Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

భూకబ్జాలపై ఇంటెలిజెన్స్ కన్ను

Collection of government lands

సర్కారు భూముల వివరాల సేకరణ
కబ్జాదారుల జాబితా సిద్ధం చేస్తున్న అధికారులు

మన తెలంగాణ/ఆదిలాబాద్ బ్యూరో : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జరుగుతున్న ప్రభుత్వ భూములు, చెరువులు, కందకాల ఆక్రమణలపై ఇంటెలిజెన్స్ అధికారులు రహస్యంగా ఆరా తీస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా జిల్లా కేంద్రాలైన ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ కుమ్రంభీంలలో గత కొంత కాలం నుంచి ఇష్టానుసారంగా భూఆక్రమణల పర్వం కొనసాగుతోంది. అధికారుల నిర్లక్ష వైఖరి, రాజకీయ అండదండలతో కబ్జాదారులు చెలరేగిపోతున్నారు. చెరువు శిఖం భూములను కొల్లగొడుతున్నారు. చారిత్రక కట్టడాలను ఈ కబ్జాదారులు వదలడం లేదు. జిల్లాకేంద్రాలలో భూముల విలువలు ఆకాశాన్నంటుతుండడంతో అందరి దృష్టి ఇటువైపే కేంద్రీకృతమవుతోంది. అయితే రాజకీయ నాయకుల అండతో కబ్జాదారులు అధికారులపై ఒత్తిళ్లు తెస్తూ తప్పుడు రికార్డులు సృష్టిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. చెరువులు, కందకాల భూములకు సంబంధించి రికార్డులను తారుమారు చేస్తూ అక్రమ రిజిస్ట్రేషన్లను చేస్తున్నారని అంటున్నారు. పట్టణాల నడిబొడ్డున సైతం వదలడం లేదని ఆదిలాబాద్ ఖానాపూర్ చెరువు శిఖం భూముల ఆక్రమణ యధేచ్చగా సాగుతోంది. అలాగే ఇక్కడి అనేక కందకాలు ఇప్పటికే ఆక్రమణకు గురికాగా, మిగిలిన వాటిని కూడా కొల్లగొట్టే ప్రయత్నాలు సాగుతున్నాయి. నిర్మల్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉన్నట్లు స్వయంగా అధికారులే అంగీకరిస్తున్నారు. ఇక్కడి పట్టణానికి ఆనుకొని ఉన్న గొలుసు కట్టు చెరువులను కబ్జాదారులు వరుసపెట్టి ఆక్రమిస్తున్నారు. ఈ కబ్జాల కారణంగా చారిత్రక చెరువులు కనుమరుగై పోతున్నాయి. ఇక్కడి కోటలు, బురుజులు సైతం ఇప్పటికే కబ్జాకు గురయ్యాయి. చెరువు భూములు, చారిత్రక కట్టడాలకు సంబంధించి సర్వే నెంబర్లు సైతం సృష్టిస్తున్నారు. నకిలీ పట్టాదార్ పుస్తకాలతో ఈ భూములపై రుణాలను సైతం తీసుకుంటున్నారు. అయితే ఇంత పెద్ద ఎత్తున కబ్జాల పర్వం కొనసాగుతున్నప్పటికీ అధికారులు ఆశించిన రీతిలో స్పందించక పోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ భూ ఆక్రమణల కారణంగా ప్రభుత్వ ప్రతిష్ట దిగజారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతుండడంతో ఎట్టకేలకు నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటలిజెన్స్ వర్గాలు రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. నాలుగు జిల్లాల వారీగా ప్రభుత్వ, శిఖం భూములను సేకరించి ఇంటలిజెన్స్ వర్గాలు ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. దీనికితోడుగా భూములను కబ్జా చేసిన వారి జాబితాలను సైతం ఇంటలిజెన్స్ వర్గాలు రూపొందించి ఆ జాబితాను ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంటలిజెన్స్ జాబితా ఆధారంగా రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు పోలీసు కేసులు నమోదు చేయించే చర్యలు కూడా మొదలు కానున్నట్లు పేర్కొంటున్నారు. అయితే ఇప్పటికైనా యుద్దప్రాతిపదికన ఆక్రమణకు గురైన సర్కారు భూములను రక్షించేందుకు చర్యలు మొదలు పెట్టాలని పలువురు సూచిస్తున్నారు. దీనికితోడుగా సర్కారు భూములను కాపాడేందుకు కంచెలు ఏర్పాటు చేయాలని కూడా కోరుతున్నారు.

Comments

comments