Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

ఆర్‌ఎస్‌ఎస్ ‘ఉదారవాదం’

edit

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని తమ సమారోహానికి ఆర్.ఎస్.ఎస్. ఆహ్వానించడం, దాన్ని ప్రణబ్ అంగీకరించడం మీద మీడియాలోనూ, ప్రజాభిప్రాయాన్ని ప్రోది చేసే వారిలోనూ విమర్శలకు, చర్చకు, రాద్ధాంతానికి దారి తీసింది. ఎవరికి కావలసిన వ్యాఖ్యానాలు వారు చేశారు. ఈ ఉదంతం వల్ల ఆర్.ఎస్.ఎస్.కు మేలు కలుగుతుందా, ప్రణబ్ ముఖర్జీకి ప్రయోజనం కలుగుతుందా అన్న చర్చలూ జోరుగా సాగాయి. ఇక్కడ ఎవరికి మేలు కలుగుతుందన్నది అంత ప్రధానమైన అంశం కాదు.
మాజీ రాష్ట్రపతిని ఆహ్వానించడంపై ఆర్.ఎస్.ఎస్. అధికార ప్రతినిధులు చేస్తున్న వాదనలను గమనించాలి. ఆర్.ఎస్.ఎస్. తాను ఉదారవాదంతో వ్యవహరిస్తున్నానని చెప్పుకోవడాన్ని తరచి చూడాలి. ఉదారవాద దృష్టితోనే తాము ప్రణబ్ ను ఆహ్వానించామని ఆర్.ఎస్.ఎస్. చెప్పడాన్ని రెండు అంశాల ఆధారంగా పరిశీలించాలి. మొదటిది-ఉదారవాదం అంటున్నప్పుడు అందులో భాగమైన సంవాదాలు, ప్రజాస్వామ్య ప్రక్రియలు గమనించడం ఇవి సానుకూల పరిణామాలకు ఏ మేరకు దారి తీశాయో గమనించడం. రెండవది ఒక ప్రజా రంగంలో ఉన్న వ్యక్తికి, ఉదారావాద సూత్రాలకు మధ్య ఉన్న సంబంధం.
అందువల్ల ఆర్.ఎస్.ఎస్.కు రెండు ప్రశ్నలు వేయాలి. ప్రణబ్ ను తాము ఉదారవాదం కారణంగానే ఆహ్వానించామని ఆర్.ఎస్.ఎస్. చెప్పుకుంటున్నా ఆ ఆహ్వానం వల్ల ఏర్పడిన ఏకాభిప్రాయాన్ని, నిర్ధారణలను ఆర్.ఎస్.ఎస్. అంగీకరిస్తుందా? మరో రకంగా చెప్పాలంటే ప్రజాస్వామ్య సూత్రాలను ఆర్.ఎస్.ఎస్. అంగీకరించేటట్టయితే అందరూ సమానమేనన్న నైతిక సూత్రాన్ని ఒప్పుకుంటుందా? ఒక వేళ ప్రణబ్ లాంటి వ్యక్తిని ఆహ్వానించాలని నిర్ణయిస్తే మాజీ రాష్ట్రపతితో సంవాదానికి ఉదారవాద సూత్రాలను తనంత తానే రూపొందించే చొరవ తీసుకుంటుందా? ఎందుకంటే ఆర్.ఎస్.ఎస్. ఉదారవాదా వైఖరిని అనుసరిస్తుందన్న విషయంలో సంశయాలున్నాయి.
మాజీ రాష్ట్రపతి ఆర్.ఎస్.ఎస్. ఆహ్వానాన్ని మన్నించకుండా ఉండాల్సింది అనే వాదనను పరాస్తం చేయడం కోసం ఆర్.ఎస్.ఎస్. అధికార ప్రతినిధులు ప్రజాస్వామ్య ప్రక్రియలను, నియమాలను వినియోగించుకుంటున్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలను మన్నించాలని చెప్పే విషయంలో ఆర్.ఎస్.ఎస్. ఉదారంగా కనిపిస్తూ ఉండవచ్చు. కాని ఈ ప్రక్రియల గురించి మాట్లాడినంత మాత్రాన సరిపోదు. ప్రజలందరూ ఒకటేనన్న సార్వజనీన వాస్తవాలను ఆమోదించినప్పుడే ఈ ప్రక్రియలకు విలువ ఉంటుంది. మానవ గౌరవం, మైత్రి, స్వేచ్ఛ, అందరికీ సమన్యాయం అన్నవే ఈ సూత్రాలు. మనిషికి ఉండే ప్రాధాన్యత ఓ జంతువుకు ఉండే ప్రాధాన్యతకన్నా తక్కువ ఉండకూడదు. ఆర్.ఎస్.ఎస్.తో సహా ఏ సంస్థ అయినా వచ్చిన నిర్ధారణలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై నిర్ధారణకు రావడం అవసరం. ఎందుకంటే ఆర్.ఎస్.ఎస్. పదే పదే ‘సెక్యులర్ వాదులమని చెప్పుకునే విపరీత అభిప్రాయాలు ఉన్న వారు నిజానికి సెక్యులర్ వాదులు కారు‘ అంటూ ఉంటుంది.
