Search
Saturday 23 June 2018
  • :
  • :
Latest News

అపార్ట్‌మెంట్లలో ఆయుధాలతో చెడ్డీ గ్యాంగ్

పోతిరెడ్డిపల్లిలో సంచారం… భయాందోళనలో జనం
Cheddi-gangసంగారెడ్డి ప్రతి నిధి : ఇప్పటివరకు రాజధాని శివారు ప్రాంతాలకే పరిమితమైన చెడ్డీగ్యాంగ్ ఇప్పుడు పరిసర జిల్లాలకు కూడా విస్తరించడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. చెడ్డీలు ధరించి అపార్ట్‌మెంట్లు, ఇండ్లలో రాత్రిపూట ప్రవేశించి దోపిడీ చేయడం, అడ్డువచ్చిన వారిని అంతమొందించడం ఈ గ్యాంగ్ పని. తాజాగా ముంబయి జాతీయ రహదారిపై ఉన్న సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో ఈ గ్యాంగ్ తిరిగినట్లు తెలుస్తోంది. పోతిరెడ్డిపల్లి గ్రామంలోని శివాలయం సమీపంలో అనేక అపార్డ్‌మెంట్లు ఉన్నాయి. ఇక్కడ మూడు అపార్ట్‌మెంట్‌లలో ఈ గ్యాంగ్ సంచరించింది. ఈ మేరకు సిసి కెమెరాల్లో రికార్డుఅయ్యింది. ఇది కాస్తా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ గ్యాంగ్ సంచరించడం సాధారణ విషయం కాదని, ఖచ్చితంగా భారీ దోపిడీకి పక్కా స్కెచ్ వేసి ఉంటారని భావిస్తున్నారు. దీంతో వీరి దోపిడీకి ఎవరు బలికావాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. సంగారెడ్డి రూరల్ పోలీసులకు సమాచారం అందడంతో వారు అప్రమత్తమయ్యారు. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, అనసరమైన ప్రచారాన్ని నమ్మవద్దని, తాము అలెర్ట్‌గా ఉన్నామని రూరల్ ఎస్‌ఐ తెలిపారు. సంగారెడ్డి మండలంలో సంచరించిన ఈ గ్యాంగ్ వార్త పట్టణంలో కూడా ప్రచారమైంది. ఈ కారణంగా పట్టణవాసులు సైతం ఆందోళన చెందుతున్నారు. గతంలో రాజధాని శివారు ప్రాంతంలో ఈ గ్యాంగ్ అనేక ఘటనలకు పాల్పడింది. దీంతో ఈ గ్యాంగ్‌పేరు ప్రముఖంగా మారింది. అయితే ఈ గ్యాంగ్ చడీచప్పుడు కాకుండా ముందే ఎంచుకున్న గృహాలకు చేరుకుంటుంది. రెక్కీ నిర్వహించి పథకం ప్రకారం దోపిడీకి పాల్పడుతుంది. సిసి కెమెరాల్లో వీరి ముఖాలు కనిపించకుండా జాగ్రత్తపడుతుంది. అయినప్పటికీ వివిధ సందర్భాల్లో వీరి కదలికలు బయటికి వచ్చాయి. ఫలితంగా ఈ గ్యాంగ్ పేరు చెబితేనే జనం బెంబేలెత్తుతున్నారు. ఈ కారణంగా రాజధానిలో ఈ గ్యాంగ్ పట్ల అటు పోలీసులు, ఇటు జనం అప్రమత్తంగా ఉన్నారు.

Comments

comments