Search
Saturday 23 June 2018
  • :
  • :
Latest News

తెలిసేవి ఊచల లెక్కలే!

childrens

అత్యంత అమానుషంగా, క్రూరంగా అత్యాచారం చేసి చంపేసిన నిర్భయ కేసు గురించి చాలా మందికి తెలుసు. జైలు అధికారులు జైల్లో ఒక మహిళా ఖైదీ పట్ల అలాగే వ్యవహరించి చంపేసిన కేసు బహుశా చాలా మందికి తెలియదు. మహారాష్ట్రలోని బైకుల్లా జైలులో గత సంవత్సరం జులైలో ఈ దుర్ఘటన జరిగింది. మహిళా ఖైదీ 38 సంవత్సరాల మంజులా శెట్టి విషయంలో జైలర్లు నిర్భయ ఉదంతంలో కన్నా క్రూరంగా వ్యవహరించారు. రక్తమోడుతున్న ఆమెను ఆసుపత్రికి కూడా చాలా ఆలస్యంగా తీసుకెళ్ళారు. జైల్లో మంచి నడవడి కారణంగా మంజులా శెట్టి తన బారక్స్ వార్డన్ గా ఉంది. జూన్ 23, 2017వ తేదీన తన బారక్స్ కు వచ్చిన రేషనులో రెండు గుడ్లు, ఐదు రొట్టెలు తక్కువగా ఉన్నాయని చెప్పడమే ఆమె చేసిన పాపం. ఆమెను జైలు అధికారి రూముకు పిలిచి చావబాదారు. ఆ తర్వాత మహిళా కానిస్టేబుళ్లు బారక్స్ కు వచ్చి ఆమెను చావబాదడమే కాదు, ఆమె బట్టలు విప్పి లాఠీలు మర్మాంగంలో గుచ్చారు. రక్తమోడుతున్న ఆమెను అలాగే వదిలేశారు. చాలా ఆలస్యంగా ఆసుపత్రికి తీసుకెళ్ళారు. చివరికామె ఆసుపత్రిలో మరణించింది.
భారత జైళ్ళలో మహిళలు ఎంత దారుణమైన స్థితిలో బతుకుతున్నారో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఒడిశా జైళ్ళలో ఏ తప్పు చేయని పసిపిల్లలు 46 మంది మగ్గుతున్నారు. వారి తల్లులు జైల్లో ఉన్నారు కాబట్టి ఆ పిల్లలకు కూడా జైలు తప్పలేదు. తప్పు చేసిన మహిళలకు శిక్ష పడాల్సిందే, కాని ఏ తప్పు చేయని పిల్లల సంగతేమిటి? ఒక పురుషుడు చట్టాన్ని అతిక్రమిస్తే శిక్ష విధించడం వేరు, కాని పిల్లలను సంరక్షిస్తున్న తల్లికి శిక్ష విధించినప్పుడు ఆ పిల్లల భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అలాంటి తల్లుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించి అవసరమైన సదుపాయాలు కల్పించాలి. శిక్షపడకుండా విచారణ కాలంలో ఉన్నవారైతే మహిళలకు కొన్ని మినహాయింపులు ఇవ్వాలి. మహిళా ఖైదీలకు సంబంధించిన గణాంకాలు పరిశీలిస్తే చాలా చిన్న చిన్న నేరాలకు, చిన్న పాటి దొంగతనాలకు జైళ్ళలో మగ్గుతున్నవారు చాలా మంది ఉన్నారు. దేశంలోని జైళ్ళలో రెండు శాతం కన్నా తక్కువ జైళ్ళు మహిళా ఖైదీలకోసం ఉన్నాయి. కాని ఖైదీల్లో మహిళలు 18 శాతం ఉన్నారు. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో గణాంకాలివి. 1394 జైళ్లలో కేవలం 20 మాత్రమే మహిళల జైళ్ళు. మొత్తం మహిళా ఖైదీలు 16951 మంది ఉంటే అందులో కేవలం 3200 మంది మాత్రమే మహిళా జైళ్ళలో ఉన్నారు. మహిళా ఖైదీల సంఖ్యలో 25 శాతం మంది మాత్రమే మహిళా సిబ్బంది ఉన్నారు. 2012 డిసెంబరు నాటికి మహిళా సిబ్బంది సంఖ్య 3935. ఇందులో 189 మంది అధికారులు, 2543 మంది జైలు కేడర్ సిబ్బంది, 646 మంది క్లరికల్ పనులు చూస్తున్నారు. 245 మంది మహిళా ఖైదీలకు ఒక సైకాలజిస్టు కరెక్షనల్ స్టాఫ్ గా ఉన్నారు. 105 మంది ఖైదీలకు ఒకే ఒక్క మెడికల్ స్టాఫ్. మహిళా ఖైదీల్లో అత్యధిక శాతం, అంటే 6842 మంది జిల్లా జైళ్లలో ఉన్నారు. సెంట్రల్ జైళ్ళలో 5,092 మంది ఉన్నారు. జైళ్ళలో ఉన్న వారిలో 4875 మంది మాత్రమే శిక్ష పడినవాళ్ళు కాగా, 11000 మంది అండర్ ట్రయల్స్, అంటే ఇంకా విచారణ పూర్తికాకుండా జైళ్లలో మగ్గుతున్నారు. జైళ్ళలో మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో దీన్ని బట్టి అర్ధమవుతుంది.
