Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

తీరానికి కొట్టుకొచ్చిన భారీ బ్లూ వేల్‌ కళేబరం

image

ముంబయి: 40 అడుగుల పొడువున్నభారీ తిమింగలానికి చెందిన కుళ్లిపోయిన కళేబరం గురువారం ముంబయి తీరానికి కొట్టుకొచ్చింది. నవీ ముంబయి సమీపంలోని ఖర్ దండా తీరంలో దీనిని మత్య్సకారులు గుర్తించారు. ఇది బ్లూ వెల్‌దే కావచ్చని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. 2015 నుంచి ఓ తిమింగలం కళేబరం మహారాష్ట్ర తీరానికి కొట్టుకొని రావడం ఎనిమిదోసారి కావడం గమనార్హం. ఈరోజు ఉదయం 8.30 గంటల సమయంలో దీనిని చూసినట్లు మత్య్సకారులు తెలిపారు. భూమ్మీదున్న ప్రాణుల్లో బ్లూ వెల్ అతి పెద్దది కావడం విశేషం. దీనిని కనుమరుగవుతున్న జాతుల జాబితాలో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రెడ్ లిస్ట్‌లో ఉంచింది. ఇప్పుడు ఒడ్డుకు కొట్టుకొచ్చిన తిమింగలానికి సంబంధించిన మూలుగ నమూనాలను పరీక్షల కోసం అధికారులు తీసుకున్నారు. ఈ తిమింగలం బరువు దాదాపు 20 టన్నులు ఉంటుందని అటవీశాఖ అధికారలు అంచనా కడుతున్నారు. అది కనిపించిన స్థలంలోనే దానిని ఖననం చేస్తామని అధికారులు చెప్పారు. అది చనిపోవడానికి అనేక కారణాలే ఉండవచ్చునని వారు తెలిపారు. ఇన్ఫెక్షన్, వయసు అయిపోవడం, ఏదైనా నౌక ఢీకొట్టడం లాంటిది జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

Comments

comments