ఈ నిర్ధారణలు ఏకపక్షమైనవి. అందుకే వీటికి నైతిక బలం ఉండదు. ఇవి సర్వత్రా వర్తించేవి కావు. ఇవి బహిరంగ, దాపరికంలేని చర్చ నుంచి తప్పించుకోవడానికి ఉద్దేశించినవి. మనం అందరికీ ఉన్నత విలువలు ఉంటాయన్న ప్రాతిపదికన నిర్ణయానికి రావాలే గాని ఒక వ్యక్తికే ఆ విలువలు ఉంటాయని నిర్ధారించకూడదు. అదృష్టవశాత్తు భారత రాజ్యాంగం ఇద్దరు వ్యక్తుల మధ్య సామాజిక సంబంధం ఉండడానికి అవకాశం కల్పిస్తుంది.
ఒక ఆచరణను అమలు చేయడానికి సూత్రాలు అడ్డుపడేటట్టయితే ఏ సంస్థ అయినా వ్యక్తిని సూత్రాల నుంచి విడగొడ్తుంది. ఆ వ్యక్తి చేసే పనులు సవ్యమైనవేనని చెప్తుంది. సమానత్వం, కుల రహిత సమాజం, పితృస్వామిక వైఖరి, అసమానాతలను తొలగించడం, మానవులందరి గౌరవం ఒకటేనన్న అంశాలు ఈ సూత్రాల కిందకు వస్తాయి. ఇలాంటి వాటిని ఆచరించడం కష్టమే. ఉదాత్తమైన సూత్రాలు అనుసరించే డా. బి.ఆర్.అంబేద్కర్ సామాజిక సంకెళ్లు ఎక్కడ ఏ రూపంలో ఉన్నా వాటిని ఛేదించడానికే ప్రయత్నించారు. అలాంటి సంకెళ్లు లేని సమాజం కోసమే రవీంద్రనాథ్ టాగోర్, మహాత్మా గాంధీ, అంబేద్కర్ ప్రయత్నించారు. ఈ మేధావులకు పరిణామానికి ఉపకరించే ఆలోచనా ధోరణి ఉండేది. అందుకే వారు వ్యక్తిని తీవ్రమైన, సచేతనమైన సూత్రాల నుంచి విడదీయకూడదనుకున్నారు.
ఆర్.ఎస్.ఎస్. దేహరహితమైన వ్యక్తుల గురించి కాకుండా సూత్రాలను పాటించడంలో విపరీతంగా పరిణామం చెందవలసిన అగత్యం ఉందా? అలా కాకుండా లాంఛనప్రాయంగా కొందరు వ్యక్తులకు అవకాశం కల్పించడమంటే తప్పించుకునే దారి వెతుక్కోవడమే. కుల విభేదాలు, పితృస్వామిక వ్యవస్థను ఛేదించి సమాజ పరిణామానికి ఆర్.ఎస్.ఎస్. దోహదం చేస్తుందో లేదో తెలియదు. కాని ప్రస్తుతానికి ఆదివాసులు, మైనారిటీలు, దళితులలో కొందరు వ్యక్తులను లాంఛన ప్రాయంగా మాత్రమే ఆర్.ఎస్.ఎస్. చేరదీస్తోంది. సూత్రాలు మనిషిలో నైతిక/మేధోపరమైన సూత్రాలను రగులుస్తాయి. సంస్థలు ఈ అగ్ని చల్లారిన వారిని చేరదీస్తాయి. ఒక్కొక్క సారి సరైన సూత్రాలు కూడా తప్పుడు వ్యక్తులకు వర్తింపచేయవచ్చు. ఉదాహరణకు ఆర్‌ఎస్‌ఎస్ అంబేద్కర్ వాదన మితవాద సిద్ధాంతానికి ఆకర్షితులయ్యే దళితులను ఎంపిక చేసుకుంది. మన దేశంలో రాజకీయాలు వ్యక్తుల ఆధారంగా సాగుతాయి. ఈ వ్యక్తుల రాజకీయ చర్యలే ప్రధానం అవుతాయి. ఈ సూత్రానికి ఆర్.ఎస్.ఎస్. అతీతమైందా? ఏమో వేచి చూద్దాం.

* (ఇ.పి.డబ్ల్యు.సౌజన్యంతో)

Comments

comments