జైలుపాలయిన మహిళకు చిన్నపిల్లలు ఉంటే వారికి కూడా జైలు తప్పదు. 2015 చివరి నాటికి దేశంలో 17834 మంది మహిళా ఖైదీలు ఉంటే అందులో 66 శాతం అండర్ ట్రయల్స్. 32 శాతం శిక్షపడినవారు. మిగిలిన వారు డిటెన్యూలు, నిర్బంధంలో ఉన్నవారు, విదేశీయులు వగైరా. ఈ మహిళా ఖైదీలతో పాటు పిల్లలు కూడా ఉన్నారు. 2015 చివరి నాటికి ఇలా జైళ్ళలో ఉన్న 1597 మంది మహిళల పిల్లల సంఖ్య 1866. అంటే ఈ పిల్లలు ఏ తప్పు చేయకపోయినా జైళ్ళలో మగ్గుతున్నారు. విచిత్రమేమంటే ఇలా జైలు పాలయిన తల్లుల్లో 70 శాతం అంటే 1310 మంది అండర్ ట్రయల్స్, అంటే తల్లి నేరం నిర్ధారణ కాలేదు, అయినా తల్లితో పాటు ఆ పిల్లలు కూడా జైల్లోనే. 2014 నాటికి 1817 మంది ఇలాంటి పిల్లలు జైళ్ళలో ఉన్నారు. గర్భవతులుగా జైళ్ళకు వచ్చి అక్కడే పిల్లలను ప్రసవించిన కేసులు కూడా ఉన్నాయి. అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఈ పిల్లలు గడపవలసి వస్తుంది. ఈ పిల్లలకు చదువుకునే అవకాశం చాలా తక్కువ. చదివించే స్థితిలో ఆ తల్లి ఉండదు. ఈ పిల్లలకు సూది ఏమిటో, ట్రాక్టరేమిటో, కుక్క ఏమిటో కూడా చూసే తెలిసే అవకాశాలు ఉండవు. పిల్లలున్న మహిళా ఖైదీలు నోరెత్తే పరిస్థితి కూడా ఉండదు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం, స్వాతంత్య్రం వచ్చి ఏడుదశాబ్దాలు గడిచిపోయాయి. కాని సమాజంలో మహిళల పరిస్థితి మారలేదు. ఇక చిన్న చితక నేరాలకు జైలుపాలయిన మహిళల పరిస్థితి గురించి వేరే చెప్పాలా? ఇక్కడ గమనించవలసిన మరో ముఖ్యమైన విషయమేమంటే ఇలా జైలుపాలయ్యే మహిళల్లో అత్యధికశాతం పేద బడుగు బలహీనవర్గాల మహిళలే. 2014 డాటా ప్రకారం జైళ్ళలో ఉన్నవారిలో 53 శాతం దళిత, ఆదివాసి, ముస్లిమ్ సముదాయాలకు చెందినవారే. ముస్లిముల జనాభా దేశంలో 13.4 శాతమైతే జైళ్ళలో 20 శాతం ఉన్నారు. దళితుల జనాభా 16.6 శాతమైతే జైళ్ళలో 22 శాతం ఉన్నారు. ఆదివాసీ జనాభా 8.6 శాతమైతే జైళ్ళలో 11 శాతం ఉన్నారు. ఈ మూడు సముదాయాల జనాభా దేశంలో 39 శాతం కాని జైళ్ళలో 53 శాతం ఉన్నారు. ఈ గణాంకాలకు అర్ధం ఏమంటే ఆర్ధికంగా వెనుకబాటు వల్ల తమ కేసులను పోరాడే స్తోమత లేనందువల్ల వారు జైలుపాలయ్యారు. పేదరికం, వెనుకబాటుల వల్ల ఆ సముదాయాల వారిని ఆధారాలు లేకపోయినా అరెస్టు చేయడం సులభం. ఆ తర్వాత రిమాండుకు పంపడం కూడా జరిగిపోతుంది. ఈ గణాంకాలు 2012, 2013 నాటివి. జైళ్ళలో శిక్షపడిన వారి కన్నా అండర్ ట్రయల్స్ నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఉన్నవారే ఎక్కువ. మొత్తం 1,29,608 మంది శిక్షపడిన ఖైదీలు ఉంటే, 2,78,503 మంది అండర్ ట్రయల్స్ ఉన్నారు. ఏళ్ళ తరబడి జైళ్ళలో మగ్గిన తర్వాత నిర్దోషులుగా బయటపడిన వారెంతమందో. నేషనల్ దళిత్ మూమెంట్ ఫర్ జస్టిస్ కు చెందిన రమేష్ నాథన్ ఇంతకు ముందు ఈ విషయం గురించి మాట్లాడుతూ ఒకసారి అరెస్టు చేసిన ఇలాంటి వారిని మళ్ళీ మళ్ళీ ఏదో ఒక నేరానికి అరెస్టు చేయడం కొనసాగుతూ ఉంటుంది, అలా జైలు నుంచి బయటకు రావడం అనేది ఇక సాధ్యం కాని పరిస్థితి ఏర్పడుతుంది. పేద ఖైదీలు తమ కోసం లాయరును ఏర్పాటు చేసుకునే పరిస్థితి, స్తోమత ఉండదు. ప్రభుత్వం ఏర్పాటు చేసే లాయరుకు ఈ కేసుల పట్ల పెద్ద ఆసక్తీ ఉండదు. ఈ మహిళలతో మాట్లాడి కేసు వివరాలు తెలుసుకునే సమయమూ ఉండదు. చట్టం అందరికీ సమానమే. కాని చట్టం అమలు అందరికీ సమానంగా జరగదు. రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నప్పుడు కనిమొళిని తీహారు జైలుకు పంపారు 2జి స్కాములో. తాను మహిళనని, తాను తల్లి కూడా కాబట్టి తనకు బెయిలు ఇవ్వాలని ఆమె వాదించారు. ఆమె ఆరునెలలు జుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు ఆమెకు మహిళల విభాగంలో ప్రత్యేక సెల్, టెలివిజన్, టాయిలెట్ సౌకర్యం, ప్రత్యేకమైన బెడ్ ఇచ్చారు. ఆ తర్వాత బెయిలు కూడా మంజూరైంది. కాని అండర్ ట్రయల్స్ గా ఉన్న నిరుపేద మహిళలకు ఇవన్నీ లభించవు. ఈ ఖైదీల్లో దాదాపు 66 శాతం నిరక్షరాస్యులు. వారికి ఉచిత న్యాయసహాయం లభిస్తుందని కూడా తెలియదు. ఇందులో చాలా మంది ఎలాంటి నేరం చేసి కూడా ఉండరు. కేవలం అనుమానంతో నిర్బంధంలో మగ్గవలసి వస్తుంది. జైలు పాలయిన మహిళల్లో 80 శాతం మంది చిన్నా చితక నేరాలు, హింస ప్రమేయం లేనివి. దొంగతనాల వంటి నేరాలు చేసినవారని బ్రిటన్ లో జరిపిన ఒక సర్వే తెలియజేసింది. ఇంగ్లాండులోనే జరిగిన మరో సర్వే ప్రకారం మహిళా ఖైదీలలో 57 శాతం గృహహింస బాధితులు. 53 శాతం చిన్నప్పుడు లైంగిక దాడికి, వేధింపులకు గురైనవారు. దాడులకు, హింసకు గురికావడం, భరించలేక తిరగబడడం, నేరస్తురాలిగా మారడం జరుగుతోంది. చారిటి విమెన్ ఇన్ ప్రిజన్ ప్రకారం చాలా మంది మహిళలు తమ భర్త వ్యసనాల కోసం దొంగతనాల వంటి నేరాలు చేయవలసి వస్తోంది. యూనివర్శిటీ ఆఫ్ లండన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రిమినల్ పాలసీ రిసెర్చ్ ప్రకారం 20002017 మధ్య కాలంలో జైళ్ళలో మహిళల సంఖ్య రెట్టింపయ్యింది. పురుష