Search
Monday 25 June 2018
  • :
  • :
Latest News

రెండు మెడికల్ కాలేజీలకు 1904 పోస్టులు

medical-posts

నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటులో మరో ముందడుగు పడింది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల నూతన మెడికల్ కళాశాలలకు పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం మంగళవారం 78 జీవో విడుదల చేసింది. మెడికల్ కళాశాల, ప్రభుత్వ జిల్లా క్రేంద ఆసుపత్రులకు సంబంధించి 36 వివిధ విభాగాల్లో 952 పోస్టుల చొప్పున రెండు జిల్లాల కళాశాలలకు 1904 పోస్టులను మంజూరు చేసింది. ఈ పోస్టులలో ఉద్యోగ నియామకాలను నేరుగా చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించింది. దీంతో మెడికల్ కళాశాలల ఏర్పాటు ప్రకియ మరింత వేగవంతమైంది. నల్లగొండ జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు రూ.275 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.

కళాశాల ఏర్పాటుకు పలు చోట్ల స్థల పరిశీలను చేసి ఎస్‌ఎల్‌బిసీ ప్రదేశంలో కాలేజీ భవన నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. సూర్యాపేట జిల్లాలో ఎస్వీ కళాశాల ఎదురుగా వున్న ఇంజనీరింగ్ కళాశాలలో గాని ఇతర ప్రైవేట్ స్థలాల్లో కాని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదన జరిగింది. ఇందుకోసం రూ.485 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. నల్లగొండలో 250 పడకలు కలిగిన జిల్లా కేంద్ర ఆసుపత్రిని 550 పడకలకు విస్తరింప చేశారు. చికిత్సా విభాగాలు పెరిగినంతగా సిబ్బంది సంఖ్య పెరగక పోవడంతో రోగులకు తీవ్ర అసౌకర్యంగా మారింది. ఔట్‌సోర్సింగ్ పద్దతిన రెండు జిల్లాలోని మెడికల్ కాలేజీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో జెన్సీల ద్వారా ఉద్యోగులను తీసుకోవాలని ప్రభుత్వం జారీ చేసిన జీవోలో పేర్కొంది. జిల్లాకు 237 చొప్పున రెండు జిల్లాలోని ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలకు సంబంధించి స్వీపర్, వార్డుబాయ్, స్ట్రెచర్ బేరర్స్, స్టెనోగ్రాఫర్, డ్రైవర్స్, ఎసి మెకానిక్, ఎలక్ట్రీషన్, దోబీ, టైలర్ తదితర పనులకు 474 మంది నియమించాలని తెలిపింది.

Comments

comments