Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

అడవిలో ఒంటరి గ్రామం…

Situation of the tribal population of the village of Penu Gol
వాజేడు : వాజేడు మండల కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఉన్న పెనుగోలు గ్రామం గిరిజనుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. తెలంగాణ,చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం భూపాలపల్లి జిల్లా వాజేడు మండల పరిధిలోని కొంగాల పంచాయితీలోని గుట్టలపై ఉన్న పెనుగోలు గ్రామ గిరిజనుల దుస్థితి అతి దారుణం.మండల కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో పెనుగోలు గ్రామం అది.ఇక్కడ అంతా గిరిజనులు మాత్రమే నివాసం ఉంటున్నారు. అనేక సంవత్సరాలుగా 40కుటుంబాలకు పైగా నివాసం ఉంటున్నారు. వాగుల నుండి వచ్చే నీరు తమ గ్రామంలో పోడు వ్యవసాయం ద్వారా పండించుకున్న పంటలను జీవానాధారంగా చేసుకుని ఇక్కడ పచ్చని ప్రకృతి ఒడి మధ్యలో ఏర్పాటు చేసుకున్న చిన్న చిన్న గడ్డి గుడిసెలలో నివాసముంటున్నారు. వాగులొ నుండి వచ్చే నీరు త్రాగు నీరును ఉపయోగించుకుంటూ ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. ఈ గ్రామానికి ఎవరైనా అధికారులు వెళ్లాలంటే కాలినడకన 20కిలోమీటర్లు మూడు గుట్టలు,మూడు వాగులు దాటి బండ రాళ్ళ మధ్య నడూచుకుంటూ ప్రయాణం చేయాల్సిందే. ఈ గ్రామంలోని ప్రజలు నిత్యవసర సరుకుల కోసం, వైద్యం కోసం 20కిలోమీటర్ల దూరం నుండి మండల కేంద్రానికి కాలినడకన రావల్సిందే. ఈ గుట్టలపై నివాసముండే వారిని మూడు సంవత్సరాల క్రితం మండల కేంద్రంలో బాలలక్ష్మీపురం అనే గ్రామాన్ని ఏర్పాటుచేసి గిరిజనులకు నివాస స్థలాలు అధికారులు ఏర్పాటు చేశారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఖమ్మం జిల్లా భద్రాచలం డివిజన్ ఐటిడిఎ ద్వారా సోలార్ విద్యుత్ పై ఆధారాపడి ఇప్పటివరకు అదే సోలార్ లైట్లపై రాత్రి వేళ చీకటి నుండి కొంతమేరకు ఉపశమనం పొందుతున్నారు. రాష్ట్రాలు మారిన,జిల్లాలు మారిన వారి తలరాతను మార్చేందుకు ఏ ఒక్క అధికారులు కానీ ,ప్రజాప్రతినిధులు కానీ ముందుకు రాకపోవడం తో అక్కడి గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుండి వచ్చే ఏటువంటి అభివృద్ధి పథకాలు ఇక్కడి గిరి పుత్రులకు చేరవు. అయినా సరే గ్రామస్థులంతా కలిసికట్టుగా ఉండి ఇక్కడ తట్టలు,బుట్టలు,వెదురు వస్తువులు తయారుచేసి గుట్టల పై నుండి దిగి వచ్చి వాటిని విక్రయించి జీవనోఫాధి పొందుతున్నారు.
పెనుగోలుకు వెళ్ళలంటే ఇలా…
పెనుగోలు గ్రామానికి వెళ్ళాలంటే మండలంలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలోని బొగత జలపాతం గుట్ట పై నుండి ఉన్న రాళ్ళ మార్గంలో నడుస్తూ మార్గంలో ఎదురయ్యే నేరేడువాగు,పాలవాగు,నల్లందేవ్ వాగుల నీటి లోతులో నుండి బిక్కుబిక్కుమంటూ దాటల్సిన పరిస్థితి వారిది. వర్షాకాలంలో ఏ మాత్రం అజాగ్రత్త వహించిన లోయలో కొట్టుకుపోయే ప్రమాదం ఉన్న వారు ప్రాణాలకు తెగించి వారి  పనులను ముగించుకొని వెళ్తూ జీవనం సాగిస్తుంటారు. వారు మండల కేంద్రానికి రావలంటే ఈ అటవీ మార్గంలో 20కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం కొనసాగిస్తే పెనుగోలు గ్రామానికి చేరుకోవచ్చు.చుట్టు పచ్చని అడవి మధ్యలో ఆహ్లదకరమైనా గిరిజనుల పెనుగోలు గ్రామం చూసేందుకు మాత్రం పర్యాటక కేంద్రంగా దర్శనమిస్తుంది.
