికి ముదిరిన కాంగ్రెస్ వర్గపోరు విభేదాలు అధికార పక్షానికి సంబరంగా మారాయి. జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుచిత్ర బాలునాయక్, ఎఐసిసి గిరిజన విభాగం ఉపాధ్యక్షులు బెల్లయ్యనాయక్, తాజాగా రాహుల్‌గాంధీని కలిసి కాంగ్రెస్ రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్న హుస్సేన్‌నాయక్‌లు మహబూబాబాద్ నియోజకవర్గంలో చేస్తున్న పార్టీ కార్యక్రమాలు  భరత్‌చందర్‌రెడ్డికి మింగుడు పడడంలేదు. వారి కార్యక్రమాలను అదుపు చేసే క్ర మంలో భరత్ జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుచిత్రను ఆల్‌రెడీ గడికి రావద్దని హెచ్చరించారు. అదే క్రమంలో తనకు తెలియకుండా బెల్లయ్యనాయక్, హుస్సేన్‌నాయక్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముల్లంగి ప్రతాప్‌రెడ్డిపై ఫోన్ సంభాషణలో భరత్‌చందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక స్థాయిలో ఆవేశానికి గురై గిరిజన నాయకులను సైతం దుర్భాషలాడిన ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో ప్రచారమై గిరిజన సంఘాలు రోడ్డెక్కాయి.

