Search
Monday 21 May 2018
  • :
  • :

ఆరంభంలో జోరు… ఆఖరికి బేజారు

bsns

 కర్నాటక ఫలితాలతో తీవ్ర ఒడిదుడుకులు
 సెన్సెక్స్ 13, నిఫ్టీ 5 పాయింట్లు నష్టం

న్యూఢిల్లీ : కర్నాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌మార్కెట్లు ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. ఎన్నికల ఫలితాలకు అనుగుణంగా సూచీలు తీవ్ర ఒడుదుడుకు లకు లోనయ్యాయి. సూచీలు పెద్ద సముద్రం అలను తలపించాయి. ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగసిన సూచీలు.. ఆ తర్వాత మార్కెట్ ముగిసేయానికి బొక్కబోర్లా పడ్డాయి. దీనికంతటి కారణం కర్నాటక ఎన్నికల ఫలితాల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలే.. ఓ దశలో సెన్సెక్స్ 420 పాయింట్లు పెరిగి రికార్డ్ స్థాయి చేరగా.. మరోవైపు నిఫ్టీ 10,900 మార్క్‌ను క్రాస్ చేసింది. కానీ ఆఖరికి సెన్సెక్స్ 13 పాయింట్లు నష్టపోయి 35,544 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 5 పాయింట్లు పతనమై 10,802 వద్ద స్థిరపడింది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బిజెపి మ్యాజిక్ ఫిగర్‌కు కొద్దిపాటి దూరంలో నిలిచిపోవడంతో సూచీలు మిడ్ సెషన్ నుంచి తిరోగమనం బాటపట్టాయి. హంగ్ పరిస్థితులు ఏర్పడడంతో చివర్లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఎన్‌ఎస్‌ఇలో ప్రధానంగా పిఎస్‌యు బ్యాంక్స్ 2.4 శాతం, రియల్టీ 2 శాతం నష్టపోయాయి. ఆటో, ఫార్మా 0.8 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ఐటి మాత్రమే చెప్పుకోదగ్గ స్థాయిలో 0.5 శాతం బలపడింది.
బ్లూచిప్స్‌లో టాటా మోటార్స్, ఎస్‌బిఐ, కోల్ ఇండియా, ఐబి హౌసింగ్, ఎన్‌టిపిసి, గెయిల్, ఇన్‌ఫ్రాటెల్, గ్రాసిమ్, ఐటిసి, ఆర్‌ఐఎల్ 1 నుంచి 4 శాతం మధ్య నష్టపోయాయి. మరోవైపు టాటా స్టీల్, పవర్‌గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, టిసిఎస్, ఏసియన్ పెయింట్స్, లుపిన్, ఐషర్, టైటన్, యుపిఎల్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 3 శాతం వరకు లాభపడ్డాయి. మార్కెట్లతోపాటు చిన్న షేర్లూ డీలాపడ్డాయి. బిఎస్‌ఇలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.75 శాతం స్థాయిలో క్షీణించాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1612 నష్టపోగా.. 1027 షేర్లు లాభపడ్డాయి. గతవారమంతా అమ్మకాలకే ప్రాధాన్యమిచ్చిన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐలు) సోమవారం నగదు విభాగంలో రూ. 718 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. మరోవైపు దేశీ ఫండ్స్(డిఐఐలు) రూ.687 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి.

Comments

comments