Search
Monday 25 June 2018
  • :
  • :
Latest News

కప్పు ఎవరిదో..?

Sun-vs-Chennai

 ఆత్మవిశ్వాసంతో చెన్నై, ప్రతీకారం కోసం హైదరాబాద్
 ఐపిఎల్ తుది సమరం నేడే

ముంబయి : ఐపిఎల్ పదకొండో సీజన్ సమరం తుది అంకానికి చేరుకొంది. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్‌కింగ్స్ జట్ల మధ్య జరిగే ఫైనల్‌తో ఈ మెగా క్రికెట్ సంబురానికి తెరపడుతోంది. ముంబయి వాంఖడే స్టేడియంలో జరిగే తుది సమరంలో రెండు జట్లు కూడా కప్పును ముద్దాడాలనే పట్టుదలతో ఉన్నాయి. ఇప్పటికే ఈ సీజన్‌లో హైదరాబాద్‌ను మూడు సార్లు ఓడించిన చెన్నై మరోసారి అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు ఫైనల్లో గెలిచి ఇప్పటి వరకు తమకు ఎదురైన పరాజయాలకు బదులు తీర్చుకోవాలని హైదరాబాద్ తహతహలాడుతోంది. కోల్‌కతాతో జరిగిన రెండో క్వాలిఫయర్‌లో అద్భుత విజయం సాధించి టైటిల్ పోరుకు చేరుకున్న హైదరాబాద్ ఆత్మవిశ్వాసంతో కనబడుతోంది. మరోవైపు గతంలో మూడు సార్లు సన్‌రైజర్స్‌ను చిత్తు చేసిన ఉత్సాహంతో చెన్నై మరో విజయంపై కన్నేసింది. రెండు జట్లు కూడా విజయమే లక్షంగా పెట్టుకోవడంతో పోరు నువ్వానేనా అన్నట్టు సాగడం ఖాయం. కాగా, కోల్‌కతాపై అసాధారణ రీతిలో చెలరేగిన యువ సంచలనం రషీద్ ఖాన్, కెప్టెన్ విలియమ్సన్, ఓపెనర్ శిఖర్ ధావన్‌లు హైదరాబాద్‌కు కీలకంగా మారారు. కాగా, కిందటి మ్యాచ్‌లో ఒంటిచేత్తో చెన్నైను గెలిపించిన ఓపెనర్ డుప్లెసిస్ ఈసారి కూడా హైదరాబాద్‌కు సవాలుగా తయారయ్యాడు. సీనియర్లు షేన్ వాట్సన్, సురేశ్ రైనా, అంబటి రాయులతో సన్‌రైజర్స్‌కు ప్రమాదం పొంచి ఉంది. అంతేగాక బ్రావో, జడేడా, హర్భజన్, చాహర్, వాట్సన్‌ల రూపంలో అగ్రశ్రేణి ఆల్‌రౌండర్లు చెన్నైకు అందుబాటులో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో చెన్నై ఈసారి కూడా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
బ్యాటింగే సమస్య…
ఫైనల్ పోరులో హైదరాబాద్‌కు బ్యాటింగ్ సమస్య వెంటాడుతోంది. చెన్నైతో పోల్చితే హైదరాబాద్ బ్యాటింగ్ చాలా బలహీనంగా ఉంది. ఓపెనర్ శిఖర్ ధావన్, కెప్టెన్ విలియమ్సన్ తప్ప మిగతా వారు నిలకడగా రాణించడంలో విఫలమయ్యారు. ధావన్ కూడా అడపాదడపాగానే బ్యాట్‌ను ఝులిపిస్తున్నాడు. అతని బ్యాటింగ్‌లో మునుపటి జోష్ కనిపించడం లేదు. అయితే కీలకమైన ఫైనల్ సమరంలో ధావన్ తన బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలిగే సత్తా కలిగిన ధావన్ విజృంభిస్తే భారీ లక్ష్యాన్ని ఛేదించడం, పెద్ద లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచడం హైదరాబాద్‌కు కష్టమేమి కాదు. మరోవైపు వృద్ధిమాన్ సాహా కూడా తన బ్యాట్‌కు పని చెప్పక తప్పదు. కిందటి మ్యాచ్‌లో ధావన్, సాహాలు మంచి ఆరంభాన్నే ఇచ్చారు. అయితే భారీ స్కోర్లను సాధించడంలో మాత్రం విఫలమయ్యారు. ఈసారి ఆలోటు లేకుండా చూడాల్సి ఉంది. మనీష్ పాండే, యూసుఫ్ పఠాన్, దీపక్ హుడా, సాకిబ్ అల్ హసన్ వంటి స్టార్లు ఉన్నా హైదరాబాద్ ఆశించిన స్థాయిలో భారీ స్కోర్లు సాధించలేక పోతోంది. లీగ్ దశలో, ప్లేఆఫ్‌లో కూడా బ్యాటింగ్ సమస్య హైదరాబాద్‌ను ఇబ్బందులకు గురి చేసింది. ఫైనల్లో ఈ పొరపాట్లకు తావు లేకుండా చూడాల్సిన బాధ్యత బ్యాట్స్‌మెన్‌పై ఉంది.
విలియమ్సన్‌పైనే భారం..
మరోవైపు ఒంటిచేత్తో పలు మ్యాచుల్లో హైదరాబాద్‌ను గెలిపించిన విలియమ్సన్ ఈ మ్యాచ్‌లో కూడా జట్టుకు కీలకంగా మారాడు. ఈ సీజన్‌లో విలియమ్సన్ భీకర ఫాంలో ఉన్నాడు. సహచరులు విఫలమవుతున్న సమయంలో తానే ముందుండి జట్టును కష్టాల్లోంచి గట్టెక్కించాడు. ఫైనల్లో కూడా జట్టు అతనిపైనే ఆశలుపెట్టుకుంది. అయితే ప్లేఆఫ్‌లో భాగంగా ఆడిన రెండు మ్యాచుల్లో కూడా విలియమ్సన్ విఫలమయ్యాడు. ఇది కాస్త ఆందోళన కలిగించే అంశమే. అయితే తుది సమరంలో మాత్రం జట్టుకు అండగా నిలువాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. విలియమ్సన్ నిలదొక్కుకుంటూ మాత్రం ప్రత్యర్థి జట్టు బౌలర్లకు కష్టాలు తప్పక పోవచ్చు. సాకిబ్, బ్రాత్‌వైట్, దీపక్ హుడా, మనీష్ పాండే తదితరులు కూడా తమవంతు పాత్ర పోషించాల్సిన అవసరం ఎంతైన ఉంది.
సరికొత్త ఆయుధం…
కిందటి మ్యాచ్ ద్వారా హైదరాబాద్‌కు మరో పదునైన అస్త్రం దొరికింది. ఇప్పటి వరకు బంతితోనే జట్టుకు అండగా నిలిచిన రషీద్ ఖాన్ కోల్‌కతాపై బ్యాట్‌తో కూడా చెలరేగి పోయాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో అసాధారణ రీతిలో రాణించి జట్టును ఒంటిచేత్తో ఫైనల్‌కు చేర్చాడు. ఈసారి కూడా జట్టుకు ప్రధాన అస్త్రంగా మారాడు. బ్యాట్‌తో, బంతితో చెలరేగాలని తహతహలాడుతున్నాడు. రషీద్ విజృంభిస్తే చెన్నైను తక్కువ స్కోరుకే పరిమితం చేయడం కష్టమేమి కాదు. సిద్ధార్థ్ కౌల్, భువనేశ్వర్, సందీప్ శర్మ, బ్రాత్‌వైట్‌లతో హైదరాబాద్ బౌలింగ్ చాలా బలంగా ఉంది. దీంతో జట్టు విజయమే లక్షంగా పోరుకు సిద్ధమైంది.