ఖైదీల సంఖ్య తగ్గుముఖం పడుతున్నది కాని మహిళల సంఖ్య పెరుగుతోంది. ఒక్క అమెరికా జైళ్ళలోనే 7 లక్షల మంది మహిళా ఖైదీలున్నారు. విమెన్స్ ఇనిషియేటివ్ సపోర్టింగ్ హెల్త్ డైరెక్టర్ డా. డయానే మోర్స్ మాటలు అమెరికే కాదు ఇండియాకు కూడా వర్తిస్తాయి. అవేమంటే, భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగి, తనపై దాడి చేస్తున్న భర్తను ఆత్మరక్షణ కొరకు భార్య తిరిగి కొడితే భర్త వెంటనే పోలీసులను పిలవడానికి వెనకాడడు. కాని తనను భర్త కొడుతున్నా పోలీసులను పిలవాలని భార్య అనుకోదు. చాలా సందర్భాల్లో వ్యసనపరుడైన భర్త కోసమో, లేక శాడిస్టులా హింసిస్తున్న భర్త వల్లనో మహిళ నేరాలకు పాల్పడడమే జరుగుతుంది. చాలా మంది మహిళలు ఏ నేరం చేయకపోయినా అనుమానం వల్ల జైలుపాలయిన వారుంటే, చాలా మంది చిన్న చిన్న నేరాలకు జైలుపాలయినవారు. తీవ్రమైన హింసాత్మక నేరాలు కానప్పుడు ఇలాంటి మహిళలను జైళ్ళలో ఉంచేబదులు సమాజసేవ వంటి శిక్షలు విధించవచ్చు. పిల్లలున్న తల్లులను జైళ్ళలో ఉంచడమన్నది తీవ్రమైన నేరాలయితే తప్ప లేకపోతే వారి పట్ల మానవత్వంతో మెతగ్గా వ్యవహరించవలసిన అవసరం ఉంది. జైలులో ఉంచడం అవసరమని భావించినట్లయితే, అలాంటి మహిళల పట్ల ఉదారంగా వ్యవహరించాలి. అవసరమైన సదుపాయాలు కల్పించాలి. కేవలం మహిళలకే ప్రత్యేకించిన జైళ్ళలో మహిళా ఖైదీల పిల్లల కోసం మూడేళ్ళ లోపు పిల్లలయితే క్రచెస్, మూడేళ్ళ నుంచి ఆరేళ్ళ లోపు పిల్లలయితే నర్సరీలు నడపాలి. ఇంకా పెద్ద వయసున్న పిల్లలను బంధువులకు లేదా స్వచ్ఛంద సంస్థలకు అప్పగించాలి. కాని అమలు జరుగుతున్నది చాలా తక్కువ. గతేడాది ఇండియాలోని దాదా పు వెయ్యి జైళ్లలో అమానుష పరిస్థితులకు సంబంధించిన కేసు విచారిస్తూ సుప్రీంకోర్టు ఓపెన్ జైళ్ళను ప్రోత్సహించాలని చెప్పింది. అలవాటుగా, వృత్తిలా నేరాలు చేయని వారిని, దురదృష్టవశాత్తు నేరానికి పాల్పడిన వారిని ఓపెన్ జైళ్ళలో ఉంచడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. వారి సంస్కరణకు కూడా తోడ్పడుతుంది. కాని భారతదేశంలో ఓపెన్ జైళ్ళు కేవలం మగవాళ్లకు మాత్రమే అనే పరిస్థితి ఉంది. 