Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

ఆ విషయంలో చాలా స్పష్టంగా ఉంటా

ADhithi

మణిరత్నం ‘చెలియా’ చిత్రం ద్వారా దక్షిణాదికి పరిచయమైన బాలీవుడ్ భామ అదితిరావు హైదరీ. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ తెలుగు మూలాలున్న అమ్మాయి కావడం విశేషం. అదితి నటించిన తొలి తెలుగు చిత్రం ‘సమ్మోహనం’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం విడుదలకానుంది.ఈ సందర్భంగా అదితిరావు హైదరీ హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

నా కోసం ఆగారు…
ఒకరోజు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ నాకు ఫోన్ చేసి ‘సమ్మోహనం’ సినిమా గురించి చెప్పారు. ఐదు లైన్‌లలో కథ మొత్తం చెప్పారు. ఆయన చెప్పిన కథను ఎంతో శ్రద్ధగా విన్నాను. ఈ కథ నాకు నచ్చింది. అయితే వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న నేను కాల్షీట్లు సర్ది ఈ సినిమా చేశాను. నా కోసం ఈ సినిమా టీమ్ కొన్నాళ్ల పాటు ఆగారు.
ఆనందంగా అనిపించింది…
నన్ను ఎప్పుడు, ఎవరు అడిగినా నేను హైదరాబాదీని అని చెప్పుకుంటా. అలా చెప్పుకోవడానికి గర్వపడతాను. మా తాత ఇంట్లో ఉర్దూ, తెలుగు మాట్లాడమని చెప్పేవారు. కానీ నేను ఏ రోజు వాళ్ల మాట వినలేదు. డ్యాన్సింగ్, సింగింగ్… ఇలా చాలా నేర్చుకున్నాను కానీ నేనెప్పుడు తెలుగు నేర్చుకోలేదు. ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకొని డబ్బింగ్ చెబుతుంటే చాలా ఆనందంగా అనిపించింది.
గొప్ప అనుభూతినిచ్చింది…
మణిరత్నం దర్శకత్వంలో ‘చెలియా’ సినిమా చేయడం గొప్ప అనుభూతినిచ్చింది. ఈ చిత్రంతో నా కల నెరవేరింది. తెలుగులో ఈ సినిమా సరిగా ఆడకపోయినా తమిళంలో బాగా ఆడింది.
ఆస్ట్రోనాట్‌గా చేస్తున్నా…
సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలోని సినిమాలో ఆస్ట్రోనాట్‌గా చేస్తున్నాను. ఉదయాన్నే రోప్ వర్క్ నేర్చుకుంటున్నాను. నా కెరీర్‌లో ఈ చిత్రం ఓ స్పెషల్ మూవీగా నిలుస్తుంది.
కథ నచ్చితే…
ఓవైపు హీరోయిన్‌గా నటిస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చేయడంలో తప్పేమీ లేదని భావిస్తాను. నాకు కొంతమంది దర్శకులతో పనిచేయాలని ఉంది.
అలాంటి దర్శకులు చెప్పే కథ ముందు వింటాను. కథ నచ్చితే మిగిలినవన్నీ సెకండరీనే. ఆ విషయంలో నేను చాలా స్పష్టంగా ఉంటాను. మణిరత్నం దర్శకత్వంలో ఇప్పుడు రెండో సినిమా కూడా చేస్తున్నాను. తెలుగులో శేఖర్ కమ్ముల, తమిళంలో మిస్కిన్, గౌతమ్‌మీనన్‌లతో కలిసి పనిచేయాలనుంది.
బాగా కష్టపడతాను…
నేను బాగా కష్టపడి పని చేస్తా. మా అమ్మ నాకు నేర్పింది అదే. బ్యాక్‌గ్రౌండ్ ఎంతైనా ఉండొచ్చు కానీ నువ్వేంటనేది నువ్వు నిరూపించుకోవాలి అని నాకు చెప్పారు. అందుకే నేను బాగా కష్టపడతాను. ఎదుటివారిని గౌరవిస్తాను. నన్ను అవతలివాళ్లు గౌరవించాలని కోరుకుంటాను.

Comments

comments