ప్రశంసల వర్షం…

కీలకమైన క్వాలిఫయర్ పోరులో అసాధారణ ఆటతో సన్‌రైజర్స్‌ను గెలిపించిన యువ సంచలనం రషీద్ ఖాన్ ప్రశంసల వర్షం కురుస్తోంది. అఫ్గాన్ ప్రధాని సైతం ట్విటర్ ద్వారా రషీద్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ట్విటర్ ద్వారా రషీద్‌పై ప్రశంసలు కురిపించాడు. ప్రపంచ క్రికెట్‌కు లభించిన ఆణిముత్యం రషీద్ అని కొనియాడాడు. మాజీ క్రికెటర్లు మహ్మద్ కైఫ్, ఆర్.పి.సింగ్, సంజయ్ మంజ్రేకర్, టామ్ మూడీ, వివిఎస్.లక్ష్మణ్, తెలంగాణ రాష్ట్ర మంత్రి కెటిఆర్, సినీ నటుడు మహేశ్‌బాబు తదితరులు కూడా సోషల్ మీడియా ద్వారా రషీద్‌ను అభినందించారు. అతనిలో అపార ప్రతిభ దాగివుందని, ఇలాగే రాణిస్తే ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన క్రికెటర్‌గా ఎదగడం ఖాయమని జోస్యం చెప్పారు.

జోరుమీదుంది…

ధోని సారథ్యంలోని చెన్నై సూపర్‌కింగ్స్ జోరుమీదుంది. ఇప్పటికే హైదరాబాద్‌ను మూడు సార్లు ఓడించిన చెన్నై ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే లక్షంతో ఉంది. బ్యాటింగ్‌లో చెన్నై చాలా బలంగా ఉంది. ఎంతటి భారీ లక్షమైన సులభంగా ఛేదిస్తున్నారు. షేన్ వాట్సన్, డుప్లెసిస్, అంబటి రాయడు, సురేశ్ రైనా, దీపక్ చాహర్, శామ్ బిల్లింగ్స్, ధోని, బ్రావోలతో చెన్నై బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక చాహర్, వాట్సన్, బ్రావో, శార్ధూల్ ఠాకూర్, హర్భజన్‌లతో బౌలింగ్ కూడా బాగానే ఉంది. దీంతో చెన్నైను ఏమాత్రం నిర్లక్షం చేసినా హైదరాబాద్ మరోసారి ఓటమి పాలుకాక తప్పదు.

Comments

comments