2015 లెక్కల ప్రకారం ఓపెన్ జైళ్ళలో 3789 మంది పురుషులు ఉంటే కేవలం 109 మంది మాత్రమే స్త్రీలున్నారు. దేశంలో మొత్తం 63 ఓపెన్ జైళ్ళున్నాయి. కాని నాలుగు జైళ్ళలో మాత్రమే మహిళా ఖైదీలను తీసుకుంటారు. కేవలం మహిళలకు మాత్రమే ప్రత్యేకమైన ఓపెన్ జైళ్ల అవసరం ఉంది. అలాంటి జైళ్ళు ఇండియాలో రెండే రెండున్నాయి. మహిళలను ఓపెన్ జైళ్ళలోకి తీసుకోవడంలో అనేక ఆంక్షలున్నాయి. మహిళ కావడమే ఓపెన్ జైలుకు అనర్హతగా భావించబడుతుంది. భయంకరమైన నేరాలు చేసి కఠిన కారాగార శిక్ష అనుభవించే పురుష ఖైదీల మాదిరిగానే, చిన్న చితక నేరాలు చేసిన మహిళా ఖైదీలుఓపెన్ జైలు వంటి సదుపాయాలను వాడుకునే వీలు లేదు. ఇది హాస్యాస్పదమైన క్రూరమైన వాస్తవం. సాధారణంగా ఒక మహిళ ఏదన్నా నేరం చేయడానికి ముందు ఆమె స్వయంగా బాధితురాలై ఉంటుందని సామాజిక పరిశోధనలు చెబుతున్నాయి. చాలా మంది మహిళలు చేసే చిన్న చితక నేరాలు కుటుంబ సభ్యుల వ్యసనాల కారణంగా, వారికి డబ్బు సమకూర్చడం కోసం చేస్తారని తెలుస్తోంది. హింసాత్మక నేరాలు చేసిన మహిళలైనా సాధారణం గా భర్త, అత్తమామల దౌర్జన్యాలు, హింసాకాండ బాధితులై ఉంటారని కొన్ని అధ్యయనాలు తెలియజేశాయి. మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో మహిళా ఖైదీల నేరాల్లో సాధారణంగా కనిపించేది భర్త లేదా కుటుంబ సభ్యుల పట్ల క్రూ రంగావ్యవహరించడం అనేది ఒకటి. అంటే సుదీర్ఘకాలం భర్త పెట్టే బాధలు భరించి తిరగబడి ఉంటుందని మనం అర్ధం చేసుకోవచ్చు. అందువల్ల మహిళలను జైళ్ళలో పెట్టే విషయంలో ఉదారంగా వ్యవహరించి తగిన మినహాయింపులు ఇవ్వడం అవసరం.

ఒడిశా జైళ్ళలో ఏ తప్పు చేయని పసిపిల్లలు 46 మంది మగ్గుతున్నారు. వారి తల్లులు జైల్లో ఉన్నారు కాబట్టి ఆ పిల్లలకు కూడా జైలు తప్పలేదు. తప్పు చేసిన మహిళలకు శిక్ష పడాల్సిందే, కాని ఏ తప్పు చేయని పిల్లల సంగతేమిటి? ఒక పురుషుడు చట్టాన్ని అతిక్రమిస్తే శిక్ష విధించడం వేరు, కాని పిల్లలను సంరక్షిస్తున్న తల్లికి శిక్ష విధించినప్పుడు ఆ పిల్లల భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అలాంటి తల్లుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించి అవసరమైన సదుపాయాలు కల్పించాలి. శిక్షపడకుండా విచారణ కాలంలో ఉన్నవారైతే మహిళలకు కొన్ని మినహాయింపులు ఇవ్వాలి. మహిళా ఖైదీలకు సంబంధించిన గణాంకాలు పరిశీలిస్తే చాలా చిన్న చిన్న నేరాలకు, చిన్న పాటి దొంగతనాలకు జైళ్ళలో మగ్గుతున్నవారు చాలా మంది ఉన్నారు. జైళ్ళలో మహిళల పరిస్థితి చూస్తే మహిళల పట్ల మనం వ్యవహరించే తీరు ఇదేనా అని ప్రశ్నించుకోవలసి వస్తుంది. దేశంలోని జైళ్ళలో రెండు శాతం కన్నా తక్కువ జైళ్ళు మహిళా ఖైదీలకోసం ఉన్నాయి. కాని ఖైదీల్లో మహిళలు 18 శాతం ఉన్నారు. 

వాహెద్

Comments

comments