Search
Saturday 23 June 2018
  • :
  • :
Latest News

నేడు ఢిల్లీకి సిఎం కెసిఆర్

రేపు ప్రధాని మోడీతో భేటీ
జోనల్ విధానంపై వివరించి సత్వర ఉత్తర్వులు కోరనున్న ముఖ్యమంత్రి

KCR

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం సాయంత్రం ఢిల్లీకి వెళ్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. ఈ నెల 17వ తేదీన రాష్ట్రపతి భవన్‌లో జరిగే నీతి ఆయోగ్ నాల్గవ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొననున్నారు. గత నెల చివరలోనే ఢిల్లీకి వెళ్ళిన కెసిఆర్ వివిధ అంశాలపై చర్చించేందుకు ప్రధానితో భేటీ కావాల్సి ఉన్నా సమావేశం కాలేకపోయారు. ప్రధానితో జరిగే భేటీ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను చర్చించనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఢిల్లీ పర్యటన ఖరారైన నేపథ్యంలో రాజ్‌భవన్‌కు వెళ్ళి గవర్నర్ నరసింహన్‌తో కెసిఆర్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైనే వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. నాలుగైదు రోజుల పాటు కెసిఆర్ ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది. ఇటీవల ప్రధానితో భేటీ అయ్యి ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత గవర్నర్‌తో కెసిఆర్ సుమారు రెండు గంటల పాటు చర్చించారు. మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న ముందురోజున గవర్నర్‌తో భేటీ అయ్యారు.
జోనల్ విధానంపై ప్రధానికి వివరణ :రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త జోనల్ వ్యవస్థకు శ్రీకారం చుట్టడంతో రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణ చేయాల్సి వస్తోంది. ఈ విషయమై ప్రధానికి వివరించి వీలైనంత తొందరగా రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణ లభించేలా చొరవ తీసుకోవాలని కోరనున్నారు. గత పర్యటన సందర్భంగా ప్రధానితో భేటీ కావాల్సిన ఉన్నప్పటికీ ప్రధాని కార్యాలయం నుంచి అపాయింట్‌మెంట్ రాకపోవడంతో సాధ్యంకాలేదు. రాష్ట్రానికి సంబంధించి కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉన్న పలు అంశాలను కూడా ఈ భేటీ సందర్భంగా ప్రస్తావించనున్నారు. ఆర్థికంగా వెనకబడినవర్గాలకు ఇవ్వనున్న రిజర్వేషన్లు, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎస్‌టి జనాభా పెరగడంతో రిజర్వేషన్లను పెంచాల్సిన ఆవశ్యకత, ఉపాధి హామీ పనుల్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడం… ఇలా అనేక అంశాలపై ప్రధానితో చర్చించనున్నట్లు తెలిసింది. ఇటీవల ప్రారంభించిన రైతుబంధు, త్వరలో ప్రారంభించనున్న రైతుబీమా తదితర అంశాలను కూడా ఈ సందర్భంగా వివరించనున్నారు. జాతీయ స్థాయిలో రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాల్సి ఉన్నదని, సహకార సమాఖ్య స్ఫూర్తితో కూడిన ప్రజా ఫ్రంట్ ఏర్పాటు అవసరమని, వివిధ ప్రాంతీయ పార్టీలతో భేటీ అయ్యి వివరించిన తర్వాత ప్రధానిని కలవడం ఇదే తొలిసారి. కాంగ్రెసేతర, బిజెపియేతర పార్టీలతో ఒక ఫ్రంట్ ఏర్పాటు కావాల్సిన ఆవశ్యకత ఉందని వ్యాఖ్యానించడమూ, కర్నాటకలో ఎన్నికల ఫలితాల్లో ప్రాంతీయ పార్టీ కీలక పాత్ర పోషించడం తదితరాలన్నింటి నేపథ్యంలో ప్రధానితో భేటీ సందర్భంగా ఏయే రాజకీయ అంశాలు చర్చకు వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

Comments

comments