Search
Friday 25 May 2018
  • :
  • :

11 పిఎస్ బి లకు కేంద్రం సహకారం

Three other banks are covered by the PCA

న్యూఢిల్లీ: ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) ఆధ్వర్యంలోని పిసిఎ(తక్షణ దిద్దుబాటు చర్య) పరిధిలో వున్న ప్రభుత్వరంగ బ్యాంకులు స్వల్ప కాలంలో ‘వారసత్వ సమస్యల’ నుంచి బయటపడగలవని కేంద్ర ఆర్థికమంత్రి పియూష్ గోయల్ వ్యాఖ్యానించారు. పిసిఎ పరిధిలో ఉన్న 11 పిఎస్‌బి(ప్రభుత్వరంగ బ్యాంక్)ల అధిపతులతో గురువారంనాడు ఆయన సమావేశమయ్యారు. పిసిఎ చర్యల నుంచి ఈ బ్యాంకులు బయటపడి, పటిష్టం అయ్యేందుకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సామాన్య ప్రజలకు ఈ బ్యాంకులు మరింత చేరువ అయ్యి, ఉన్నత ప్రమాణాలతో సేవలందించగలవని విశ్వాసం వ్యక్తం చేశారు. పిసిఎ పరిధిలో.. దేనా బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, యుకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వంటి 11 బ్యాంకులు ఉన్నాయి. బ్యాంకులు దివాలా స్థాయికి చేరకుండా ఉండేందుకు గాను పిసిఎ యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. దీని కింద ఉన్న బ్యాంకులపై ఆర్‌బిఐ ఆంక్షలు ఉంటాయి. ఆయా బ్యాంకుల పర్యవేక్షణ, నియంత్రణ, దిద్దుబాటు చర్యలు అన్ని ఆర్‌బిఐ ఆధ్వర్యంలో చేపడతారు.
పిసిఎ పరిధిలోకి మరో మూడు బ్యాంక్‌లు
మరో మూడు బ్యాంకులను ఆర్‌బిఐ ఆధ్వర్యంలోని పిసిఎ(తక్షణ దిద్దుబాటు చర్య) పరిధిలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్(పిఎన్‌బి), కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యుబిఐ)లు ఉన్నాయి. ఈ మూడు ప్రభుత్వరంగ బ్యాంక్‌ల నిరర్థక ఆస్తులు(ఎన్‌పిఎ) 6 శాతానికి పైగా ఉండడంతో ఆర్‌బిఐ వాటి ఆరోగ్య పరిస్థితిని మెరుగుపర్చేందుకు పిసిఎ పరిధిలోకి తీసుకోవాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. 2018 మార్చి ముగింపు క్యూ4 ఫలితాల్లో నీరవ్ మోడీ కుంభకోణంతో ప్రభావంతో పిఎన్‌బి మొండి బకాయిలు 11.2 శాతానికి పెరిగాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్‌పిఎ 8.4 శాతానికి, కెనరా బ్యాంక్ మొండి బకాయిలు 7.5 శాతానికి పెరిగాయి. ఆర్‌బిఐ నిబంధనల ప్రకారం, నికర ఎన్‌పిఎ స్థాయి 6 శాతం మించినా, వరుసగా రెండేళ్ల పాటు నష్టాలు వచ్చినా, సిఎఆర్(క్యాపిటల్ అడ్వకసీ రేషియో) నియంత్రణ సంస్థ అవసరాని కంటే దిగువన ఉన్నా.. పిసిఎ పరిధిలోకి ఆ బ్యాంకులను తీసుకుంటారు. ఇటీవల క్యూ4 ఫలితాలను ప్రకటించిన పిఎన్‌బి నికర ఎన్‌పిఎ స్థాయి 6 శాతాన్ని దాటగా.. మరింతగా క్షీణించే అవకాశాలు కనిపిస్తున్నాయని, అయినప్పటికీ పిసిఎ పరిధిలోకి తీసుకోలేదని, అన్ని అంశాలు పరిశీలిస్తోందని నిపుణులు కార్తిక్ శ్రీనివాసన్ అన్నారు.
ఆర్‌బిఐ సమీక్ష మూడు రోజులు
జూన్‌లో ద్రవ్యపరపతి విధాన సమీక్షను మూడు రోజుల పాటు నిర్వహించాలని ఆర్‌బిఐ నిర్ణయించింది. పాలనా వ్యవహారాలకు సంబంధించిన కొన్ని అవసరాల నిమిత్తం జూన్‌లో రెండో ద్రవ్యపరపతి సమీక్షను మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నామని ఆర్‌బిఐ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం జూన్ 5, 6 తేదీల్లో ఈ సమీక్ష జరగాల్సి ఉండగా.. జూన్ 4 నుంచి 6 వరకు సమావేశం చేపట్టనున్నామని తెలిపింది. అయితే ఈ ఏడాది జరగబోయే మిగతా సమీక్షల తేదీల్లో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేసింది. ఆర్థిక సంవత్సరంలో ప్రతి రెండు నెలలకోసారి ఆర్‌బిఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమీక్ష చేపడుతుంది. ఈ సమావేశంలో కీలక వడ్డీరేట్లు, భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయాలు తీసుకుంటారు. సాధారణంగా రెండు రోజుల పాటు ఈ సమీక్ష జరుగుతుంది.

Comments

comments