Search
Saturday 23 June 2018
  • :
  • :
Latest News

కోటీశ్వరుడుగా రైతుబిడ్డ!

kabaddi

మోను గోయట్ 9 ఏళ్లకే కబడ్డీ ఆడటం ప్రారంభించాడు. తన మామ అయిన మాజీ కబడ్డీ ప్లేయర్ విజేంధర్ సింగ్ దగ్గర శిక్షణ పొందాడు. గోయట్ బాల్యం అంతా బివానీ జిల్లాలోని కుంగార్ గ్రామంలో కొనసాగింది. ఈ ఊరు నుంచి ఎంతో మంది జాతీయ స్థాయి ఆటగాళ్లు, కోచ్‌లు వచ్చారు. తన మామ కూడా 1990 బీజింగ్ గేమ్స్‌లో పాల్గొనే అవకాశాన్ని మోకాలి గాయంతో చేజార్చుకున్నాడు. ‘గోయట్ చురుకైన వాడు.. అందుకే అతన్ని క్రీడలను ఎంచుకోమన్నాను. రెండేళ్లలోనే స్టార్ రైడర్‌గా ఎదిగాడు’ అని మామ మురిసిపోతూ చెప్పాడు.

భారతదేశ ప్రాంతీయ క్రీడ అయిన కబడ్డీ ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తోంది. భారత్‌లో ఐపీఎల్ తర్వాత అంతగా ప్రజాదరణ పొందిన లీగ్‌గా ఇప్పటికే పీకేఎల్ గుర్తింపు పొందింది. ఐపీఎల్ తరహాలో దేశీయ, విదేశీ ఆటగాళ్ల తో ప్రారంభమైన పీకేఎల్ ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకొని ఆరో సీజన్‌కు సిద్దమైంది. ఇప్పటివరకు వరకు లక్షల్లో పలికిన ఆటగాళ్లు ఈ సీజన్‌లో కోట్లలో పలికారు. ఇలా ఓ రైతు బిడ్డ.. మోను గోయట్ ఇటీవల జరిగిన వేలంలో కోటిన్నర పలికి అందరి దృష్టిలో పడ్డాడు.
హర్యానా హిస్సార్ జిల్లాలోని హన్సీ అనే మారుమూల గ్రామానికి చెందిన మోను గోయట్ ఈ సీజన్ వేలంలో అధిక ధర పలికి చరిత్ర సృష్టించాడు. గతేడాది అత్యధికంగా పలికిన నితిన్ తోమర్ 96 లక్షల కన్నా ఇది 60 శాతం ఎక్కువ కాగా.. ఐపీఎల్‌లో విదేశీ స్టార్ ఆటగాళ్లు జాసన్ రాయ్, టీమ్ సౌథీ, సామ్ బిల్లింగ్స్‌లు పలికిన ధరల కన్నా కూడా ఎక్కువే.
స్టార్ రైడర్ అయిన మోను గోయట్ కోసం మూడు ఫ్రాంచైజీలు దబాంగ్ ఢిల్లీ, యూ ముంబా, హర్యాన స్టీలర్స్ పోటీ పడ్డాయి. చివరకు ఈ 25 ఏళ్ల జవాన్‌ను రూ. 1.51 కోట్లకు హర్యానా స్టీలర్స్ సొంతం చేసుకుంది. వేలం తొలి రోజు ఇరానీ ప్లేయర్ ఫజల్ అట్రాచలీ కోటి పలకడంతోనే సోషల్ మీడియాలో ప్రశంసలు కురిసాయి. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అయితే కబడ్డీకి మంచి రోజులొచ్చాయని సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు.
ప్రభుత్వ ఉద్యోగం కోసమే తాము క్రీడలను ఎంచుకునే వాళ్లమని గోయట్ చెప్పాడు. అప్పుడు తమ దగ్గర డబ్బులు లేవని, ఇలాంటి లీగ్‌లు కూడా లేవని ఈ రైతు బిడ్డ అభిప్రాయపడ్డాడు. గోయట్ తండ్రి తనకున్న 8 ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇంటర్ విలేజ్ టోర్నీ విజేతగా నిలిస్తే రూ.30వేల ప్రైజ్‌మనీ అందిందని, అది తన డిగ్రీ చదువులకు ఉపయోగపడిందని గోయట్ తెలిపాడు. ఉద్యోగ లక్ష్యం కోసం క్రీడలను ఎంచుకున్న గోయట్.. 2010లో ఆర్మీ సెలక్షన్ ట్రయల్స్‌లో ఎన్నికైన ఒకే ఒక వ్యక్తి గోయత్. ఇంకా గుర్‌గావ్ లో జరిగిన ఇండోర్, మధురైలలో జరిగిన వివిధ టోర్నమెంట్‌లలో బహుమతిగా డబ్బును గెలుచుకున్నాడు. గెలిచిన డబ్బుతో రెండు మోటారు బైకులు (బజాజ్ ప్లాటినా, టివిస్ సుజుకి) కొనుక్కున్నాడు.
వృత్తీరీత్యా కొన్ని కారణాలతో తొలి మూడు సీజన్లకు దూరమైన గోయట్ నాలుగో సీజన్‌లో 18 లక్షలకు బెంగాల్ వారియర్స్.. ఐదో సీజన్‌లో రూ.44.5 లక్షలకు పట్నా రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ డబ్బులతో తన ఊరులో ఇల్లును కట్టుకున్నాడు. సొంత కారు కొనుక్కున్నాడు. అయితే ఈ సారి అనూహ్యంగా కోటి యాభై లక్షల పలకడంతో ఆ డబ్బును ఏం చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదని గోయట్ చెప్పుకొచ్చాడు. కొంత డబ్బును తన అన్న పెళ్లికి ఖర్చుచేస్తానని తెలిపాడు. భారత్ తరపున ఆడటమే తన లక్ష్యమని తెలిపాడు.
గోయట్ ఆ కల కూడా నెరవేరనుంది. భారత తరపున దుబాయి కబడ్డీ మాస్టర్స్ టోర్నీలో అరంగేట్రం చేయనున్నాడు. అనంతరం ఆగష్టులో జరిగే జకర్తా ఆసియా గేమ్స్‌లో పాల్గొననున్నాడు. ఓ కబడ్డీ ఆటగాడిగా, ఆర్మీ ఉద్యోగిగా దేశానికి సేవచేయడమే నాకర్తవ్యం అని గోయట్ చెప్పుకొచ్చాడు. పీకేఎల్ 6వ సీజన్ అక్టోబర్ 19 నుంచి జరగనుంది.

Comments

comments