Search
Monday 21 May 2018
  • :
  • :

బావిలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి

 Two students died in the well

చిట్యాల : మండలంలోని ఉరుమడ్ల గ్రామంలో కనిపించకుండా పోయిన ఇద్దరు విద్యార్థుల ఆచూకి లభ్యమయ్యింది. ఈ ఇద్దరు విద్యార్థులు గ్రామ శివారులోని మాస బావిలో శవాలుగా గ్రామస్థులకు కనిపించారు. చిట్యాల ఎస్‌ఐ దేవేందర్‌రెడ్డి, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. సాగర్ల నర్సింహ,నాగమ్మల కుమారుడు ప్రవీణ్ (9), పాలకూరి సైదులు ,సుజాతల కుమారుడు పాలకూరి కిరణ్ (9)లు ప్రయివేటు పాఠశాలలో నాలుగవ తరగతి పూర్తి చేశారు. వేసవి సెలవులు కావటంతో ఇద్దరు కలిసి బుధవారం సాయంత్రం ఈత కొట్టడానికి బయటికి వెళ్లారు. చీకటి పడిన వారి ఇళ్లకు రాకపోవడంతో వారి తల్లి దండ్రులు ఆందోళనకు గురయ్యారు. దాంతో వారు ఊరంతా వెతకటం ప్రారంభించారు. ఆ సమయంలో గ్రామంలోని ఓ వ్యక్తి ఆ బాలురు మాస బావి వద్ద కనిపించారని తెలపటంతో ఆ బావి వద్దకు హుటాహుటిన వెళ్లి చూసే సరికి బావి గట్టు మీద విద్యార్థుల బట్టలు,చెప్పులు కనిపించాయి. దాంతో ప్రమాదవశాత్తు బావిలో పడ్డారేమోననే ఆందోళనతో సర్పంచ్ సుంకరి యాదగిరి ఆధ్వర్యంలో రాత్రి పొద్దు పోయేదాక బావి లో నీళ్లను మోటార్లతో తోడే ప్రయత్నం చేశారు. రాత్రి రెండు గంటల వరకు నీరును తోడే సరికి బావిలో విద్యార్థులు మృత దేహాలు కనిపించాయి. దాంతో ఆ విద్యార్థుల తల్లి దండ్రులు రోదనలు మిన్నంటాయి. విద్యార్థుల మృత దేహాలను బయటికి తీశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Comments

comments