కాంగ్రెస్ నేత భరత్‌చందర్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు, రాస్తారోకోలే కాకుండా చివరకు ఆయన దిష్టిబొమ్మలను సైతం దహనం చేసి ఆందోళనలు చేపట్టారు. అదే సమయంలో ఎఐసిసి నుండి డిసిసి అధ్యక్షుల నియామకం జాబితా విడుదల కావడం, అందులో పాత వరంగల్ జిల్లాకే డిసిసి నియమిస్తూ నాయిని రాజేందర్‌రెడ్డిని ప్రకటించడంతో రగులుతున్న కాంగ్రెస్ వర్గపోరుకు ఆజ్యం పోసినట్లుయింది. దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద అర్ధనగ్న ప్రదర్శన చేసి కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో భరత్‌చందర్‌రెడ్డి గిరిజన నేతలపై చేసిన వాఖ్యలను తీవ్రంగా ఖండించారు. భరత్‌చందర్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గడి, దొరల పాలన నుండి భరత్‌చందర్‌రెడ్డి బయటకు రావాలని, భూస్వామ్య పెత్తందారీ విధానాలకు స్వస్థి చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
పరిస్థితి మరింత ముదురుతుందని గమనించిన జెన్నారెడ్డి భరత్‌చందర్‌రెడ్డి టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలవడంతో మహబూబాబాద్ డిసిసి అధ్యక్షుడిగా భరత్‌చందర్‌రెడ్డినే కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో భరత్ వర్గం ఊపిరి పీల్చుకుంది.
ఎవరెవరు ఏం చేశారు?
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రైతుగర్జన కార్యక్రమం చేపట్టినప్పుడు జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుచిత్ర బాలునాయక్ తనదైన శైలిలో ఫ్లెక్లీలు, బొకేలు, అతిధులకు టోపిలు బహూకరించి అధిష్టానం వద్ద తన సత్తా చాటుకున్నారు. అలాగే పలు కాంగ్రెస్ కార్యక్రమాల్లోనూ సుచిత్ర చురుకుగా పాల్గొని, ప్రతి కార్యక్రమంపై స్పందింస్తూ తరచూ మీడియాలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆమె కార్యక్రమాలకు అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముల్లంగి ప్రతాప్‌రెడ్డి సహకరిస్తూ పాల్గొంటున్నారు. అలాగే ఇటీవల మహబూబాబాద్‌కు కాంగ్రెస్ బస్సుయాత్ర వచ్చిన నేపధ్యంలో కూడా ఫ్లెక్సీలతో భరత్‌చందర్‌రెడ్డితో సహా టిపిసిసి నేతలకు విడివిడిగా ఫోటోలు పెట్టి ప్రతి ఒక్క కాంగ్రెస్ నేతకు స్వాగతం పలికారు. కానీ ప్రతి ఫ్లెక్సీలో తన ఫోటో లేదని అప్పటికప్పడు కాంగ్రెస్ కార్యకర్తలతో సుచిత్ర పెట్టించిన ఫ్లెక్సీలను భరత్‌వర్గీయులచే తొలగించారు. వేదికపై సుచిత్ర టిపిసిసి నేతలను ఘనంగా సన్మానించి తన పాత్రను పోషించారు. ఆ తర్వాత జరిగిన అంబేద్కర్ జయంతి రోజున జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా సుచిత్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు గడికి రావడంతో అక్కడ భరత్‌చందర్‌రెడ్డి ఎదురుగానే కొందరు ఆమెను అడ్డుకోవడం, గడికి రావద్దని, కార్యక్రమాల్లో పాల్గొనవద్దని చెప్పి అవమానించడంతో ఆమె కన్నీరుపెట్టినా భరత్‌చందర్‌రెడ్డి ఆమెను ఓదార్చలేదు. పైగా తనకు తెలియకుండా ఏ కార్యక్రమాలు చేపట్టవద్దని ఆమెను హెచ్చరించారు.
విస్తృత కాంగ్రెస్ కార్యక్రమాల్లో హుస్సేన్‌నాయక్
తాజాగా తెరపైకి వచ్చిన హైరిచ్ ఇంటర్నెట్ అధినేత జాటోత్ హుస్సేన్‌నాయక్ కాంగ్రెస్ బస్సుయాత్ర సందర్భంగా మహబూబాబాద్‌కు విచ్చేసిన టిపిసిసి నేతలకు వందలాది మందితో బైక్‌ర్యాలీ నిర్వహించి, జిల్లా కేంద్రంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ నేతల ఫోటోలతో భారీ ఎత్తున ఫ్లెక్సీలతో స్వాగతం పలకడమే కాకుండా కురవి రోడ్డులోని పెట్రోల్ బంక్ వద్ద వందలాది మంది తన అనుచరులతో ద్విచక్రవాహనాలతో టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఘన స్వాగతం పలికి తన కాన్వాయికి ముందు బైక్ ర్యాలీ చేస్తూ సభా వేదిక వద్దకు వచ్చారు. ఈ క్రమంలో రాజీవ్‌గాంధీ వర్దంతిని పురస్కరించుకుని హుస్సేన్‌నాయక్ నూతనంగా స్థాపించిన రాహుల్‌గాంధీ సేవా సమితి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిభిరం నిర్వహించడం, అందులోనూ అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముల్లంగి ప్రతాప్‌రెడ్డి పాల్గొని సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే ఎఐసిసి గిరిజన విభాగం ఉపాధ్యక్షులు తేజావత్ బెల్లయ్యనాయక్ కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మహబూబాబాద్‌కు తరచూ వస్తూ ఉండడం, ఆయన ఈ ప్రాంతానికి రావడం ఆయను కూడా ముల్లంగి ప్రతాప్‌రెడ్డిని కలవడం భరత్‌చందర్‌రెడ్డికి ఇష్టం లేకపోవడంతో అర్బన్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి అకస్మాత్తుగా తొలగించి రాజుగౌడ్‌ను నియమిస్తున్నట్లుగా ప్రకటించారు.
భరత్‌చందర్‌రెడ్డి ఎందుకిలా?
మహబూబాబాద్ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ టికెట్ ఆశించే వారి సంఖ్య నిత్యం పెరుగుతూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ భూక్య ఉమా, ఆమె భర్త డాక్టర్ మురళీనాయక్‌ల్లో ఏవరో ఒకరికి మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ఇప్పించేందుకు భరత్‌చందర్‌రెడ్డి వారికి హామీ ఇచ్చారు. వారు కాకుండా హుస్సేన్‌నాయక్, బెల్లయ్యనాయక్, సుచిత్ర పోటాపోటీగా కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొనడం పట్ల భరత్‌చందర్‌రెడ్డి తాను ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని పరిచయం చేస్తున్న ఉమను కాదని వారందరూ తిరగడం మింగుడు పడడడం లేదు. భరత్‌చందర్‌రెడ్డి వారిపై ఉన్న అక్కసును ముల్లంగి ప్రతాప్‌రెడ్డిపై తీర్చుకుంటున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
భరత్‌చందర్‌రెడ్డిపై పలువురి విమర్శలు
డిసిసి అధ్యక్షులు భరత్‌చందర్‌రెడ్డిపై మరో వర్గం పలు విమర్శలు చేస్తోంది. జిల్లా కేంద్రంలో దింగత కాంగ్రెస్ నేతల విగ్రహాలు ఉన్నా ఫోటోలు పెట్టుకుని గడిలోనే జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ నియంతలా వ్యవహరిస్తున్నారని భరత్‌రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో నెహ్రూ పేరుతో ఓ సెంటర్, అక్కడ నెహ్రూ విగ్రహం ఉన్నా విగ్రహానికి పూలమాల వేయకుండా గడిలో ఫోటో పెట్టి నెహ్రూ వర్దంతి జరపడం పలు విమర్శలకు తావిచ్చింది.ఇదిలా ఉండగా జిల్లా కాంగ్రెస్‌లో వివాదాలు తారాస్థాయికి చేరుకోక ముందే అధిష్టానం జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని జిల్లాలో పార్టీ అభివృద్ధిని కోరుకుంటున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోరుకుంటున్నారు.

Comments

comments