అందని ద్రాక్షగా విద్య,వైద్యం…
పెనుగోలు గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉన్నప్పటికి ఇక్కడ రెగ్యులర్ విధులు నిర్వహించే ఉపాధ్యాయుల నియమాకం జరగకపోవడంతో గ్రామంలోని యువతి,యువకులు విద్యావాలంటీర్లుగా మారి అక్కడి చిన్నారులకు బోధన చేస్తుంటారు. దీంతో ఇక్కడ విద్య అందని ద్రాక్షగానే అయింది. అదేవిధంగా ఈ గ్రామంలోని గిరిజనులు అనారోగ్యనికి గురి అయితే వారిని గుట్టలపై నుండి జోలె కావడి కట్టి  మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకురావల్సిన పరిస్థితి నెలకొంది. ఈ గ్రామంలోని గిరిజనులకు వర్షాకాలం లో వైద్య సేవలు అందే పరిస్థితి లేదు. ఇక్కడ వైద్య సేవలు అందించేందుకు అప్పుడప్పుడు మండలకేంద్రం నుండి ఏఎన్‌ఎం వెళ్ళి వస్తు ఉంటుంది.
అభివృద్ధిని పట్టించుకొని అధికారులు…
గిరిజనుల అభివృద్ధి కోసం ఏర్పాటుచేసిన ఏర్పాటు చేసిన ఐటిడిఎ అధికారులు ఒక్కరు సైతం నేటి వరకు ఈ గ్రామాన్ని సందర్శించిన దాఖాలాలు లేవు.ఇక్కడ గిరిజనులకు అవసరమైనా సౌకర్యాలు సైతం ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకుపోవడం గమనార్హం.స్థానిక అధికారులు సైతం ఈ గ్రామాన్ని సందర్శించిన వారు లేరు.ఈ గ్రామాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పాల్వంచకు చెందిన స్కూల్ అసిస్టెంట్ యు ఆనంద్ కుమార్ అనే ఉపాధ్యయుడు ఈ గ్రామానికి వెళ్ళి ఇక్కడి గిరిజనులు స్థితి గతులను ఆధ్యయనం చేసిన అనంతరం ఈ గ్రామం పై ఆరవ తరగతి సాంఘీకశాస్త్రంలో ఒక పాఠ్యంశంగా పెట్టారు. ఇక్కడి గిరిజనులకు ప్రత్యేకంగా పాఠశాల ,వైద్యం కోసం హెల్త్ సెంటర్, తదితర సౌకర్యాలు ఏర్పాటుచేయల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్న జ్వరం వచ్చిన జోలె కట్టి మోసుకుని మండల కేంద్రానికి రావల్సిందే.ఇక్కడి గిరిజనులు తమంతట తమే ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా ఉంటూ జీవనం సాగిస్తున్నారు. బాహ్య ప్రపంచానికి దూరంగా పచ్చని అడవి తల్లి ఒడిలో గిరిజనులు నివాసం ఉంటూ …ప్రస్తుత ఆధునిక యుగంలో అన్ని సౌకర్యాలతో పాటు అరచేతిలో ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకునే ఈ రోజుల్లో సెల్‌ఫోన్‌లు 3జి,4జి సేవలు వీరికి తెలియవు.
వాగులు,చెలిమ నీరే దిక్కు…
ప్రస్తుతం మినరల్ వాటర్ లేనిదే చుక్కనీరు దిగని పరిస్థితిలో ఇక్కడి ప్రజలు జీవిస్తుండగా పెనుగోలు గ్రామ గిరిజనులకు మాత్రం వాగుల నుండి వచ్చే నీరు,చెలిమనీరే అమృతమైన త్రాగునీరు దిక్కుగా మారింది. వ్యవసాయానికి వర్షాధారం,వాగునీరుతోనే పంటలు పండించుకునే పరిస్థితి ఇక్కడ నెలకొంది.
గిరిజన గ్రామం పై ప్రజా ప్రతినిధులకు పట్టింపు ఏది…?
ఎన్నికల సమయంలో మాత్రమే ఇక్కడి గిరిజనులు ప్రజా ప్రతినిధులకు గుర్తు వస్తారు తప్ప ఆ తరువాత వారి సమస్యలు మాత్రం ఎవరు పట్టించుకోరని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో వారిని గుట్టలపై నుండి దింపి మరి ఓట్లు వేయించుకుంటారు…కానీ ఆ తరువాత పట్టించుకునే నాధుడే లేడు.

Comments

comments