Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

ఫిట్ నెస్ మంత్రం

ఈమధ్య వర్కవుట్ వీడియోలు, ఫిట్‌నెస్ ఫొటోలతో ఫేస్ బుక్‌లు, ఇన్‌స్టాగ్రాంలు, వాట్సాప్‌లు నిండిపోతున్నాయి. అందరి ఓటూ ఫిట్‌నెస్ మంత్రకే. ఫిట్‌నెస్ అంటే కండలు  తిరిగిన శరీరమని అనుకోవద్దంటున్నారు నిపుణులు.  శరీరంలోని కండరాలు, ఎముకలు ఆరోగ్యంగా ఉంటే మనం ఫిట్‌గా ఉన్నట్లు లెక్క. ఉదాహరణకు అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ పనిచేయడం లేదనుకోండి. ఎటువంటి ఇబ్బంది పడకుండా మెట్లు ఎక్కగలిగితే శరీరం దృఢంగా ఉందని అర్థం. అలాగే అలుపూసొలుపూ లేకుండా ఇంటిపనులు చేసుకోగలిగితే కచ్చితంగా ఫిట్‌గా ఉన్నట్లే. ఇలా మనకు మనం శరీర  ఆరోగ్యాన్ని అంచనా వేసుకోగలగాలి. ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత వ్యాయామం తప్పనిసరి అంటారు నిపుణులు. ప్రస్తుత ఉద్యోగ వ్యాపార బాధ్యతల్లో శరీరానికి అంతగా శ్రమ కలగడం లేదు. అందువల్ల లేనిపోని రోగాలబారిన పడుతున్నాం. కొన్ని అవయవాలకే వ్యాయామం ఉంటుంది. మిగతావి నిస్తేజంగా మారుతున్నాయి. అందుకే ఉదయం కనీసం ఓ అరగంట వాకింగ్, జాగింగ్, రన్నింగ్, యోగా లాంటివి చేయాలంటున్నారు వైద్యులు.

Fitt-ness

‘హమ్ ఫిట్ హోల్ ఇండియా ఫిట్’ అనే సవాలును  సమాచార, ప్రసారాల శాఖామంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోర్ సోషల్‌మీడియా ద్వారా  ప్రారంభించాడు. ఒలింపిక్ పతాక విజేతయైన రాథోర్  తను సొంతంగా పుష్ అప్స్ చేస్తున్న వీడియోను ట్వీట్ చేస్తూ ప్రజలందరూ తమ ‘ఫిట్‌నెస్ మంత్ర’ వీడియోను షూట్ చేసి అందరికీ పంచుకోవాలని ప్రోత్సహించాడు. దీంతో ఈ మధ్య హమ్ ఫిట్ ఛాలెంజ్ సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. ఫిట్‌తో ఇండియా ఫిట్ హ్యాష్ ట్యాగ్‌తో  రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ముందుగా క్రికెటర్ విరాట్‌కోహ్లీ..హృతిక్‌రోషన్‌లకు  ఛాలెంజ్ విసిరిన సంగతి తెలిసిందే. సవాల్‌ను స్వీకరించిన కోహ్లీ తాను చేస్తున్న వర్కవుట్లతో ఉన్న వీడియోను షేర్ చేశాడు. తర్వాత ఈ సవాల్‌ను భార్య, బాలీవుడ్ హీరోయిన్ అనుష్కశర్మ, ప్రధాని నరేంద్రమోడీ, క్రికెటర్ ఎం.ఎస్. ధోనీలకు ఇచ్చాడు.

విరాట్ ఛాలెంజ్‌కు ప్రధాని మోడీ స్పందించి, ఈ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నా,..త్వరలోనే  ఫిట్‌నెస్ వీడియో షేర్ చేస్తానని ట్వీట్ చేశాడు.  అనుష్క కూడా అంగీకరించి తాజాగా తన వీడియోను పోస్ట్ చేసింది. కేంద్రమంత్రి కిరణ్ రిజుజు  కూడా తన ఆఫీసు కార్యాలయంలో  వ్యాయామం చేస్తున్న  ఒక వీడియోను షేర్ చేశారు. ఈ కార్యక్రమానికి తాను అంగీకరిస్తున్నట్లు తెలుపుతూ సల్మాన్‌ఖాన్, అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రేమ ఖండ్, టివి నటి సౌమ్య టాండన్‌కు ఫిట్‌నెస్ సవాల్‌ను తెలియచేశారు. హృతిక్ తను ప్రతిరోజూ సైకిల్ తొక్కుతూ  ఉన్న వీడియోను తన  ఫిట్‌నెస్ సవాలుకు గుర్తుగా రాజ్యవర్థన్ రాథోర్‌కు సమాధానంగా షేర్ చేశారు. ఈ సవాల్‌తో  నేను రోజూ ఆఫీసుకు సైకిల్ తొక్కుతూ వెళుతున్నాను. నాకు చాలా గర్వంగా ఉంది. కారులో కూర్చుని వెళ్లటం నాకు నచ్చలేదు. నడవటం, సైకిల్‌తొక్కటం, జాగింగ్, నేల మీద నడుస్తూ వెళితే  ఫిట్‌నెస్ పొందిన అనుభూతి కలిగింది అని హృతిక్ సమాధానంగా రాథోర్‌కు పంపించారు. టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఈ ప్రచారానికి  శుభాకాంక్షలు తెలుపుతూ  ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన భారతదేశం అవ్వాలని కోరుతున్నానని రాథోర్‌కు ట్వీట్ చేసింది.

ఇప్పుడీ ఛాలెంజ్‌ను టాలీవుడ్ స్టార్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనానెహ్వాల్ ఈ ఛాలెంజ్‌ని దగ్గుబాటి రానాతోపాటు క్రీడాకారులు పి.వి సింధు, గౌతమ్ గంభీర్‌లను నామినేట్ చేసింది. సింధు నుంచి హీరో అఖిల్ ఈ సవాల్‌ను అందుకున్నాడు. అతను మరో నలుగురికి విసిరాడు. ఇందులో నాగార్జున, నాగచైతన్య. దుల్కర్  సల్మాన్, వరుణ్‌ధావన్‌లున్నారు. వీరిలో నాగచైతన్య ఫాస్ట్‌గా రియాక్టయ్యాడు. తన వీడియోను షేర్ చేసి, సమంత, నిధి అగర్వాల్, సుశాంత్‌లకు ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ను విసిరాడు.  నాగచైతన్య భార్య సమంతని ఫిట్‌నెస్‌కు నామినేట్ చేయగా, సామ్ స్వీకరించి, ఫిట్‌నెస్ వీడియోని పోస్ట్ చేసింది. కేవలం సెలబ్రిటీలే కాకుండా సామాన్య యువత కూడా ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లో భాగం పంచుకుంటోంది.కొన్ని జిమ్ సెంటర్లు ఈ సవాల్‌ను స్వీకరించి వర్కవుట్ చేస్తున్న వీడియోలను షేర్ చేస్తున్నాయి.

Comments

comments