Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

ప్రణబ్ హితోపదేశం

Article about Modi china tour

నాగపూర్‌లోని తమ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించి సంఘ్ శిక్షణా శిబిరం సమాపన ఉత్సవంలో ప్రసంగించాలన్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ఆహ్వానాన్ని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ కుమార్ ముఖర్జీ అంగీకరించటం కలకలం సృష్టించినట్లే ఆయన ప్రసంగం సంచలనాత్మకం. కాంగ్రెస్ కురువృద్ధుడు ప్రణబ్ ముఖర్జీ ఆర్‌ఎస్‌ఎస్ ఆహ్వానం అంగీకరించటంపట్ల ఎక్కువగా కలత చెందింది కాంగ్రెస్ పార్టీయే. పార్టీ అధికారికంగా ఎటువంటి వ్యాఖ్య చేయకపోయినా పలువురు నాయకులు కువిమర్శలు చేశారు. లౌకికవాదులు, వామపక్షాలు కూడా సందేహాలు వ్యక్తం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ సమావేశానికి ప్రణబ్ వెళ్లటం వల్ల ఆ సంస్థకు అనవసరపు గౌరవనీయత, విశ్వసనీయత ఇచ్చినట్లవుతుంది. దాన్ని అది తన ఆమోదయోగ్యత పెంచుకునేందుకు ఉపయోగించుకుంటుందనేది వారి సందేహం. అయితే ఆయన ప్రసంగం భారతీయ విలువలను వక్కాణిస్తూ, ఆర్‌ఎస్‌ఎస్‌కు నీతిబోధలు చేసినట్లుగా సాగింది. రాజు ప్రజల సంతోషం కోసం కృషి చేయాలన్న చాణుక్యుణ్ణి ఉదహ రిస్తూ, ప్రధాని మోడీకి పరోక్షంగా, గతంలో వాజ్‌పేయిలాగా, ‘రాజధర్మం’ గుర్తు చేశారు. ప్రణబ్‌దా ఆర్‌ఎస్‌ఎస్‌కు దానిఅద్దంలో దాని ముఖం చూపించారంటూ అతిగా సంబరపడింది కాంగ్రెస్ పార్టీ.
ఇంతకూ ప్రణబ్ ముఖర్జీ హితబోధలేమిటో చూదాం. జాతి, జాతీయత, దేశభక్తి పదాలకు నిఘంటువు అర్థాలతో మొదలిడిన ప్రణబ్, భారతదేశం విషయంలో అవి ఎలా రూపుదిద్దుకున్నాయో వివరించటానికి 2500 సంవత్సరాల భారతదేశ చరిత్రను సూక్ష్మంగా ప్రస్తావించారు. “లౌకికత, సమ్మిళితం మనకు విశ్వాసం వంటి విషయాలు. మన మిశ్రమ సంస్కృతి మనల్ని జాతిగా చేస్తున్నది. భారతీయ జాతీయత అనేది ఒక భాష, ఒక మతం, ఒక శత్రువు కాదు. ఈ శాశ్వత సార్వజనీనతవల్లనే …. 130 కోట్ల మంది ప్రజలు ఒక వ్యవస్థ కింద, ఒక పతాకం కింద, ఒక గుర్తింపుతో జీవిస్తున్నారు. శాంతియుత సహజీవనం, ఆర్ద్రత, జీవితంపట్ల గౌరవం, ప్రకృతితో సామరస్యం మన నాగరికతకు పునాది” అని ఉద్ఘాటించారు. సాంస్కృతిక జాతీయవాదం అనే భావజాలంతో చరిత్రను వక్రీకరిస్తూ, హిందూ మతాధిక్యతతో కూడిన హిందూదేశం నిర్మాణం లక్షంగాగల ఆర్‌ఎస్‌ఎస్‌కు ఇవి రుచించవు.
“మతం, ద్వేషం, పిడివాద సిద్ధాంతాలు, అసహనం” ద్వారా భారతదేశాన్ని నిర్వచించే ఏ ప్రయత్నమైనా అది మన అస్తిత్వాన్ని దిగజార్చుతుందని మాజీ రాష్ట్రపతి హెచ్చరిక చేశారు. సంవాదం ద్వారానే మన రాజకీయ వ్యవస్థలో అనారోగ్యకరమైన వైరం లేకుండా జటిల సమస్యల పరిష్కారానికి అవగాహన పెంచుకోగలుగుతాం. మన బహిరంగ చర్చను అన్ని హింసాయుత రూపాల నుంచి స్వేచ్ఛ కల్పించాలి అని కూడా ఆయన చెప్పారు.
“భారత రాజ్యాంగం కేవలం లీగల్ పత్రం కాదు. సామాజిక ఆర్థిక పరివర్తనకు హక్కుల పత్రం. అది 130 కోట్ల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తున్నది. మన జాతీయత మన రాజ్యాంగం నుంచి ఉద్భవిస్తుంది. భారత జాతీయత స్వరూపం రాజ్యంగబద్ధ దేశభక్తి. మనకు వారసత్వంగా వచ్చిన, పాలుపంచుకుంటున్న భిన్నత్వాన్ని అది మెచ్చుకుంటుంది. భారతదేశ ఆత్మ బహుళత్వంలో, సహిష్ణుతలో ఉంది” అని ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ మార్గదర్శకత్వంలో పనిచేస్తున్న మోడీ ప్రభుత్వ పాలనలో దేశంలో జరుగుతున్న ఘటనలను ఈ వెలుగులో చూచినపుడు అది ఉద్దేశపూర్వకంగా తప్పుత్రోవలో, సంకుచితమైన హిందూత్వ మార్గంలో వెళుతుందని ఎవరైనా నిర్ధారణకు వస్తారు. ప్రజా కార్యక్షేత్రంలో చర్చ, ప్రజా చైతన్యం మాత్రమే దీన్ని వెనక్కి కొట్టగలదు.
ప్రణబ్ ముఖర్జీ ప్రసంగం ఆర్‌ఎస్‌ఎస్ నాయకులకు, శాఖలకు చెవిటి వాని ముందు శంఖం ఊదిన చందమే. ఆర్‌ఎస్‌ఎస్ సమావేశానికి ఆయన హాజరుకావటంపై విమర్శలను త్రోపిపుచ్చుతూ ఆసంస్థ అధినేత మోహన్ భగవత్ చెప్పిన మాటలు దీన్నినిరూపిస్తున్నాయి: “ఈ సమావేశం తదుపరి కూడా ముఖర్జీ తాను ఎలా ఉన్నాడో అలాగే ఉంటారు. సంఘ్ సంఘ్‌గానే ఉంటుంది”.
భారత జాతీయతను చారిత్రక కోణం నుంచి విశ్లేషించి లౌకికత, బహుళత్వం, సహిష్ణుత, రాజ్యాంగబద్ధ దేశభక్తి గూర్చి ప్రణబ్ ఉగ్గడింపుకు ఈనాటి దేశ పరిస్థితులు, ధోరణుల నేపథ్యంలో విశేష ప్రాధాన్యం ఉంది.

Comments

comments